Off The Record: అవునా…? ఆ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే మళ్ళీ మీసం తిప్పాడా? మద్యం వ్యాపారంలో ఆయనకున్న ఇమేజ్ దెబ్బకు లిక్కర్ రింగ్… గింగిరాలు తిరిగిందా? అంతా కలిసి గీత కార్మికుల బార్స్‌కు టెండర్ పెడుతున్నారా? వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చన్న ఎమ్మెల్యే లాజిక్ వెనక పెద్ద మ్యాజిక్కే ఉందా? ఎవరా శాసనసభ్యుడు? కొత్త బార్ పాలసీని అనుకూలంగా ఎలా వాడేసుకుంటున్నారు?
Read Also: Crime News : రాత్రికి రాత్రే మాయమైన సమాధులు
కుక్క తోకని ఆడిస్తుందా.. లేక తోకే కుక్కను నడిపిస్తుందా.. వినడానికి ఫన్నీగా ఉన్నా.. ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యవహారాలను చూస్తుంటే మాత్రం చాలామందికి అదే డౌట్ వస్తోందట. ఇక్కడ పొలిటికల్ లీడర్స్, లిక్కర్ సిండికేట్స్ మందు.. సోడాల్లాగా, ఫుల్లుగా మిక్స్ అయిపోయారనేది ఓపెన్ సీక్రెట్. సాధారణంగా చాలాచోట్ల అదే జరుగుతుంది గానీ… వైజాగ్‌లో ఇంకొంచెం ఎక్కువన్న ప్రచారం జోరుగా ఉంది. సిండికేట్‌లోఎమ్మెల్యేలే వాటాదారులుగా ఉండటంతో… మద్యం వ్యాపారాన్ని రాజకీయాలు శాసిస్తున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందు ఏదో.. అలాఅలా సాగిపోయినా… రాను రాను… ఈ వ్యవహారం శృతిమించి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే వరకు వెళ్ళిందనేది ఇప్పుడు మసాలా స్టఫ్ ను మించిన హాట్ టాపిక్. జిల్లాలో బార్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తడమే అందుకు కారణం అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కొత్త బార్ పాలసీ వ్యాపారులకు గిట్టుబాటుగా లేకపోవడంతో పెద్దగా స్పందన రాలేదు. ఎక్సైజ్ అధికారులు ఎంత వెంటబడ్డా వర్కవుట్ కాని పరిస్థితులు చాలా జిల్లాల్లో ఉన్నాయి. కానీ… మొదటి నుంచి లిక్కర్ సేల్స్‌లో రికార్డులు బద్దలు కొట్టే గ్రేటర్ విశాఖలో మాత్రం అందుకు భిన్నంగా ఉందట వ్యవహారం.
Read Also: Ganja Case: ‘మత్తువదలరా’.. యూనివర్శిటీ క్యాంపస్‌లలోకి గంజాయి
ఇక్కడ మద్యం షాపైనా…బార్ అయినా సిండికేట్ డిసైడ్ చేయాల్సిందే. అదే ఒరవడిని గీత కార్మికులకు కేటాయించిన బార్ల లైసెన్సులను కొట్టేయడంలో కూడా చూపించారని, నగరానికి చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే ఈ మంత్రాంగం వెనుక మాస్టర్ బ్రెయిన్ అన్న మాటలు రీ సౌండ్‌లో వినిపిస్తున్నాయి వైజాగ్ పొలిటికల్ సర్కిల్స్‌లో. కుల వృత్తులకు కేటాయించిన బార్ లైసెన్సులు దక్కించుకోవడానికి పోటీ పడటం వెనుక అసలు లెక్క ఏంటంటే… సగం లైసెన్స్ ఫీజును రాయితీగా ప్రకటించడమేనని చెప్పుకుంటున్నారు. కొంత మంది మద్యం వ్యాపారులే సిండికేట్‌గా ఏర్పడి గీత కార్మికులతో దరఖాస్తులు చేయించారనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఒక్కో సాధారణ బార్‌కు ఏడాదికి లైసెన్స్ ఫీజు 75 లక్షలుగా నిర్ణయించింది ప్రభుత్వం. దరఖాస్తు ఫీజ్ కింద మరో ఐదు లక్షలు చెల్లించాలి. కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ నిర్వహించాలనే నిబంధన పెట్టింది ఎక్సైజ్ శాఖ. అదే సమయంలో మద్యం దుకాణాల దగ్గర పర్మిట్ రూమ్స్‌కు అనుమతి ఇవ్వడంతో…ఎక్కువ మంది మందుబాబులు బార్స్‌కు వెళ్ళడం లేదట. ఇక బిజినెస్ సర్కిల్స్, హై సొసైటీ వాళ్ళు స్టార్ హోటళ్లు, రిసార్ట్స్‌కు చెక్కేస్తుంటారు. దీంతో బార్‌కు వెళ్లే వాళ్ళ సంఖ్య తగ్గిపోయి నిర్వహణ ఖర్చులు కూడా భారమవుతాయన్న భయంతోనే వ్యాపారులు బార్ల వైపు ఆసక్తి చూపడం లేదంటున్నారు.
Read Also: Off The Record: వైఎస్కు కేవీపీలా.. రేవంత్కు నేను అన్న వ్యక్తి ఎవరు?
ఇలాంటి వాతావరణంలో… జిల్లాలో 121 బార్లకు నోటిఫికేషన్ ఇస్తే… 45 చోట్ల అసలు దరఖాస్తులు రాలేదు. మరో 10 బార్లను గీత కార్మికుల కోటా కింద కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందు కోసం 32.5 లక్షలు మాత్రమే లైసెన్స్ ఫీజుగా నిర్ణయించింది. అంటే రెగ్యులర్ లైసెన్స్‌లో సగమేనన్నమాట. ఈ లెక్కన మూడేళ్ళ కాల పరిమితికి కోటి రూపాయల దాకా లైసెన్స్ ఫీజు మిగులుతుంది. దీంతో… మద్యం వ్యాపారంలో ఆరితేరిన సిండికేట్ గీత కార్మికుల కోటాలోని బార్స్‌ని కైవసం చేసుకోవడంపై దృష్టి పెట్టిందట. కనీసం నాలుగు దరఖాస్తుల నిబంధన పాటిస్తూనే… అంతకంటే ఎక్కువ మంది పోటీకి రాకుండా బలంగా అడ్డుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం కూడా టార్గెట్ కోసం ఒత్తిడి చేస్తుండటంతో సిండికేట్ల ప్రపోజల్ కు ఎక్సైజ్ యంత్రాంగం సైతం ఊ కొట్టడంతో…. సిండికేట్ పంట పండిందని చెప్పుకుంటున్నారు విశాఖ జిల్లాలో. ఈ తెరవెనుక వ్యవహారం బయటకు పొక్కడంతో లోగుట్టు మొత్తాన్ని నిఘా వర్గాలు ప్రభుత్వ పెద్దల చెవిలో వేశాయట.
Read Also: ప్రాణాలు తీస్తున్న డీజే సౌండ్స్ – యువత ఆరోగ్యానికి ముప్పు
కుల వృత్తుల స్వావలంబన కోసం ఫీజులు తగ్గిస్తే సిండికేటుగాళ్ళు చక్కబెట్టేయడంపై టీడీపీ అధినాయకత్వం కూడా కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే… ఈ లాబీయింగ్ వెనుకున్న పాత్రధారులను పిలిచి ఓ ఎంపీ క్లాస్ పీకినట్టు సమాచారం. ప్రభుత్వ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా వ్యవహారాలు నడిపిస్తే… సహించేది లేదని తేల్చి చెప్పేశారట ఎంపీ. ఈ పరిణామాన్ని ఊహించని సూత్రధారులు ఇప్పుడు కంగారు పడుతున్నారట. లైసెన్స్ ఫీజుల కింద కట్టిన డబ్బులు ఎవరి అకౌంట్ల నుంచి వెళ్ళాయి…వాళ్ళకు, గీత కార్మికులకు ఉన్న సంబంధం ఏంటి…!!. లైసెన్స్ ఫీజు కట్టిన వాళ్ళ ఆర్థిక స్థితి ఏమిటి….!!. లాంటి వెక్కల్ని బయటకు తీస్తే…. సిండికేట్ వెనకున్న అదృశ్య శక్తుల ఆచూకీ బయటపడటం పెద్ద కష్టమేమీ కాదనే టాక్ నడుస్తోంది విశాఖలో.
