ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టిఆర్ఎస్ వైఖరి ఏంటి? విపక్షాల అభ్యర్థికి మద్దతిస్తుందా? దక్షిణాది లేదా తెలుగు రాష్ట్రాలకు చెందినవారు బరిలో ఉంటే ఏం చేస్తారు? గులాబీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి?
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించింది తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్ పార్టీ. హైదరాబాద్ వచ్చిన సిన్హాకు ఘన స్వాగతం పలికింది కూడా. ఇదే అంశంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, NCP చీఫ్ శరద్ పవార్ నిర్వహించిన సమావేశాలకు టీఆర్ఎస్ వెళ్లలేదు. దీంతో గులాబీ పార్టీ వైఖరి ఏంటా అని చర్చ జరుగుతున్న సమయంలో సీఎం కేసీఆర్‌కు శరద్ పవార్ ఫోన్‌తో అంతా మారిపోయింది. యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతు తెలియజేయడమే కాదు.. ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమానికి కూడా టీఆర్ఎస్ ప్రతినిధులు వెళ్లారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తోంది కూడా. ఇంతలోనే ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా వచ్చాయి. ఈ అంశంలో టీఆర్ఎస్ ఆలోచనలు ఏంటి? రాష్ట్రపతి ఎన్నికల మాదిరే ముందడుగు వేస్తుందా? లేక సమయానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందా అనేది చర్చ.
2014లో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జరిగిన రాష్ట్రపతి ,ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. రాంనాథ్ కోవింద్ ఎస్సీ సామాజికవర్గం.. వెంకయ్య నాయుడు తెలుగువారు కావడంతో మద్దతు ఇస్తున్నట్టు ఆనాడు ప్రకటించింది. ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ దఫా ఎన్డీయే అభ్యర్థికి మద్దతివ్వలేదు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలోనూ అదే చేస్తుందా అనే చర్చ ఉంది. బీజేపీ పరిశీలనలో వెంకయ్య నాయుడు, గవర్నర్ తమిళిసై పేర్లు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే NDA అభ్యర్థి ఎవరో తేలిన తర్వాత టీఆర్‌ఎస్ తన వైఖరిని వెల్లడిస్తుందని సమాచారం. పైగా దక్షిణాదికి చెందినవారో లేక తెలుగువారో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెరమీదకు వస్తే టీఆర్‌ఎస్ ఏం చేస్తుంది అనేది ప్రశ్న.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేవలం పార్లమెంట్ ఉభయ సభల్లోని సభ్యులే ఓటు వేస్తారు. రెండు సభల్లోనూ NDAకు స్పష్టమైన మెజారిటీ ఉంది. ఆ లెక్కలను దృష్టిలో పెట్టుకునే విపక్షాలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చర్చ. నామినేషన్ల దాఖలుకు ఇంకా గడువు ఉండటంతో NDA వడపోతల్లో ఉంది. అందుకే బీజేపీ కసరత్తు కొలిక్కి వచ్చాకే టీఆర్‌ఎస్ వైఖరిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
