Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో అది తీరని సమస్యేనా? టచ్ చేస్తే ఇంకేదో సమస్య వస్తుందని భయపడుతున్నారా? నేరుగా పార్టీ నేతలు వేసిన ప్రశ్నలకు బండి సంజయ్ చెప్పిన సమాధానం ఏంటి? ఏ అంశంలో కమలనాథులు కలవర పడుతున్నారు? లెట్స్ వాచ్..!
అసెంబ్లీ ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో పార్టీ నేతలను సన్నద్ధం చేస్తోంది బీజేపీ నాయకత్వం. వివిధ స్థాయిల్లో వరసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తోంది. తాజాగా జిల్లా బీజేపీ ఇంఛార్జులు, పార్లమెంట్ కన్వీనర్లు.. జాయింట్ కన్వీనర్లతో రాష్ట్ర పార్టీ సారథి బండి సంజయ్ భేటీ అయ్యారు. బీజేపీ సంస్థాగత అంశాలు..ఇంఛార్జులు, కన్వీనర్లు చేయాల్సిన పనులపై ఆ సమావేశంలో చర్చించారు. బూత్ కమిటీల నియామకం.. పార్లమెంట్ ప్రవాస యోజన తదితర విషయాలపై చర్చ సాగింది. ఈ నెల 25లోపే బూత్ కమిటీల ఏర్పాటు పూర్తి కావాలని డెడ్‌లైన్ పెట్టారు సంజయ్. అలాగే పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమాన్ని సమన్వయం చేసుకునే బాధ్యత అక్కడి కన్వీనర్లదే అని తేల్చేశారు. అంతా బాగానే ఉన్నా.. బీజేపీకి అసెంబ్లీ కన్వీనర్లను ఎప్పుడు నియమిస్తారు అనే ప్రశ్నలకు మాత్రం సంజయ్ నీళ్లు నమిలారట. కీలకమైన పదవుల విషయంలో పార్టీ పెద్దలు ఎందుకు తటపటాయిస్తున్నారో కాషాయ శ్రేణులకు అంతుచిక్కడం లేదట.
అసెంబ్లీ కన్వీనర్లును నియమించాల్సిందే అన్నది బండి సంజయ్ మాట. అయితే ఎప్పుడు నియమిస్తారు అని ఆ సమావేశానికి వచ్చిన నాయకులు ప్రశ్నించారట. జిల్లా కోర్ కమిటీలు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు నాలుగు పేర్లు పంపించాయని.. అందులో ఎవరిని ఎంపిక చేసినా ఇబ్బందేగా.. చివరికి నన్ను బద్నాం చేస్తారా అని ఎదురు ప్రశ్నించారట సంజయ్. చివరకు ఒక నియోజకవర్గానికి ఒక్క పేరే పంపాలని ఆయన సూచించారట. ఇంత వరకు బాగానే ఉన్నా.. కన్వీనర్‌గా ఎవరిని ప్రకటించినా.. ఆ నాయకుడు తానే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ప్రచారం చేసుకునే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారట కమలనాథులు. దీనివల్ల బీజేపీలో చేరాలని అనుకున్న బలమైన నాయకులు దూరం అవుతారని అనుమానిస్తున్నారట.
ఇప్పటికే గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన నాయకులు.. నియోజకవర్గాల్లో చురుకుగా పనిచేస్తున్న మరికొందరు ఎవరికి వారు అసెంబ్లీ ఇంఛార్జులుగా అనధికారింగా చెలామణి అవుతున్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టి ప్రచారం ఊదరగొట్టేస్తున్నారు. దీనిపై చాలా ఫిర్యాదులు రావడంతో.. వాటికి ఫుల్‌స్టాప్ పెట్టాలని పార్టీ నేతలను కోరారట సంజయ్.
మాట వినకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారట.
ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఆల్‌రెడీ ఫీల్డ్‌లో పర్యటనలు చేస్తున్న పార్టీ నేతలకు మింగుడు పడటం లేదట. అసలే రాష్ట్రంలో వాడీవేడీ రాజకీయ వాతావరణం నెలకొన్న సమయంలో అసెంబ్లీ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకోకపోతే.. కేడర్ చెల్లాచెదురు అవుతుందని వాపోతున్నారట. ఆ విషయం రాష్ట్ర నేతలకు తెలిసినా.. ఇతర పార్టీల నుంచి వచ్చే పెద్ద నేతలపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకే అసెంబ్లీ కన్వీనర్ల అంశాన్ని నాన్చుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి.. అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో ఇదే వ్యూహం అనుసరిస్తారో.. లేక కొత్త ఎత్తుగడ వేస్తారో చూడాలి.
