NTV Telugu Site icon

Mynampally Hanumantha Rao : ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పెద్ద కోరిక ఏంటి?

Mla Minampally

Mla Minampally

ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రాబోయే ఎన్నికల్లో ఎంపీగా వెళ్లేందుకు సిద్ధమయ్యారా..? ఇప్పటి నుంచే గ్రౌండ్‌ వర్క్‌ చేసుకుంటున్నారా? మరి.. గత ఎన్నికల్లో అక్కడ ఎంపీగా పోటీ చేసి ఓడిన మంత్రి అల్లుడి పరిస్థితి ఏంటి? అధికారపార్టీలో సెగ రాజుకున్నట్టేనా?

మేడ్చల్ జిల్లాలో ఏ నియోజకవర్గానికి లేని క్రేజ్ మల్కాజిగిరి అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఉన్నాయి. గత ఎన్నికల్లో మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావు గెలిచారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్‌సభ సెగ్మెంట్‌లో టిఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ఓడిపోయారు. అక్కడ ప్రస్తుత పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి మల్కాజ్‌గిరి పార్లమెంటు పరిధిలో మర్రి రాజశేఖర్ రెడ్డి టిఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు… సీఎం కేసీఆర్ బహిరంగ సభలు.. నిరసన కార్యక్రమాలు.. వివిధ ప్రోగ్రామ్స్‌ చేస్తూ వస్తున్నారు రాజశేఖర్‌రెడ్డి. ఆయన మంత్రి మల్లారెడ్డికి అల్లుడు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి ఎమ్మెల్యే హన్మంతరావు పోటీకి ఆసక్తి చూపిస్తున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మల్కాజ్‌గిరి అసెంబ్లీ బరిలో తన కుమారుడు మైనంపల్లి రోహిత్‌కు పార్టీ టికెట్‌ అడుగుతున్నారట. రెండుచోట్లా పార్టీ అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తామని పార్టీ పెద్దలకు హన్మంతరావు చెప్పినట్టు తెలుస్తోంది. మైనంపల్లి సోషల్‌ సర్వీస్‌ పేరుతో రోహిత్‌ కార్యక్రమాలు చేస్తున్నారు. జనాలకు దగ్గరయ్యేందుకు అవకాశం ఉన్న ఏ పనినీ వదులుకోవడం లేదు. ఇదంతా వచ్చే ఎన్నికల కోసమే అన్నది స్థానిక టీఆర్ఎస్‌ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

అయితే గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్‌సభకు పోటీ చేసి ఓడిన మర్రి రాజశేఖర్‌రెడ్డి ఈసారి కూడా బరిలో దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. టీఆర్ఎస్‌ అధిష్ఠానం తనకే టికెట్‌ ఇస్తుందనే ధీమాతో ఉన్నారు కూడా. ఒకే ఇంట్లో రెండు టికెట్లు ఇస్తే.. పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న తమకు అన్యాయం జరుగుతుందనే ఆవేదనలో కొందరు ఆశావహలు ఉన్నారట. మంత్రి మల్లారెడ్డి, అలాగే మైనంపల్లి విషయంలోనూ ఇదే విధంగా స్పందిస్తున్నారట ఆశావహులు. దీనిపై ఎవరి వాదన ఎలా ఉన్నా.. గెలుపు గుర్రాలకే పార్టీ ఎన్నికల్లో టికెట్‌ ఇస్తుందని భావిస్తున్న మైనంపల్లి హన్మంతరావు.. కుమారుడు రోహిత్‌ను వెంటబెట్టుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు.

ఒకవేళ మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌ హన్మంతరావుకు ఇస్తే.. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి పరిస్థితి ఏంటన్నది పార్టీ వర్గాల ప్రశ్న. ఇద్దరికీ సయోధ్య కుదురుస్తారా? బుజ్జగింపులు ఫలిస్తాయా అనే సందేహాలు ఉన్నాయట. ప్రస్తుతం రెండు శిబిరాలు పోటాపోటీ కార్యక్రమాలు.. ఎత్తుగడలతో రాజకీయాన్ని రసకందాయంలో పడేస్తున్నాయి. మరి.. అంతిమంగా టీఆర్ఎస్‌ పెద్దలు ఎవరికి టిక్‌ పెడతారో.. ఎవరికి టికెట్‌ ఇస్తారో చూడాలి.

 

Show comments