Warangal Police: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుగా ఉందట ఆ జిల్లాలో పోలీసుల పరిస్థితి. పొలిటికల్ హీట్ పెరిగి.. మద్దెలదరువు ఎక్కువైందట. ఎవరు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో.. ఏ వైపు నుంచి విమర్శలు వస్తాయో అర్థం కావడం లేదట. అధికార విపక్షాలకు ఏకకాలంలో టార్గెట్ కావడంతో తల పట్టుకుంటున్నారట ఖాకీ బాస్‌లు.
కరవమంటే కప్పకు.. విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా తమ డ్యూటీలు మారిపోయాయని వరంగల్ జిల్లా పోలీసులు వాపోతున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ నేతల రాజకీయ వైరంలో తాము లక్ష్యంగా మారుతున్నట్టు ఆవేదన చెందుతున్నారట. రెండు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకోవడం.. ఆపై పోలీసులపై విరుచుకుపడటం సాధారణమైపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా రగిలిన అగ్గి ఏకంగా ఐపీఎస్ అధికారి లక్ష్యంగా మాటల తూటాలు పేలాయి. వరంగల్ పోలీస్ కమిషనర్‌పై తీవ్ర వ్యాఖ్యలే చేశారు సంజయ్.
పాదయాత్ర దేవరుప్పల చేరుకున్న సమయంలో జరిగిన దాడి.. పాలకుర్తిలో ముందుస్తుగా దుకాణాలు మూయించి వేయడంపై బండి ఫైర్ అయ్యారు. ఇందులో పోలీసుల పాత్ర ఉందని అనుమానించిన ఆయన ఖాకీలపై పదునైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎంతోకాలం అధికారంలో ఉండబోదని.. బీజేపీ అధికారంలోకి వచ్చాక మీ అంతు చూస్తామన్నట్టుగా సంజయ్ నిప్పులు చెరగడం చర్చగా మారింది.
దేవరుప్పల ఘటనలో పోలీసుల లాఠీచార్జిపై టీఆర్ఎస్ నేతలూ భగ్గుమన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేరుగా పోలీసుల తీరును తప్పుపట్టారు. టీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ నేతలు దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల స్వరం కూడా ఇంతే స్థాయిలో ఉండటంతో కంగుతిన్నారు ఖాకీలు. ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నా.. పార్టీల వైరంలో తాము సమిధలుగా మారుతున్నామని కొందరు అధికారులు వాపోతున్నారట. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు గతంలో వినిపించేవని.. ఇప్పుడు మాత్రం నేరుగా పేరు.. హోదాలను ప్రస్తావిస్తూ వార్నింగ్ ఇస్తున్నారని అభిప్రాయ పడుతున్నారట.
ఖిలా షాపూర్‌లో బండి సంజయ్ మాట్లాడుతున్న సమయంలో టీఆర్‌ఎస్ కార్యకర్త ఒకరు నిలదీసే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యి.. పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చారు. ఇంతోలోనే బీజేపీ నేత ఒకరు టీఆర్‌ఎస్ కార్యకర్తపై చెయ్యి చేసుకున్నారట. ఆ సమస్య పెద్దది కాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ రెండు పార్టీలు తమనే టార్గెట్ చేయడం చర్చగా మారింది. వరంగల్ పోలీసులను తప్పు పడుతూ.. వారి పేర్లు నమోదు చేసుకుని పోలీస్ ఉన్నతాధికారులకు కొందరు ఫిర్యాదు చేస్తున్నారట. దాంతో కింది స్థాయి సిబ్బందికి చీవాట్లు పడుతున్నాయట. రానున్న రోజుల్లోనూ ఇలాగే ఉంటే.. సమస్యను ఎలా అధిగమించాలా అని ఆలోచనలు చేస్తున్నారట పోలీసు అధికారులు.
