కొత్తగా వచ్చిన పథకాలు చేతినిండా వారికి పని కల్పిస్తున్నాయి. కానీ.. వైరిపక్షం చేసే విమర్శలకే కౌంటర్లు ఇవ్వడం లేదట. కొందరే స్పందిస్తున్నారట. మిగతా వారి సంగతేంటో తెలియడం లేదు. వాళ్లది మౌనమా.. వ్యూహమా కూడా అర్థం కావడం లేదట. టీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం ఈ చర్చే సాగుతోంది.
ప్రవీణ్‌కుమార్ విమర్శలకు కొందరే కౌంటర్ ఇచ్చారా?
తెలంగాణలో కొత్తగా రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ పొలిటికల్ కలర్స్ మారుతున్నాయి. మాజీ ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్ బీఎస్పీలో చేరి.. దళిత బహుజనవాదం ప్రచారం చేస్తున్నారు. ఆయన గురి అంతా అధికారపార్టీ టీఆర్ఎస్‌పైనే. నల్లగొండ సభలోనే టీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సభ జరిగిన మరుసటి రోజే టీఆర్‌ఎస్‌లోని దళిత ఎమ్మెల్యేలతోపాటు మరికొందరు కౌంటర్ చేశారు. భవిష్యత్‌లోనూ ప్రవీణ్‌కుమార్‌కు అదే సామాజికవర్గం నుంచే బదులిచ్చేందుకు ఫోకస్ పెట్టింది అధికారపార్టీ. ఇప్పటి వరకు కొందరు మాట్లాడినా.. మరికొందరు మాత్రం పెదవి విప్పడం లేదు. పరిస్థితులను అంచనా వేసే పనిలో పడ్డారట. వారి గురించే గులాబీ శిబిరంలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. తాజా పరిణామాలను టీఆర్ఎస్‌లోని దళిత సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా విశ్లేషిస్తున్నారట. ప్రవీణ్‌కుమార్ అండ్ కో నుంచి వచ్చే విమర్శలకు గట్టిగా బదులివ్వాలా? లేక లైట్ తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నారట.
కొందరికి వ్యూహాత్మక మౌనమా?
ముందే నోరు జారడం ఎందుకు అనుకుంటున్నారా?
టీఆర్ఎస్ దళిత సామాజికవర్గం ఎమ్మెల్యేలలో కొందరు మౌనంగా ఉండటానికే మెగ్గు చూపుతున్నారట. వారిలో కొందరు వ్యూహాత్మకంగా సైలెన్స్ పాటిస్తున్నట్టు టాక్. ఇలాంటి వారిపై టీఆర్ఎస్ పెద్దలు ఓ నజర్ వేసినట్టు సమాచారం. వారు ఎందుకు మాట్లాడటం లేదు. సమాచారం లేదా.. కౌంటర్లు ఇవ్వడానికి జంకుతున్నారా అన్నది అర్థం కావడం లేదట. రాజకీయాలు ఎప్పుడెలా ఉంటాయో అర్థంకాక.. ముందే నోరు జారడం ఎందుకనే అభిప్రాయంలో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం.
కౌంటర్ ఇస్తే మార్కులు? ఇవ్వకపోతే పార్టీ ఫోకస్?
టీఆర్‌ఎస్ సర్కార్ ఒకవైపు దళితబంధు పథకానికి విస్తృత ప్రాధాన్యం కల్పిస్తుంటే.. ఇప్పుడు అదే సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేల వైఖరి చర్చలోకి రావడం ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం వాళ్ల ముందు ఉన్న ఆప్షన్ ఒకటేనట. ప్రవీణ్‌కుమార్‌కు కౌంటర్ ఇస్తారా లేదా? కౌంటర్లు ఇస్తే అధికారపక్షంలో మార్కులు పడతాయి. మౌనంగా ఉంటే పార్టీ పెద్దల దృష్టిలో పడతారు. వీటి మధ్య తేడా ఎమ్మెల్యేలకు బాగా తెలుసని చెవులు కొరుక్కుంటున్నాయి పార్టీవర్గాలు. మరి.. టీఆర్ఎస్‌లోని దళిత సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఏం చేస్తారో చూడాలి.
