NTV Telugu Site icon

Congress : చింతన్ శిబిర్ నిర్ణయాలు అమల్లోకి వచ్చినట్టేనా..!

Hush Kaki

Hush Kaki

రాజస్థాన్‌ ఉదయపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ చింతన్‌ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాలపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.ఐదుళ్లు పార్టీ పదవుల్లో ఉన్నవారిని పక్కన పెట్టడం.. అదే పదవిలో కొనసాగించడం సాధ్యం కాదని తేల్చేయడం.. కొత్త పదవులు ఇస్తారో లేదో స్పష్టత లేకపోవడం.. తెలంగాణ కాంగ్రెస్‌లోనూ కలకలం రేపుతోంది. తెలంగాణ నుంచి ఏఐసీసీ కార్యదర్శులుగా మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సంపత్, వంశీ, మాజీ ఎంపీ మధుయాష్కీకొనసాగుతున్నారు. ఇప్పుడు వీళ్ల పరిస్థితి ఏంటి అన్నది పెద్ద ప్రశ్న.

చింతన్ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాల మేరకు.. ఐదేళ్లు పార్టీ పదవుల్లో ఉన్నవారికి కొనసాగింపు ఉండదు. చిన్నారెడ్డి చాలాకాలంగా ఆ పోస్టులో కంటిన్యూ అవుతున్నారు. సంపత్‌ మహారాష్ట్ర వ్యవహారాలను చూస్తున్న పార్టీ నేతల్లో ఒకరు. పార్టీ నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న KC వేణుగోపాల్‌కు తోడుగా ఉన్నారు వంశీచందర్‌రెడ్డి. వీళ్లంతా తిరిగి AICCలో కొనసాగుతారా? అలా కుదరనప్పుడు కొత్తగా ఎవరికి అవకాశం ఇస్తారు? ప్రస్తుతం దీనిపైనే గాంధీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సంపత్‌, వంశీలు ఇద్దరూ 50 ఏళ్ల లోపు కోటాలో పార్టీ పదవులు వస్తాయనే లెక్కల్లో ఉన్నారు. ఇక మధుయాష్కీ తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఏఐసీసీ కార్యదర్శిగా కర్ణాటక వ్యవహారాలు చూస్తున్న పార్టీ సభ్యుల్లో ఒకరు. అయితే ఒకరికి ఒకే పదవి అనే కండీషన్‌ వర్తింప చేస్తే.. మధుయాష్కీ తన దగ్గర ఉన్న రెండు పదవుల్లో దేనిని ఎంచుకుంటారో తెలియదు. కాంగ్రెస్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలంగాణకు AICC కార్యదర్శుల పదవులు మూడు వరకు వచ్చే వీలుంది. అవి ఎవరికి వస్తాయన్నదే చర్చ. గతంలో పాలమూరు జిల్లాకే మూడు ఏఐసీసీ కార్యదర్శుల పదవులు ఇచ్చారు. ఇప్పుడు పీసీసీ చీఫ్ కూడా ఆ జిల్లాకే వెళ్లడంతో.. ఏఐసీసీ కార్యదర్శుల పోస్టులు మిగిలిన జిల్లాలకు దక్కుతాయని అనుకుంటున్నారట. నల్లగొండ..కరీంనగర్ జిల్లాలకు చోటు దక్కొచ్చని సమాచారం. మెదక్‌, నిజామాబాద్‌ జిల్లా నేతల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు టాక్‌.

సుదీర్ఘకాలం పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్ కుమార్‌రెడ్డికి హైకమాండ్‌లో తనకంటూ ఓ కోటరీ ఉంది. అంతేకాదు సోనియాగాంధీ కోటరిలోనే ఆయన ఉన్నారని చెబుతారు. పీసీసీ చీఫ్‌ పదవికి రాజీనామా చేసిన సమయంలోనే ఉత్తమ్‌కు AICCలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. ఆయన్ని పార్టీ ప్రధాన కార్యదర్శిని చేస్తారని.. ఏదో ఒక రాష్ట్రానికి ఇంఛార్జ్‌గా పంపుతారనే వాదన ఉంది. ఇదే సమయంలో తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ CWCలో కూడా ఒకరికి ఛాన్స్‌ ఉంటుందని సమాచారం. అది ఎవరికి అన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి.. మారిన పార్టీ నిబంధనల ప్రకారం AICC పదవుల్లో ఎవరికి మోదమో… ఇంకెవరికి ఖేదం కలుగుతుందో చూడాలి.