NTV Telugu Site icon

గులాబీ శిబిరంలో ఆపరేషన్‌ వికర్ష్‌

Trs Operation Vikarstion Copy

Trs Operation Vikarstion Copy

వచ్చే ఎన్నికల్లో టికెట్‌ వస్తుందా? ఎన్నికల్లో పోటీ చేయగలమా? రాజకీయ భవిష్యత్‌ ఏంటి? ఈ ప్రశ్నల చుట్టూనే కొందరు టీఆర్ఎస్‌ నేతల ఆలోచనలు ఉన్నాయట. ఉన్నచోటే ఉంటే.. ఛాన్స్‌ రాకపోతే ఎలా అనే ఆందోళనలో మరోదారి వెతుక్కునే పనిలో ఉన్నట్టు టాక్‌. రాజకీయ అవకాశాల కోసం లెక్కలతో కుస్తీ పడుతున్నారట.

జంపింగ్‌ జపాంగ్‌ల కాలం మొదలైందా?

తెలంగాణలో రాజకీయ వేడి నెలకొంది. ఎన్నికలకు ఇంకా టైమ్‌ ఉన్నా.. ఇప్పటి నుంచే జాగ్రత్త పడే పనిలో బిజీ అవుతున్నారు నాయకులు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్న వాళ్ల సంఖ్య అధికార టీఆర్‌ఎస్‌లో ఎక్కువగానే ఉంది. ఎవరిస్థాయిలో వాళ్లు లాబీయింగ్‌ చేస్తూనే ఉన్నారు. జరుగుతున్న పరిణామాలు.. సామాజిక సమీకరణాలు.. పార్టీ అవసరాలను గమనిస్తున్న అలాంటి నాయకులు భవిష్యత్‌ కార్యాచరణలో తలమునకలు అవుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కొందరు నేతలు ముందే జాగ్రత్త పడే పనిలో ఉన్నారట. గులాబీ శిబిరంలో ఉక్కపోతగా ఉంటే జంప్‌ చేయడానికి వెనకాడటం లేదు. జంపింగ్ జపాంగ్‌ల కాలం కూడా మొదలైపోయింది.

2018, 2019 ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో అనేకమంది చేరిక 2018లో టీఆర్ఎస్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న సమయంలో ఇతర పార్టీలకు చెందిన అనేక మంది నాయకులు గులాబీ కండువా కప్పేసుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు కూడా ఈ విధంగా క్యూ కట్టారు చాలామంది. ఆ సమయంలో కొందరికి భవిష్యత్‌లో అవకాశాలు ఇస్తామన్న హామీలు రావడంతో జాయిన్‌ కావడానికి వెనకాముందు ఆలోచించలేదు. మరికొందరు పార్టీ ఏదో ఒక విధంగా గుర్తించకపోతుందా అనే ఆశతో కాలం గడిపేశారు. అధికారపార్టీ కూడా పదవులు పందేరంలో కొందరికి ఛాన్స్‌ ఇచ్చింది. కాంగ్రెస్‌, బీజేపీ నుంచి వచ్చిన వాళ్లలో కొందరిని ఎమ్మెల్సీలను చేశారు.. ఇంకొందరికి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులు కట్టబెట్టారు.

భవిష్యత్‌ కోసం ఇతర పార్టీల్లోకి జంప్‌ ఇంత వరకు బాగానే ఉన్నా.. పదవులు రానివారితోపాటు.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయి.. పార్టీలో ఎలాంటి గుర్తింపు రానివాళ్లే టెన్షన్‌ పడుతున్నారట. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ రాదేమోననే ఆందోళనతో గులాబీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ అదే చేశారు. అదేబాటలో నచ్చినచోటకు వెళ్లడానికి మరికొందరు నాయకులు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. టికెట్‌ హామీ ఇస్తే కొత్తపార్టీ కండువా కప్పేసుకోవడానికి క్షణం ఆలస్యం చేయడం లేదట. చాలామంది రహస్య మంత్రాంగాలలో మునిగిపోయినట్టు తెలుస్తోంది.

వచ్చేవాళ్ల కోసం బీజేపీ, కాంగ్రెస్‌ ఎదురుచూపులు రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా బలమైన నాయకులు వస్తే చేర్చుకునేందుకు వెనకాడటం లేదు. వచ్చిన వాళ్లను కాదనకుండా తమ శిబిరాల్లో చేర్చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలు అధికారపార్టీలో చర్చగా మారుతున్నాయి. మరి.. ఈ ఆపరేషన్‌ వికర్ష్‌కు టీఆర్‌ఎస్‌ ఎలాంటి విరుగుడు మంత్రం వేస్తుందో చూడాలి.