NTV Telugu Site icon

Vanteru Dookudu: వంటేరు దూకుడు ఎందుకు?

తొందరపడి కోయిల ముందే కూసినట్టుగా ఆయన తీరు ఉందా? అక్కడ నుంచి పోటీ చేయాలని తెగ ఉబలాట పడుతున్నారా? ఇది ఆయనకు వచ్చిన ఆలోచనేనా లేక.. పార్టీ చెప్పిందా? అన్నింటికీ సిద్ధపడే మాట్లాడేస్తున్నారా? ఇంతకీ ఎవరా నాయకుడు?

గజ్వేల్‌లో వంటేరు ప్రతాప్‌రెడ్డి తీరుపై చర్చ
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అసెంబ్లీలో 100కు పైగా శాసనసభ్యుల బలం ఉంది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆశావహులు అవకాశం ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే గజ్వేల్‌ నుంచి ఒకసారి టీడీపీ, మరోసారి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేశారు వంటేరు ప్రతాప్‌రెడ్డి. మారిన రాజకీయ పరిణామాలల్లో భాగంగా ప్రతాప్‌రెడ్డి అధికార టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. గులాబీ కండువా కప్పుకోగానే ఆయనకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ ఛైర్మన్ పదవి లభించింది. అయినప్పటికీ గజ్వేల్‌ను వీడకుండా నియోజకవర్గంలో చురుకుగానే ఉంటూ వస్తున్నారు.

గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తానని వంటేరు ప్రచారం?
ఇన్నాళ్లూ బాగానే ఉన్నా.. తాజగా మొదలైన రాజకీయ ప్రచారం హాట్‌ టాపిక్‌గా మారింది. గజ్వేల్‌ సెగ్మెంట్‌ నుంచి తానే పోటీ చేయబోతున్నట్టు వంటేరు ప్రతాప్‌రెడ్డి చెప్పుకొంటున్నారట. దానిపై అధికారపార్టీలో ఒక్కటే గుసగుసలు. గజ్వేల్‌లో పోటీయే లక్ష్యంగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారనే చర్చ గులాబీ పార్టీలో జోరందుకుంది. పోటీ చేసే విషయంలో ఆయనకు పార్టీ నుంచి ఏమైనా సంకేతాలు వచ్చాయా లేక ఆయనే సొంతంగా దూకుడు పెంచారా అన్నది మరికొందరి ప్రశ్న.

వంటేరు దూకుడుపై పార్టీ పెద్దల రియాక్షన్‌ ఏంటో?
గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తానని వంటేరు చెప్పుకోవడం.. ఆ తర్వాతి పరిణామాలపై అధికారపార్టీ వర్గాల్లో ప్రస్తుతం చర్చ జరుగుతోందట. ఎందుకు వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆ విధంగా ప్రచారం చేసుకుంటున్నారు? గజ్వేల్‌పై ఉన్న ఆసక్తితో తొందరపడి కర్చీఫ్‌ వేసే ప్రయత్నాలు మొదలుపెట్టారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చేతిలో నామినేటెడ్‌ పోస్ట్‌ ఉంది. రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఉన్నారాయన. ఈ స్థాయిలో పదవి కట్టబెట్టిన తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం పార్టీ ఇస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. అలాగే వంటేరు దూకుడు గురించి టీఆర్ఎస్‌ పెద్దలకు తెలిస్తే రియాక్షన్‌ ఏంటా అనే ఉత్కంఠ నెలకొందట. మరి.. వంటేరు ప్రతాప్‌రెడ్డి ఎపిసోడ్‌ గులాబీ శిబిరంలో ఎలాంటి పరిణామాలకు వేదిక అవుతుందో చూడాలి.