Site icon NTV Telugu

ఓరుగల్లు రాజకీయం ఆసక్తిగా మారుతోందా.? పార్టీలు వేట మొదలుపెట్టాయా.?

Vetay

Vetay

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పొలిటికల్‌ పార్టీలు స్పీడ్‌ పెంచాయి. రాహుల్‌గాంధీ సభ తర్వాత దూకుడుగా వెళ్తోంది కాంగ్రెస్‌. బీజేపీ కూడా పట్టు పెంచుకోవడానికి చూస్తోంది. ఇదే సమయంలో ఆధిపత్యాన్ని నిలుపుకొనే పనిలో గట్టిగానే పావులు కదుపుతోంది అధికార టీఆర్‌ఎస్‌. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం టీఆర్ఎస్‌ స్ట్రాంగ్‌గా ఉంది. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు.. పార్టీ నాయకులు నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉండాలని టీఆర్‌ఎస్‌ పెద్దల నుంచి సూచనలు వెళ్లాయి. దీంతో గత 20 రోజులుగా ప్రజాప్రతినిధులంతా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. పనిలో పనిగా గ్రౌండ్‌లెవల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల స్థానంలో అభ్యర్థుల వేట మొదలు పెట్టినట్టు టాక్‌.

రాహుల్‌గాంధీ సభ తర్వాత కాంగ్రెస్‌లో ఉన్న వర్గ విభేదాలు బయటకు రావడంతో.. అసంతృప్తితో ఉన్న నేతలను గులాబీ శిబిరంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారట టీఆర్‌ఎస్‌ నాయకులు. ప్రజాక్షేత్రంలో పట్టుసాధించే వారిపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారట. ఇదే సమయంలో కాంగ్రెస్‌ పెద్దలు కూడా అధికారపార్టీలోని అసంతృప్తులతో టచ్‌లోకి వెళ్తున్నారట. టీఆర్‌ఎస్‌లో లోడు పెరగడంతో అక్కడ పదవులు రాకుండా నలిగిపోతున్న వారిని గుర్తించి.. ఆకర్షించే పని చేస్తున్నాయి కాంగ్రెస్‌, బీజేపీ.

ముఖ్యంగా టీఆర్ఎస్‌ నుంచి జరుగుతున్న మీటింగ్స్‌పైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. కామన్‌ ఫ్రెండ్స్‌ ఇళ్లల్లో అర్ధరాత్రి వేళ బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన వారితో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కండువా మార్చితే కలిగే లాభాలు.. పార్టీ నుంచి లభించే భరోసా గురించి పెద్ద హామీలే ఇస్తున్నారట. ఈ అర్ధరాత్రి మీటింగ్స్‌ గురించి తెలిసిన తర్వాత విపక్ష పార్టీలు అలర్ట్‌ అయినట్టు సమాచారం. సమావేశాలకు వెళ్తున్నవాళ్లు ఎవరు? అక్కడ చర్చకు వస్తున్న అంశాలపై కూపీ లాగుతున్నారట.

ప్రధాన పార్టీలు సాగిస్తున్న ఈ వేటలో గతంలో అసెంబ్లీ టికెట్లు ఆశించి భంగపడ్డ వాళ్లకు గిరాకీ పెరిగిపోయింది. వాళ్ల గ్రాఫ్‌ అమాంతం పీక్స్‌కు వెళ్తున్నట్టు చెబుతున్నారు. టీఆర్ఎస్‌ తర్వాత ఆకర్షణ ప్రయత్నాలు కాంగ్రెస్‌ నుంచి జరుగుతున్నట్టు సమాచారం. పాత పరిచయాలతో మాటలు కలుపుతూ.. కాస్త మొగ్గు చూపుతున్నారని అనిపించగానే ఆఫర్లు బయటకు తీస్తున్నారట. టీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ నేతలకు కూడా కాంగ్రెస్‌ నుంచి గాలం వేస్తున్నారట. అయితే వీళ్ల గేలానికి తగిలింది ఎవరు అన్నదే ఉత్కంఠగా మారింది. మొత్తానికి ఎన్నికల నాటికి ఎవరు ఏ పార్టీలో ఉంటారో అర్థంకాని పరిస్థితి ఉందట.

Exit mobile version