Site icon NTV Telugu

వైసీపీలో పాలకొల్లు సీటు ఎవరిది…?

వైసీపీలో పాలకొల్లు సీటు ఎవరిది? ఎన్నికలకు ఇంకా చాల టైమ్‌ ఉన్నా.. అధికారపార్టీలో స్థానికంగా ఈ అంశంపై పెద్ద చర్చే జరుగుతోంది. గతంలో పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకుడు తిరిగి వైసీపీ కండువా కప్పుకోవడంతో సమీకరణాలపై ఆసక్తి రేగుతోంది. దీంతో టికెట్‌ ఆశిస్తున్న నేత పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో పాలకొల్లు టికెట్‌ తనదే అన్న ధీమాలో కవురు..!

కవురు శ్రీనివాస్‌. పశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌. పాలకొల్లు వైసీపీ ఇంఛార్జ్. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. కుల సమీకరణాల్లో భాగంగా కవురు శ్రీనివాస్‌ను వరసగా పదవులు వరిస్తున్నాయి. మొదట ఎంపీపీ తర్వాత DCCB ఛైర్మన్‌.. ఇప్పుడు జడ్పీ ఛైర్మన్‌. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకొల్లులో టీడీపీ గెలవడంతో ఇక్కడ పూర్తిస్థాయిలో పాగా వేయడానికి స్థానిక వైసీపీ నేతలకు పదవులు క్యూ కట్టాయి. అందులో శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన కవురు మొదటి వరసలో నిలిచారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ తనదే అన్న ధీమాతో ఆయన ఉన్నారట. ఇంతలో పరిస్థితి మారిపోవడంతో ఆసక్తికర చర్చ మొదలైంది.

ఆచంట టికెట్‌ రాకపోవడంతో పాలకొల్లుపై కవురు ఫోకస్‌..!
గుణ్ణం నాగబాబు తిరిగి వైసీపీలోకి రావడంతో కొత్త చర్చ..!

కవురు శ్రీనివాస్‌.. 2019 ఎన్నికల్లోనే అసెంబ్లీకి పోటీ చేయాలని చూశారు. ఆచంటపై ఆశ పెట్టుకున్నారు కూడా. చివరి నిమిషంలో ఆ సీటు చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు ఇవ్వడంతో తీవ్ర నిరాశ చెందారు. అదే ఎన్నికల్లో పాలకొల్లు నుంచి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాబ్జీ వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో.. ఈ నియోజకవర్గాన్ని అడ్డాగా చేసుకున్నారు కవురు. అయితే ఆ ఎన్నికల్లో పాలకొల్లు టికెట్‌ ఆశించారు మరో వైసీపీ నేత గుణ్ణం నాగబాబు. టికెట్‌ లభించకపోవడంతో వైసీపీని వీడి జనసేనలోకి వెళ్లిపోయారు నాగబాబు. ఇటీవలే ఆయన తిరిగి వైసీపీలోకి వచ్చారు. తనకు ఇంఛార్జ్‌ పదవి కట్టబెడతారని నాగబాబు ప్రచారం చేసుకుంటున్నారట. దీంతో పాలకొల్లులో పరిస్థితి మారిందని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

సొంత సామాజికవర్గంలోనే కవురుకు వ్యతిరేకత మొదలైందా?

పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును ఎదుర్కోవాలంటే అదే సామాజికవర్గానికి పట్టం కట్టాలనే టాక్‌ వైసీపీలో మొదలైందట. ఇదే సమయంలో ఇంఛార్జ్‌ కవురు శ్రీనివాస్‌పై శెట్టిబలిజ సామాజికవర్గంలోనే వ్యతిరేకత కనిపిస్తోందని ప్రచారం స్టార్ట్‌ చేశారు. జడ్పీ ఛైర్మన్‌ అయ్యాక.. ఆ సామాజికవర్గాన్ని ఆయన అస్సలు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. శెట్టిబలిజ సామాజికవర్గం నిర్వహించే కార్యక్రమాలకు దూరం పాటిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సొంత వాళ్లను వదిలేసి మిగతా వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్రుగా ఉన్నారట. దాంతో పనులు కావాల్సిన వాళ్లు కవురు దగ్గరకు కాకుండా ఎమ్మెల్యే నిమ్మల దగ్గరకు వెళ్తున్నారట. నిమ్మల దగ్గర నుంచి ఫోన్లు వెళ్లితే.. విపక్ష MLAతో ఎందుకు తలనొప్పి అని వెంటనే పనులు చేసేస్తున్నారట. అదే కవురు ఏదైనా చెబితే.. ఎందుకు చేశారని అధికారులను ప్రశ్నిస్తూ నిమ్మల ధర్నాలకు దిగుతున్నారట.

గుణ్ణం నాగబాబుకు ఇచ్చిన హామీ ఏంటి?

మారిన ఈ పరిస్థితుల్లో కవురు శ్రీనివాస్‌కు వైసీపీ ఇంఛార్జ్‌ పదవి ఉంటుందా లేదా అనే చర్చ మొదలైంది. గతంలో ఆచంటను వదులుకున్నట్టే పాలకొల్లును కూడా వదిలేసుకుంటారా అని చెవులు కొరుక్కుంటున్నారట. ఇదే సమయంలో ఇంఛార్జ్‌ పదవి హామీతోనే గుణ్ణం నాగబాబు తిరిగి పార్టీలోకి వచ్చారనే చర్చ ఓ రేంజ్‌లో ఉంది. మరి.. వైసీపీలో పాలకొల్లు ఎవరిదో కాలమే చెప్పాలి.

Exit mobile version