OTR: వనపర్తి కాంగ్రెస్‌లో అంతులేని పొలిటికల్‌ వార్‌..!

Otr

Otr

OTR: జీడిపాకం టీవీ సీరియల్‌కు కూడా ఏదో ఒక రోజు, ఎక్కడో ఒక చోట ఫుల్‌ స్టాప్‌ పడుతుందిగానీ…. ఆ వివాదానికి మాత్రం పడేట్టు కనిపించడం లేదా? ఇద్దరు కాంగ్రెస్‌ నేతల మధ్య అంతులేని కథ నడుస్తూనే ఉందా? నియోజకవర్గం టు ఢిల్లీ.. వయా హైదరాబాద్ అన్నట్టు ఎప్పటికప్పుడు కొత్త ఎపిసోడ్స్‌ యాడ్‌ అవుతూనే ఉన్నాయా? తాజాగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ హస్తిన బాట పడితే.. సిట్టింగ్ ఎమ్మెల్యే కొత్త ఇన్ఛార్జ్‌ చెంతకు చేరడం దేన్ని సూచిస్తోంది? ఎవరా ఇద్దరు? ఏంటా వివాదం?

వనపర్తి కాంగ్రెస్‌లో వివాదం అంతులేని కథలా నడుస్తోంది. దానికి ఇప్పట్లో పులిస్టాప్ పడేలా కనిపించడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి అభ్యర్ధిగా మొదట మాజీ మంత్రి చిన్నారెడ్డి పేరును ప్రకటించి, వెంటనే తూచ్‌ అంటూ కేన్సిల్‌ చేసింది కాంగ్రెస్‌ అధిష్టానం. గెలుపు గుర్రంగా భావించి మేఘారెడ్డికి టికెట్ ఖరారు చేసింది. అనుకున్నట్టే ఆయన గెలిచారు. ఇక సీనియర్‌గా చిన్నారెడ్డిని గౌరవిస్తూ… రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో కేబినెట్‌ ర్యాంక్‌ పదవి కట్టబెట్టింది. ఇక అప్పటి నుంచి మొదలైన లొల్లి ఇప్పటి వరకు బ్రేకుల్లేకుండా సాగుతూనే ఉంది. చిన్నారెడ్డి, మేఘారెడ్డి మధ్య ప్రోటోకాల్ రగడలు నిత్యకృత్యమైపోయాయి.

ఉప్పు-నిప్పులా మారిన ఇద్దరూ… సందర్భం దొరికిన ప్రతిసారి పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకునేవారు. ఒకే పార్టీలోని భిన్న ధృవాలుగా మారిపోయారు. ఈ క్రమంలో గోపాల్‌పేటలోని ఓ కార్యక్రమంలో చిన్నారెడ్డి పార్టీ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు… అధిష్ఠానం డబ్బులకు టిక్కెట్లు అమ్ముకుందని, అవసరమైతే పార్టీలోనే ఉంటూ జీవన్‌రెడ్డిలా తిరగబడతానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ ఎపిసోడ్‌ను ఎమ్మెల్యే మేఘారెడ్డి సీరియస్‌గా తీసుకుని స్టేట్‌ నుంచి మొదలుపెట్టి ఏఐసీసీ వరకు ఫిర్యాదులు చేశారు. పార్టీ క్రమశిక్షణా సంఘం కూడా గతంలో ఎన్నడూ లేనంత వేగంగా స్పందిచడం, నివేదిక తయారు చేసి అధిష్ఠానానికి పంపడంతో చిన్నారెడ్డి మీద యాక్షన్‌ తీసుకున్నారు. ఆయన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించి, గద్వాల విజయలక్ష్మికి ఆ పోస్ట్‌ ఇచ్చింది ప్రభుత్వం.

ఆ తర్వాత సైలెంట్‌ మోడ్‌లో ఉన్న చిన్నారెడ్డి తాజాగా ఢిల్లీ వెళ్ళడం, పార్టీ పెద్దలతో రహస్య సమావేశాలు పెట్టుకోవడం, లేఖలు రాయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తనపై చర్యలు తీసుకున్న వారం రోజుల వ్యవధిలోనే ఇబ్రహీం పట్నం ప్రాంతంలో తన అనుచర వర్గంతో రహస్య భేటీ నిర్వహించిన చిన్నారెడ్డి , తాజాగా ఢిల్లీలో పార్టీ పెద్దల్ని కలిసి రాష్ట్ర పార్టీలో ఉన్న పరిస్థితులు, సీఎం వ్యవహర శైలి, నేతల మీద వస్తున్న అవినీతి ఆరోపణల్లాంటి రకరకాల అంశాలను ఏఐసీసీ పెద్దలకు వివరించినట్టు చెప్పుకుంటున్నారు. అటు సోనియా గాంధీకి కూడా పూర్తి వివరాలతో లేఖ రాసినట్లు సమాచారం.

రాష్ట్రంలో ఒరిజినల్‌ కాంగ్రెస్ నాయకులకు ఆదరణ కరవైందని, అవినీతి పెరిగిపోయిందంటూ పలు అంశాలను అందులో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అలాగే… రాష్ట్ర పార్టీలో నిరాదరణకు గురవుతున్నామని ఫీలవుతున్న కాంగ్రెస్ వాదులను ఐక్యం చేసే పనిలో కూడా చిన్నారెడ్డి బిజీ అయినట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఆయన కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టినట్లు సమాచారం. చిన్నారెడ్డితో ఎవరెవరు టచ్ లో ఉన్నారు , ఎవరి సూచనలతో స్వరం పెంచుతున్నారనే దానిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే… తాజాగా… రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్‌ బీఎం సందీప్‌ను ఎమ్మెల్యే మేఘారెడ్డి కలిసి, వనపర్తి కాంగ్రెస్‌లోని పరిస్థితుల్ని వివరించారు. చిన్నారెడ్డి ఎపిసోడ్ , పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు , ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న తీరును ఇన్ఛార్జ్‌కు ఎమ్మెల్యే వివరించినట్టు తెలుస్తోంది. ఆ సందర్భంగానే… చిన్నారెడ్డి పార్టీకి నష్టం చేస్తున్న అంశాలను ప్రస్తావించినప్పుడు.. ఉన్ కో హమ్ దేఖ్ లేంగే అన్నట్లు సమాచారం. చిన్నారెడ్డిని ఓవైపు కాచుకుంటూనే… మరోవైపు నియోజకవర్గంలో పట్టు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట ఎమ్మెల్యే మేఘారెడ్డి. మొత్తం మీద వనపర్తి కాంగ్రెస్‌లో ఉన్న పరిస్థితులు రాబోయే రోజుల్లో ఎవరికి అనుకూలంగా మారుతాయో, దీన్ని విపక్షం ఎలా అనుకూలంగా మలుచుకుంటుందోనన్న ఆసక్తి పెరుగుతోంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో.