NTV Telugu Site icon

Munugode TRS Assembly : మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించకపోవడం వెనుక ఎత్తుగడ ఏంటి..?

Munugode

Munugode

Munugode TRS Assembly  : మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రకటనలో ఎందుకు జాప్యం? గులాబీ వ్యూహం ఏంటి? సభలో పేరు ప్రకటించకపోవడం వెనక ఎత్తుగడ ఉందా? పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ పెరుగుతోందా? లెట్స్‌ వాచ్‌..!

మునుగోడులో మూడు పార్టీల కీలక సభలు అయిపోయాయి. కాంగ్రెస్‌ పార్టీ ముందుగానే తొడ కొడితే.. తర్వాత టీఆర్‌ఎస్‌ హోరెత్తించింది. చివరగా అమిత్‌ షాను రప్పించి రణతంత్రాన్ని వేడెక్కించింది బీజేపీ. కామ్రేడ్లు అధికారపార్టీకి జై కొట్టేశారు. ఇక తేలాల్సింది ఉపఎన్నిక తేదీనే. బరిలో దిగే గెలుపు గుర్రాల పేర్లు వెల్లడి కావాల్సి ఉంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ నుంచి పోటీలో ఉండబోతున్నారు. అయితే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎవరన్నది స్పష్టత లేదు.

మునుగోడు సభలోనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ.. అభ్యర్థి ప్రకటన లేకుండానే కేసీఆర్‌ ప్రసంగం ముగిసింది. వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని బరిలో దించుతారని ప్రచారం జరిగింది. కూసుకుంట్లపై లోకల్‌ పార్టీ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేయడం.. అసమ్మతి సమావేశాలు పెట్టుకోవడంతో టీఆర్‌ఎస్‌ వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది. ఉపఎన్నిక తేదీ ఇంకా ఖారారు కాకపోవడంతో వేచి చూసే ధోరణిలోకి టీఆర్ఎస్‌ వెళ్లినట్టు భావిస్తున్నారు. దీనికితోడు మునుగోడు టీఆర్ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్న పార్టీ నేతల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అది కూడా సభలో అభ్యర్థి ప్రకటన చేయకపోవడానికి ఒక కారణంగా చెబుతున్నారు.

మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, పార్టీ నేతలు కంచర్ల కృష్ణారెడ్డి, కర్నాటి విద్యాసాగర్‌, జడ్పీటీసీలు నారబోయిన రవి.. బొల్ల శివశంకర్‌ తదితరులు టీఆర్ఎస్‌ టికెట్‌ రేసులో ఉన్నారు. కూసుకుంట్ల కానీ.. ఆశవహుల్లో కానీ.. ఎవరో ఒకరికే ఛాన్స్‌ దక్కుతుంది. వీళ్లెవరూ కాదని అనుకుంటే కొత్తవారిని బరిలో దించే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆశావహులు అసంతృప్తికి లోనవకుండా.. పార్టీకి ఉపఎన్నికలో ఇబ్బంది కలుగకుండా.. అందరికీ సర్దిచెప్పే పనిలో టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు. ఈ ఉపఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్‌కు గట్టి గుణపాఠం చెప్పాలన్నది టీఆర్ఎస్‌ ఆలోచన. అందుకు అనుగుణంగానే అభ్యర్థని ఎంపిక చేస్తారని టాక్‌.

అభ్యర్థి ఎంపికలో పార్టీ తీసుకుంటున్న జాగ్రత్తలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇప్పటికే కొందరు నాయకులను ప్రగతిభవన్‌కు పిలిపించుకుని కేసీఆర్‌ మాట్లాడారు. తర్వాత వరసగా మునుగోడుకు చెందిన ఆశావహులను, అసంతృప్తులను పిలిచి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. చండూరులో తదుపరి టీఆర్‌ఎస్‌ సభ నిర్వహించేలోపుగానే వడపోతలు కొలిక్కి వస్తాయని అనుకుంటున్నారట. సరైన సమయంలో సరైన అభ్యర్థిని ప్రకటిస్తారని చెబుతున్నారు. చండూరులో సభ ఉంటుందని మునుగోడు మీటింగ్‌లో కేసీఆర్‌ చెప్పడంతో.. ఇప్పుడు అందరి దృష్టీ ఆ కార్యక్రమంపై నెలకొంది. అయితే టీఆర్ఎస్‌ పెద్దల దృష్టిలో ఎవరు ఉన్నారు అన్నదే ఉత్కంఠ రేపుతోంది.