NTV Telugu Site icon

Telangana CM KCR :సీఎం కేసీఆర్ వ్యూహం ఏంటి? దసరాకు ముహూర్తం పెట్టారా?

Cm Kcr

Cm Kcr

Telangana CM KCR : జాతీయ పార్టీ ప్రకటనకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారా? ముహూర్తం ఖరారైందా? గులాబీ బాస్‌ చేస్తున్న వ్యూహ రచన ఏంటి? దసరాకు కీలక ప్రకటన చేస్తారా? లెట్స్‌ వాచ్‌..!

బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ అజెండా దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. జాతీయ స్థాయిలో కొత్త పార్టీతోపాటు కొత్త కూటమి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 2024 లోక్‌ సభ ఎన్నికలే లక్ష్యంగా వడివడిగా వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపిన కేసీఆర్‌.. ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ అంశంపై కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారు కూడా. నేషనల్‌ పాలిటిక్స్‌లో క్రియాశీలక పాత్ర పోషించాలనే తన ఆలోచనను వివిధ వేదికలపై బయట పెట్టారు తెలంగాణ సీఎం. ఈ విషయం తెలిసినప్పటి నుంచీ కొత్త జాతీయ పార్టీపై పలుపేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

సీఎం కేసీఆర్‌ స్వయంగా వివిధ రాష్ట్రాలకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యారు. వివిధ పార్టీల నేతలతో కీలక చర్చలు జరిపారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు వచ్చిన వివిధ పక్షాల నాయకులతో మంత్రంగాలు నడిచాయి. గులాబీ దళపతి ఆలోచనలకు మద్దతు తెలిపారు నాయకులు. అయితే జాతీయ పార్టీ ప్రకటన అప్పుడు.. ఇప్పుడు అంటూ గతంలో గుసగుసలు వినిపించాయి. కానీ.. ప్రస్తుతం గట్టి ముహూర్తం ఫిక్స్‌ అయినట్టు తెలుస్తోంది. ఈ దసరాకు సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేస్తారని సమాచారం. అక్టోబర్‌ ఐదున కొత్త పార్టీ పేరు ప్రకటనతోపాటు.. ప్రత్యామ్నాయ అజెండాను వెల్లడిస్తారని తెలుస్తోంది.

జాతీయ పార్టీ జెండా.. అజెండాల విషయంలో సీఎం కేసీఆర్‌ ఒక ఆలోచనకు వచ్చారట. ఆ కసరత్తు కూడా కొలిక్కి వచ్చినట్టు సమాచారం. పైగా సెంటిమెంట్‌గా విజయదశమి రోజు అయితే అంతా సక్సెస్‌ అవుతుందని అభిప్రాయ పడుతున్నారట. టీఆర్ఎస్‌ వర్గాలు కూడా ఇదే మూడ్‌లో ఉండటంతో అక్టోబర్‌ 5ను ఫిక్స్‌ చేసినట్టు చెబుతున్నారు. అయితే జాతీయ పార్టీ ప్రకటన కంటే ముందు రాష్ట్రంలో చేయాల్సిన కసరత్తుపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టారట. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా పర్యటించాల్సి రావొచ్చు. అందుకు షెడ్యూల్‌ సిద్ధం చేస్తున్నారట. ఈ విషయంలో కలిసి వచ్చే పార్టీలు.. ఆ పక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాలను వదిలిపెట్టి.. బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో కేసీఆర్‌ టూర్‌ చేస్తారని తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయట.

జాతీయ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్‌ కావడంతో గులాబీ వర్గాల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. అందరి దృష్టీ అక్టోబర్‌ 5పై నెలకొంది. పార్టీ పేరు ఏంటి? జెండా ఏ రంగులో ఉంటుంది? అజెండాలోని అంశాలపైనా ఎవరికి వారు విశ్లేషణలు చేస్తున్నారు. మరి.. సీఎం కేసీఆర్‌ ఎలాంటి సంచలన ప్రకటన చేస్తారో అప్పటి వరకు వేచి చూడాల్సిందే.