NTV Telugu Site icon

Munugode By Election : టీఆర్ఎస్లో ఆ మాజీ ఎంపీ వ్యాఖ్యల మర్మం ఏంటి..?

Munugode Trs

Munugode Trs

Munugode By Election : ఆయన అధికార పార్టీ మాజీ ఎంపీ. మునుగోడు ఉపఎన్నికపై TRS తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్న సమయంలో కొత్త రాగం అందుకున్నారు. సరికొత్త చర్చకు ఆస్కారం కల్పించారు. ఆయనపై సొంత పార్టీ వారే కొందరు విరుచుకుపడుతున్నా.. మాజీ ఎంపీ వ్యాఖ్యల మర్మం ఏంటా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథా?

మునుగోడులో పొలిటికల్‌ హీట్‌ ప్రధాన పార్టీల నేతలకు బీపీ పెంచేస్తోంది. రోజుకో వ్యూహం.. పూటకో ఎత్తుగడ నియోజవర్గంలో రాజకీయాన్ని రక్తి కట్టిస్తోంది. ఉపఎన్నిక తేదీ ఖరారు కాకపోయినా.. నేతల హడావిడి మాత్రం ఓ రేంజ్‌లో ఉంది. ఇలాంటి సమయంలో ప్రధాన పార్టీల నేతలు చేస్తున్న కామెంట్స్‌ లోకల్‌గా మరింత హీట్‌ రాజేస్తున్నాయి. ఆ జాబితాలో చేరిపోయారు టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌. ఆయన వ్యాఖ్యల చుట్టూ మునుగోడులో పెద్ద చర్చే నడుస్తోంది.

మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వొద్దని టీఆర్ఎస్‌ లోకల్‌ లీడర్స్‌ అసమ్మతి సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారిని బుజ్జగించే పనిలో పార్టీ నేతలు బిజీగా ఉన్నారు కూడా. అసమ్మతి నేతలు ఎంతమంది ఉన్నారో.. టీఆర్ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్న వారూ అంతేస్థాయిలో కనిపిస్తున్నారు. 2018లో టీఆర్ఎస్‌ ఓటమికి అప్పటి అభ్యర్థి కూసుకుంట్ల తీరే కారణమని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. ఈ తరుణంలో ఆయనకు మరో ఛాన్స్‌ ఇవ్వాలా వద్దా అనే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

మునుగోడు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచీ బీసీలకు ప్రాతినిథ్యం దక్కలేదన్నది నర్సయ్యగౌడ్‌ కామెంట్. 12 సార్లు రెడ్డి సామాజికవర్గం నేతలు ఎమ్మెల్యేలు అయ్యారని.. నియోజకవర్గంలో 65 శాతంగా ఉన్న బీసీలకు ఛాన్స్‌ ఇవ్వలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ దఫా ఉపఎన్నికలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు మాజీ ఎంపీ. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలో దిగుతుండటం.. కాంగ్రెస్‌ నుంచి కూడా రెడ్డి సామాజికవర్గ అభ్యర్థే పోటీ చేస్తారనే ప్రచారంతో.. టీఆర్ఎస్‌పై ఒత్తిడి పెంచేలా నర్సయ్య గౌడ్‌ ప్రకటన చేశారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారట అధికారపార్టీ నేతలు.

కొంత కాలంగా మునుగోడులో అన్ని పార్టీలు బీసీలకే టికెట్‌ ఇవ్వాలని చర్చ జరుగుతోంది. సరిగ్గా అదే అంశాన్ని బూర నర్సయ్య గౌడ్‌ ప్రస్తావించారు. ఒక్క టీఆర్ఎస్‌నే కాదు.. నర్సయ్యగౌడ్‌ కామెంట్స్‌ కాంగ్రెస్‌, బీజేపీని కూడా ఇరకాటంలో పెడతాయన్నది కొందరి అభిప్రాయం. అలాగే ఉద్యమ నేతగా తాను రాష్ట్ర సాధన కోసమే పనిచేశానని… డబ్బులు ఖర్చు చేయడమేగాని సంపాదించు కోలేదంటూ మాజీ ఎంపీ చేసిన మరిన్ని వ్యాఖ్యలు గులాబీ శిబిరంలో హాట్‌ టాపిక్‌ అయ్యాయి. బీసీలకు ఛాన్స్‌ ఇవ్వాలన్న ఆయన కామెంట్‌ అసంతృప్తితో చేసిందా.. లేక ఇంకేదైనా ఉందా అని సందేహిస్తున్న వాళ్లూ ఉన్నారట. పార్టీ నేతల అభిప్రాయాలు ఎలా ఉన్నా.. అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్‌ అధిష్ఠానానికి క్లారిటీ ఉందని చెబుతున్నారు. మునుగోడు టీఆర్ఎస్‌ సభలో లేదా.. సరైన సమయంలో అభ్యర్థి ప్రకటన ఉంటుందని టాక్‌. మరి.. క్యాండిడేట్ ఎంపికలో ఎలాంటి సమీకరణాలు పనిచేస్తాయో చూడాలి.