Site icon NTV Telugu

పార్టీ అధినేత వేసిన టూర్ పై హై కమాండ్ ఏమనుకుంటుంది..?

Jatakalu Telchesarjpg

Jatakalu Telchesarjpg

తెలంగాణలో రెండు రోజులపాటు సాగిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటనపై.. అధిష్ఠానానికి నివేదిక ఇచ్చే పనిలో పడ్డారు రాజకీయ వ్యూహకర్త సునీల్. ఈ పర్యటనలో రాహుల్‌ గాంధీ ప్రసంగంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయట. పార్టీ క్రమశిక్షణ గురించి చెబుతూనే.. టీఆర్ఎస్‌, బీజేపీతో దోస్తీ చేసే నాయకులు తమకు అవసరం లేదు.. వెళ్లిపోవాలనే కామెంట్స్‌ పార్టీ కేడర్‌కు బూస్ట్‌ ఇచ్చాయని గాంధీభవన్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే… కొందరు సీనియర్లు మాత్రం రాహుల్ వ్యాఖ్యలపై అసంతృప్తితో ఉన్నారట. రాహుల్‌ను కలిసి ఒక సీనియర్‌ నేత దానిపై వివరణ కూడా ఇచ్చినట్టు సమాచారం. పొత్తులపై చేసిన కామెంట్స్‌తో తప్పుడు సంకేతాలు వెళ్లాయని.. పొత్తులపై పార్టీలో ఏ నాయకుడు మాట్లాడలేదు అని రాహుల్‌కు చెప్పినట్టు సమాచారం. PKతో వచ్చిన చర్చ తప్పితే నాయకులెవరూ.. అలాంటి ఆలోచనలో లేరని క్లారిటీ ఇచ్చారట.

ఇదే సమయంలో కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్… రాహుల్ గాంధీ టూర్ పై నివేదిక సిద్ధం చేస్తున్నారట. రెండు రోజుల పర్యటన.. జనసమీకరణ.. కాంగ్రెస్‌కు వచ్చిన మైలేజ్.. రాహుల్‌ ప్రసంగంపై వచ్చిన రియాక్షన్‌లపై నివేదిక రూపొందించే పనిలో ఉన్నారట సునీల్‌. వరంగల్ సభా వేదిక దగ్గర కూడా సునీల్ ఉన్నారు. ఏ జిల్లా నుండి జన సమీకరణ జరిగింది? సభకు వచ్చిన నాయకుల ఫీడ్ బ్యాక్‌లపై ఆయన అధ్యయనం చేశారట. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమం.. చంచల్‌గూడ జైలులో NSUI విద్యార్థుల పరామర్శతో పాటుగా.. అన్నింటిపైనా అభిప్రాయ సేకరణ చేశారట. ఒకటి రెండు రోజుల్లో నివేదికను సునీల్‌ హైకమాండ్‌కు అందించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే రాహుల్ ప్రసంగంలో ప్రస్తావనకు వచ్చిన కొన్ని అంశాలు కొందరిని టార్గెట్‌ చేసినట్టుగా ఉందని సీనియర్లు అనుమానిస్తున్నారట.

రాహుల్‌ టూర్‌లో అమరవీరుల స్మారక స్థూపం వీజిట్ ఆఖరి నిమిషంలో ఫిక్స్ అయ్యింది. ఈ అంశంపై పార్టీ నాయకులు ఒకరిద్దరు వద్దని చెప్పడంతో.. రాహుల్‌ గాంధీ.. పార్టీ స్ట్రాటజిస్ట్‌ సునీల్ అభిప్రాయం తెలుసుకున్నారట. వెళ్లడం చాలా బెటర్.. వెళ్లే దారిలో 10 నిమిషాల కార్యక్రమం అని చెప్పడంతో.. అమరుల స్తూపం దగ్గరకు వెళ్లారు కాంగ్రెస్‌ అగ్రనేత. మొత్తానికి సునీల్ కాంగ్రెస్‌లో కీలకంగా మారిపోయారు. అందుకే హైకమాండ్‌కు ఆయన అందించే రిపోర్ట్‌ ఎలా ఉంటుంది? ఆయన ఏం చెబుతారు అనేది గాంధీభవన్‌ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

Exit mobile version