Site icon NTV Telugu

వైసీపీ లో కీచులాటలు..టికెట్ కోసం నేతల మధ్య పోటీ

Terma Lo Alajadiy

Terma Lo Alajadiy

విశాఖ నగరంపై పట్టు సాధించేందుకు అధికార వైసీపీ ఎప్పటికప్పుడు వ్యూహాలను మారుస్తోంది. సామాజిక సమీకరణాలు.. భవిష్యత్ అవసరాలు.. ఇలా అన్నింటినీ పక్కాగా లెక్కేసుకుని ముందుకెళ్తోంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల నుంచి మంత్రివర్గ విస్తరణలో అవకాశాల వరకు ప్రతీదానికీ కేలిక్యూలేషన్స్ ఉన్నాయి. పార్టీని బలోపేతం చేసే దిశగా హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలపై కొంత వ్యతిరేకత ఉన్నా.. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బయటపడిన సందర్భాలు తక్కువే. 2024నాటికి జీవీఎంసీ పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాలనూ కైవశం చేసుకోవాలని గట్టిపట్టుదలతో ఉంది వైసీపీ. అయితే అన్ని నియోజకవర్గాల కంటే వైజాగ్ ఈస్ట్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది.

యాదవ, కాపు, మత్స్యకార సామాజికవర్గాలు వైజాగ్‌ ఈస్ట్‌లో కీలకం. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే శక్తి యాదవులకు ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రత్యర్థిపార్టీ కానీ.. అభ్యర్థితో కానీ సంబంధం లేకుండా విజయం సాధిస్తూ వస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. ఆయనను ఓడించడానికి ఒకసారి ప్రజారాజ్యం, రెండుసార్లు వైసీపీ ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. వరసగా మూడుసార్లు టీడీపీ నుంచి విజయం సాధించిచారు వెలగపూడి. దీంతో ఈస్ట్‌లో పాగా వేయడం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది వైసీపీ. బీసీలను ఆకట్టుకోవడానికి యాదవ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలోనే 2019లో ఓడిపోయిన అక్కరమాని విజయ నిర్మలకు నగరంలో కీలకమైన వైజాగ్ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్‌పర్సన్‌ పదవి లభించింది. 11వ డివిజన్ నుంచి గెలిచిన హరివెంకట కుమారిని అనూహ్యంగా మేయర్ పీఠంపై కూర్చోబెట్టింది వైసీపీ. ఇక్కడ రెండుసార్లు పోటీ చేసి ఓడిన వంశీకృష్ణను ఎమ్మెల్సీని చేసింది. ఎమ్మెల్యే వెలగపూడికి చెక్ పెట్టే దిశగా వైసీపీ చేసిన ఈ ప్రయత్నాలు మొదట్లో ఫలించినట్టే కనిపించాయి. కలిసికట్టుగా దూకుడుగా వెళ్లిన అక్కరమాని, మేయర్ వర్గాల మధ్య ఇప్పుడు అగ్గిరాజుకుంది.

అక్కరమాని, మేయర్‌ వర్గాలు ఒకరి కార్యక్రమాలకు మరొకరు హాజరు కావడం లేదు. కొద్దిరోజులుగా నియోజకవర్గ కేడర్ నలిగిపోతుండగా.. ఇప్పుడు అధికారులకు మద్దెల దరువు మొదలైందని టాక్. విశాఖ మెట్రో రీజియన్ డవలప్ మెంట్ అథారిటీ పరిధి మూడు జిల్లాలకు విస్తరించి ఉంటుంది. జీవీఎంసీ ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద నగరం. ఈ రెండు కీలకమైన సంస్థలకు చైర్మన్, మేయర్ అంటే ఆ ఇమేజే వేరు. ప్రథమ పౌరురాలిగా హరి వెంకట కుమారి, VMRDA ఛైర్‌పర్సన్‌గా విజయనిర్మల ఎవరి ఎత్తుగడల్లో వారు ఉండటంతో ఈస్ట్ రాజకీయం రసకందాయంలో పడుతోంది. వీటి వెనక అసలు కథ ఆసక్తికరంగానే ఉందట. అదే వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం పెరుగుతున్న పోటీ.

సామాజికవర్గ పెద్దల ఆశీసులు కోరుతున్న మేయర్ భర్త..?అక్కరమాని ఫ్యామిలీ భీమిలి నుంచి వచ్చి సిటీలో రాజకీయం చేస్తోంది. మేయర్ కుటుంబం మొదటి నుంచి ఈస్ట్ నియోజకవర్గంలోనే ఉంది. బలం, బలగం తమకు ఎక్కువ కనుక వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆశించడంలో తప్పేముందనే అభిప్రాయంలో మేయర్ భర్త శ్రీనివాస్ ఉన్నారట. ఇందులో భాగంగా ఇప్పటికే వివిధ పార్టీల్లో ఉన్న సామాజికవర్గ పెద్దలను కలిసి ఆశీర్వదించమని కోరుతున్నారు. చాప కింద నీరులా మేయర్ భర్త ప్రయత్నాలు పారంభించడంతో ప్రతిఘటించాలని అక్కరమాని వర్గం స్కెచ్ వేస్తోందట. ఈ తరుణంలోనే కుమ్ములాటలు పెరుగుతున్నాయి. ఉమ్మడి లక్ష్యం కోసం హైకమాండ్ సంధించిన ఆయుధం మిస్ ఫైర్ అవుతుందే మోననే టెన్షన్ ఈస్ట్ వైసీపీలో గుబులు రేపుతోందట. మరి.. పార్టీ పెద్దలు ఎలా గాడిలో పెడతారో చూడాలి.

Watch Here : https://youtu.be/cXeZLAQmEns

Exit mobile version