Site icon NTV Telugu

హుజురాబాద్‌లో ఎన్నికల సింబల్స్‌పై చర్చ..!

ప్రధాన పార్టీ అభ్యర్థులను ఎన్నికల గుర్తులు టెన్షన్‌ పెడుతున్నాయా? హుజురాబాద్‌లోనూ ఆ కథ పునరావృతం అవుతుందా? ఏ సింబల్స్‌పై కలవరం నెలకొంది? గత ఎన్నికల ఫలితాలు చెబుతున్నదేంటి?

చపాతీ రోలర్‌.. రోడ్డు రోలర్‌ గుర్తులతో టెన్షన్‌..!

ఎన్నికల్లో ఒక్క ఓటుతో గెలిచినా.. గెలుపు గెలుపే. ఓడిన అభ్యర్థి కంటే.. ఆ అభ్యర్థికి పడాల్సిన ఓట్లను కొల్లగొట్టినవారే ఎక్కువగా చర్చల్లోకి వస్తారు. అది కొన్నిసార్లు రెబల్స్‌వల్ల నష్టం చేకూరొచ్చు.. మరికొన్నిసార్లు గుర్తుల వల్ల కావొచ్చు. 2019 లోక్‌సభ, గత ఏడాది జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక కావొచ్చు.. ఈ గుర్తుల చుట్టూనే పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్‌కు చపాతీ రోలర్‌, రోడ్డు రోలర్‌ సింబల్స్‌ ముచ్చెమటలు పట్టించాయి. బ్యాలెట్‌లో ఆ రెండు సింబల్స్‌ టీఆర్‌ఎస్‌ కారు గుర్తుకు దగ్గరగా ఉండటమే కారణం. ప్రస్తుతం హుజురాబాద్‌లోనూ ఇద్దరు ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు వాటిని కేటాయించింది ఎన్నికల సంఘం.

2019 భవనగిరిలో రోడ్‌ రోలర్‌ గుర్తుకు 27 వేల ఓట్లు..!
దుబ్బాక ఉపఎన్నికలో చపాతీ రోలర్‌కు 3,570 ఓట్లు..!

2019 భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 5 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అదే ఎన్నికల్లో పోటీ చేసిన ఒక స్వతంత్ర అభ్యర్థికి 27వేలకుపైగా ఓట్లు వచ్చాయి. ఆ అభ్యర్థి గుర్తు రోడ్డురోలర్‌. కారు గుర్తు అనుకుని రోడ్డు రోలర్‌కు ఓట్లు పడ్డాయని గులాబీ శ్రేణులు లబోదిబోమన్నాయి. గత ఏడాది జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ ఒక వెయ్యి 79 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అదే ఎన్నికలో ఒక స్వతంత్ర అభ్యర్థికి 3వేల 570 ఓట్లు వచ్చాయి. ఆయనకు చపాతీ రోలర్‌ను గుర్తుగా ఇచ్చారు. ఆ గుర్తే తమ కొంప ముంచిందని వాపోయారు టీఆర్ఎస్‌ నేతలు. అందుకే హుజురాబాద్‌లో చపాతీ రోలర్‌, రోడ్డు రోలర్‌ గుర్తులను తలచుకుని టెన్షన్‌ పడుతున్నారట అధికార పార్టీ నేతలు.

ఈటలది కారు కాదు.. కమలం గుర్తు అని పరిచయం చేయడానికి బీజేపీ తంటాలు..!?

ఇదే సమయంలో బీజేపీ శిబిరంలోనూ ఆందోళన ఉందట. ఒక స్వతంత్ర అభ్యర్థికి కాలీఫ్లవర్‌ గుర్తు కేటాయించడమే వారి టెన్షన్‌కు కారణం. అలాగే ఇన్నాళ్లూ ఈటల రాజేందర్‌ అంటే హుజురాబాద్‌ ప్రజలకు కారు గుర్తే తెలుసు. ఇప్పుడు ఈటలది కారు గుర్తు కాదని.. కమలం గుర్తును పరిచయం చేయడానికి తంటాలు పడుతున్నాయి. ఇప్పటికీ ఆ టెన్షన్‌ వారిలో పోలేదట. అందుకే పోలింగ్‌ నాటికి ఈ కన్ఫ్యూజన్‌ తొలగించడం ఎలా? ఏమౌతుందో అని కాషాయ శిబిరంలో ఒకటే చర్చ. మరి.. ప్రధాన పార్టీలు ఈ గుర్తుల గండాన్ని ఎలా అధిగమిస్తాయో చూడాలి.

Exit mobile version