NTV Telugu Site icon

Udayagiri Assembly constituency :ఆ నియోజకవర్గంలో టికెట్ కోసం స్పీడందుకున్న అధికార పార్టీ నేతల కదలికలు

Ycp

Ycp

Udayagiri Assembly constituency : ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల కదలికలు స్పీడ్‌ అందుకున్నాయి. ఆలస్యం అమృతం విషం అన్నట్టుగా పావులు కదిపేస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉండగానే.. వివిధ సమీకరణాలను ముందు పెట్టుకుని టికెట్ కోసం గట్టిగానే లాబీయింగ్‌ చేస్తున్నారట. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.

నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి. ఈ నియోజకవర్గంపై గట్టి పట్టు సాధించారని అనుకున్నా.. 2019 ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది. స్థానిక నేతలకు.. చంద్రశేఖర్‌రెడ్డికి మధ్య విభేదాలు వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక.. టికెట్ల కేటాయింపు ఆ విభేదాలను మరింత పెంచాయి. ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి తీరుకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే రోడ్డెక్కి ధర్నాలు చేశారు. చివరకు పార్టీ పదవులను సైతం తనకు ఆర్థికంగా అనుకూలంగా ఉన్నవారికి ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. వీటిపై వైసీపీ పెద్దలకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి.

ప్రస్తుతం అవకాశం చిక్కితే చాలు.. ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి. చాలా మంది వ్యతిరేకంగా ఉండటంతో ఎమ్మెల్యేలో కూడా అసహనం పెరుగుతోందట. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఇస్తే పోటీ చేస్తా.. లేదంటే తన పని తాను చేసుకుంటానని ఇటీవల చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. టికెట్‌పై ధీమా లేకపోవడం వల్లే ఎమ్మెల్యే అలాంటి ప్రకటనలు చేస్తున్నారని భావిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ ఛాన్స్‌ ఇస్తే బరిలో దిగేందుకు పార్టీ నేతలు సై అంటున్నారు. పనిలో పనిగా పావులు కదిపేస్తున్నారు.

IVRS పద్దతి ద్వారా కొన్ని సంస్థలు ఉదయగిరిలో సర్వేలు చేపట్టాయి. ఉదయగిరిలో ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది అని ఆ సర్వేలో ప్రశ్నించడంతో.. చంద్రశేఖర్‌రెడ్డిని మార్చేస్తారని అనుకుంటున్నారట. కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, వైసీపీ నేత కావ్య కృష్ణారెడ్డిలు ఉదయగిరిపై గట్టిగానే ఫోకస్‌ పెట్టారట. వైసీపీ మండలస్థాయి నాయకులతో కావ్య కృష్ణారెడ్డి తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఇదే నియోజకవర్గంలో తన ట్రస్ట్‌ ద్వారా సేకా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ విధంగానూ పరిచయాలు పెరగడంతో.. రాజకీయంగా అనుకూల పరిస్థితులు సృష్టించుకునే పనిలో ఉన్నారట.

మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నా.. ఉదయగిరిపై ఈసారి మనసు పారేసుకున్నారని చెబుతున్నారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలను తరచూ కలిసి మాట్లాడుతున్నారు. ఆ మధ్య జరిగిన ఉదయగిరి వైసీపీ ప్లీనరీకి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు కూడా. వీళ్లే కాదు.. రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి సైతం ఉదయగిరి వైసీపీ టికెట్‌ ఆశిస్తున్నారట. పార్టీలో తనకు పరిచయం ఉన్న పెద్దలతో లాబీయింగ్‌ చేస్తున్నట్టు సమాచారం. మొత్తంమీద ఉదయగిరిలో వైసీపీ నేతలు ఏ ముగ్గురు కలిసినా.. టికెట్‌ కోసం పోటీ పడుతున్న వారి గురించే చర్చ జరుగుతోంది. మరి.. పార్టీ ఆలోచనలేంటో చూడాలి.