Site icon NTV Telugu

చాలాకాలం తర్వాత తెలంగాణ ఆర్టీసీకి కళ..!

చాలా కాలం తర్వాత తెలంగాణ ఆర్టీసీకి కళ వచ్చింది. ఛైర్మన్‌, పూర్తిస్థాయి ఎండీ రాకే దానికి కారణం. కష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కిస్తారని అంతా అనుకుంటున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చింది హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న బస్‌భవన్‌. దాని గురించే ప్రస్తుతం సంస్థలో పెద్ద టాక్‌ నడుస్తోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.

బస్‌భవన్‌పై టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల్లో చర్చ..!

TSRTCలో దాదాపు మూడేళ్లపాటు ఇంచార్జ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సారథ్యంలో పరిపాలన సాగింది. ఛైర్మన్‌ పదవి ఖాళీగా ఉంటూ వచ్చింది. ఈ మధ్య రవాణా శాఖపై సమీక్ష చేసిన సీఎం కేసీఆర్‌.. ముందుగా ఆర్టీసీకి పూర్తిస్థాయి MDగా సీనియర్‌ IPS VC సజ్జనార్‌ను నియమించారు. ఆ తర్వాత 15 రోజులకే ఆర్టీసీ ఛైర్మన్‌గా నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ వచ్చారు. ఇలా రెండు కీలక పోస్టుల్లోకి పెద్దలు వచ్చేయడంతో సంస్థకు కొంత బలమొచ్చింది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బస్‌భవన్‌లో సందడి నెలకొంది. ఇలాంటి తరుణంలో బస్‌భవన్‌ గురించి జరుగుతున్న చర్చే ఇప్పుడు ఉద్యోగుల్లో, కార్మికుల్లో చర్చగా మారింది.

ఆగ్నేయంలోని మెయిన్‌గేటుకు తాళాలు..!

ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ సెప్టెంబర్‌ 3న మంచి ముహూర్తం చూసుకుని ఉదయం 9 గంటలకు బాధ్యతలు చేపట్టారు. సెప్టెంబర్‌ 20న ఉదయం తొమ్మిందిపావుకు ఛార్జ్‌ తీసుకున్నారు ఆర్టీసీ ఛైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్దన్‌. శుభ మూహూర్తాల్లో ఛాంబర్‌లోకి అడుగుపెట్టిన తర్వాత బస్‌ భవన్లో అమలు చేస్తున్న కొత్త నిబంధనలే హాట్ టాపిక్‌గా మారాయి. బస్‌ భవన్‌ నిర్మించినప్పటి నుంచీ నిన్న మొన్నటి వరకు ఆగ్నేయ దిక్కున ఉన్న మెయిన్‌ గేట్‌ను అంతా ఉపయోగిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈశాన్యం దిక్కున ఉన్న గేటు మాత్రమే ఉపయోగించాలని ఉన్నతాధికారుల నుంచి సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు వెళ్లాయి. వెంటనే ఆగ్నేయంలోని మెయిన్‌ గేటు నుంచి ఎవరూ వెళ్లకుండా తాళాలు వేసేశారు.

ముషీరాబాద్‌ డిపోవైపు ఉన్న ఈశాన్యం గేటు నుంచే రాకపోకలు..!

గేటుకు తాళాలు వేసిన సంగతి పెద్దగా ఎవరికీ తెలియకపోవడంతో మరుసటి రోజు ఉదయాన్నే ఆఫీస్‌కు వచ్చిన సిబ్బందికి..అప్పటి నుంచి ఇప్పటి వరకు బస్‌ భవన్‌కు వస్తున్న సందర్శకులు, కార్మికులకు ఏం అర్థంకాలేదు. ముషీరాబాద్‌ బస్‌ డిపోల వైపు ఉండే గేటు ద్వారా లోపలికి వెళ్లాలని సెక్యూరిటీ సిబ్బంది చెప్పి పంపిస్తున్నారు. దాంతో అంతా ఆ గేటు ఎక్కడుందా అని తెలుసుకుని .. మనసులో బోల్డన్ని ప్రశ్నల్ని మూటగట్టుకుని అడుగులు వేస్తున్నారు. ఎవరైనా ధైర్యం చేసి.. మెయిన్‌ గేటు ఎందుకు మూసేశారని ప్రశ్నిస్తే.. అంతా అధికారుల ఆదేశాలు అని చెప్పి ముక్తాయిస్తున్నారు సెక్యూరిటీ సిబ్బంది.

ఛైర్మన్‌, ఎండీ ఛాంబర్లలోనూ వాస్తు మార్పులు..?
సొంత వాహనాల్లో రాక.. వృథా ఖర్చులకు చెక్‌..!

ఒక్క బస్‌భవన్‌ గేటుకే కాదట. ఆర్టీసీ ఛైర్మన్‌, ఎండీ ఛాంబర్లలో కూడా కొన్ని వాస్తు మార్పులు చేసినట్టు సమాచారం. నిపుణులను తీసుకొచ్చి మార్పులు చేశారట. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ మార్పులు చేపట్టారా… లేక ఛైర్మన్‌, ఎండీల మెప్పు పొందేందుకు కింది స్థాయి అధికారులే ఈ పనులు చేస్తున్నారా అన్నది ఉద్యోగుల్లో చర్చగా మారింది. ఈ వాస్తు మార్పులు కష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కిస్తాయో లేదో కానీ.. ఛైర్మన్‌, ఎండీలు తీసుకున్న కొన్ని నిర్ణయాలపై మాత్రం ఆర్టీసీ ఉద్యోగుల్లో పాజిటివ్‌ చర్చ నడుస్తోంది. ఇద్దరు పెద్దలు సొంత వాహనాలు ఉపయోగిస్తున్నారట. వృథా ఖర్చులు ఆపేందుకు ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. లంచ్‌, టిఫిన్స్‌ ఇతరత్రా ఖర్చులు సంస్థ నుంచి పెట్టొద్దని సూచించారట. ఇదో శుభపరిణామంగా చెప్పుకొంటున్నాయి ఆర్టీసీ వర్గాలు. అందుకే ఛైర్మన్‌, ఎండీలు భవిష్యత్‌లో తీసుకునే నిర్ణయాలపై ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొందట.

Exit mobile version