Site icon NTV Telugu

పవన్ కళ్యాణ్ ఉక్కు ఉద్యమం వెనుక వ్యూహం ఏంటి..?

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు… శాశ్వత మిత్రులు లేరు. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఏం జరిగినా అదంతా పాలిటిక్స్‌లో బాగమే. కానీ నిరంతరం పోరాడుతూ ఉండాలి. ప్రజల్లో ఉండాలి. విశాఖ ఉక్కు ఉద్యమం ప్రారంభమై చాలా రోజులైనా.. తాజాగా కొత్త డిమాండ్‌ పెట్టారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌. అఖిల పక్షం ఏర్పాటు చేసి.. ఢిల్లీ వెళ్లాలన్నది ఆయన సూచన. ఇందులో ఏదైనా వ్యూహం ఉందా?.

విశాఖ ఉక్కు ఉద్యమంలోకి పవన్ కళ్యాణ్

విశాఖ ఉక్కు ఉద్యమంలో లేటెస్ట్ సెన్సేషన్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఉద్యమానికి మద్దతు ప్రకటించిన పవర్ స్టార్… విశాఖ ఉక్కు ప్రాంగణం ప్రధాన రహదారిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన తన శైలికి భిన్నంగా ప్రశాంతంగా మాట్లాడారు. సంస్థను పరిరక్షించుకోవడానికి పెద్దఎత్తున పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన ఉక్కు కర్మాగారం వేరే రాష్ట్రాలకు తరలిపోతోందని తెలిసి ఆంధ్రప్రదేశ్‌ నాడు అంతటా నిరసనలు వెల్లువెత్తాయని… గుంటూరుకు చెందిన అమృతరావు విశాఖ వచ్చి నిరసన దీక్షలు చేశారని గుర్తుచేశారు.

వైసీపీ పెద్దన్న పాత్ర పోషించాలని కోరిన జనసేనాని
వారం రోజుల్లో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్
వైసీపీ స్పందించకపోతే ఉద్యమాన్ని నడిపిస్తానని వార్నింగ్‌

వాయిస్…రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడితే విశాఖ స్టీల్‌ ప్లాంటుని కాపాడుకోవచ్చని, ఇందుకు రాష్ట్రంలో అధికారంలో వున్న వైసీపీ చొరవ తీసుకోవాలని కోరారు పవన్ కళ్యాణ్. స్టీల్‌ ప్లాంటుని ప్రైవేటీకరణ చేయకుండా కేంద్రంపై ఒత్తిడి తేవడానికి వైసీపీ పెద్దన్న పాత్ర పోషించాలని, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని వెళ్లేలా వారం రోజుల్లో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఒకవేళ వైసీపీ స్పందించని పక్షంలో జనసేన ఆధ్వర్యంలోనే ఉద్యమాన్ని నడిపిస్తామని స్పష్టం చేశారు. వైసీపీకి వున్నట్టు తనకు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్‌సభ ఎంపీలు లేరని, ఉన్న ఒక్క ఎమ్మెల్యేని కూడావారే తీసేసుకున్నారని సెటైర్ వేశారు.

కేంద్రం ఆధీనంలో విశాఖ ఉక్కు పరిష్రమ
పవన్ కేంద్రాన్ని నిలదీయాలంటున్న వైసీపీ నేతలు

పవన్ కళ్యాణ్ డిమాండ్ మీద వైసీపీ కూడా అదే రేంజ్‌లో స్పందించింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ అజెండాను జనసేన అధినేత భుజాలకెత్తుకున్నారని విశాఖ వైసీపీ నేతలు ఆరోపించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అలాంటి ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రకటించిన బీజేపీ ప్రభుత్వంపై పల్లెత్తు మాట కూడా అనలేదంటనేది వారి ప్రశ్న. 260 రోజులుగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో ఉక్కు కార్మిక సంఘాలు, విశాఖ ప్రజలు పోరాటం చేస్తుంటే ఇప్పుడొచ్చి అఖిలపక్షాన్ని వేయమని అడుగుతున్నారంటూ కౌంటర్లు వేశారు.

బీజేపీకి దూరం జరిగేందుకే పవన్ ఉక్కు ఉద్యమానికి మద్దతిచ్చారా?
పవన్ అఖిలపక్షం డిమాండ్‌ని స్వాగతించిన టీడీపీ

రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ- జనసేన కలిసే ఉన్నాయని.. ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని ప్రశ్నించాలని అడుగుతున్నారు వైసీపీ నేతలు. పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు ఉద్యమానికి హఠాత్తుగా మద్దతిస్తోంది బీజేపీకి దూరం జరిగి.. టీడీపీకి దగ్గర కావడానికే అన్నది వైసీపీలో కొంతమంది నేతల విశ్లేషణ. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకు వెళ్లాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్‌‌ని టీడీపీ స్వాగతించిందని వారు చెబుతున్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా చోట్ల టీడీపీ- జనసేన ఒకరికొకరు మద్దతు ఇచ్చిపుచ్చుకున్నారని.. అప్పటి నుంచి బంధం పెరుగుతోందని గుర్తు చేస్తున్నారు.

వైసీపీ, జనసేనతోనే యూత్ ఓటు బ్యాంక్
జనసేనకు దగ్గరయ్యేందుకు టీడీపీ ప్రయత్నాలు?

టీడీపీ కూడా జనసేనకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్‌. ఏపీలో యూత్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీ, జనసేనతోనే ఉంది. జనసేనతో జట్టు కడితే… యువకుల మద్దతును తామూ పొందవచ్చని టీడీపీ భావిస్తోందట. ఏపీలో సొంతంగా అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ఎలాగూ టీడీపీని దూరం పెడుతున్నందున… కనీసం జనసేనతో కలిస్తే… తద్వారా వామపక్షాలకు కూడా దగ్గర కావచ్చని టీడీపీ భావిస్తోందట.

పవన్ కళ్యాణ్ లాంగ్‌మార్చ్‌కు టీడీపీ, లెఫ్ట్ పార్టీల మద్దతు
పవన్‌తో పాటే జనాల్లోకి టీడీపీ, వామపక్షాలు

పవన్ కళ్యాణ్ నవంబర్ 3న విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించబోతున్నారు. ఇందులో పాల్గొనాల్సిందిగా ఆయన విపక్ష పార్టీలను ఆహ్వానించారు. ఇందులో పాల్గొనేందుకు బీజేపీ నో చెప్పింది. పవన్ కళ్యాణ్ లాంగ్‌మార్చ్‌కు వామపక్షాలు, టీడీపీ మద్దతు పలికాయి. ఈ లాంగ్ మార్చ్ ద్వారా మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని జనసేన భావిస్తుంటే జనసేనతో కలిసి తాము కూడా జనాల్లోకి వెళ్లాలని టీడీపీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్‌లో ఆయన వెంట టీడీపీ, వామపక్ష జండాలు కనిపించే దృశ్యాలు ప్రజల్లోకి కొత్త సంకేతాలను పంపే అవకాశాలు బలంగా ఉన్నాయి.

రాష్ట్రంలో పొలిటికల్ ఈక్వేషన్లు మారతాయా?

తిరుపతి ఉప ఎన్నిక నుంచి చూసుకుంటే.. తాజాగా బద్వేల్ బైపోల్ లోనూ బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోతోందని జనసేన నేతలు లోలోపల మధన పడుతున్నారు. టీడీపీతో కలిస్తే మంచిదని కొంతమంది ద్వితీయశ్రేణి నాయకులు బహిరంగంగానే ప్రకటించారు. ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణలు, పొలిటికల్ ఈక్వేషన్లు చూస్తే.. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖచిత్రం కొత్తగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version