Site icon NTV Telugu

హరీష్‌రావు, వినోద్‌కుమార్‌లకు హుజురాబాద్‌ బాధ్యతలు…?

హుజురాబాద్ ఉపఎన్నిక బాధ్యతలను టీఆర్ఎస్ ఆ ఇద్దరు నేతలకు అప్పగించిందా? వెంటనే వారు రంగంలోకి దిగిపోయారా? క్షేత్రస్థాయి కార్యకర్తలు.. లోకల్‌ లీడర్స్‌తో టచ్‌లోకి వెళ్లారా? హుజురాబాద్‌లో గులాబీ పార్టీ అనుసరిస్తున్న కొత్త వ్యూహం ఏంటి? ఇంతకీ ఎవరా నాయకులు? లెట్స్‌ వాచ్‌!

అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ ఐదు ఉపఎన్నికలు

ఉపఎన్నికలను ఎదుర్కోవడంలో టీఆర్‌ఎస్‌ వ్యూహాలు ఇతర పార్టీలకు భిన్నంగా.. దూకుడుగా ఉంటాయి. 2014లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు అయిదు ఉపఎన్నికలను ఎదుర్కోంది. మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు నారాయణఖేడ్, పాలేరు ఉపఎన్నికల్లో రెండుచోట్లా గెలిచింది. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూర్‌నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్ ఉపఎన్నికలను ఫేస్ చేసింది. హుజూర్‌నగర్ ఉపఎన్నిక బాధ్యతను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానాన్ని గెలుచుకుంది అధికారపార్టీ. ఆ తర్వాత జరిగిన దుబ్బాక ఉపఎన్నిక బాధ్యతలు మంత్రి హరీష్‌రావు చేపట్టారు. ఆ ఉపఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేక పోయింది గులాబీపార్టీ. నాగార్జున్‌సాగర్ ఉపఎన్నికను పార్టీ పెద్దలు నేరుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి గెలుచుకున్నారు.

హుజురాబాద్‌ బాధ్యత ఇద్దరు సీనియర్లకు అప్పగింత

ప్రతి ఉపఎన్నికనూ అధికారపార్టీ సీరియస్‌గానే తీసుకుంది. ఇంఛార్జులను పెట్టి పాగా వేయడానికి ప్రయత్నించింది. పార్టీ నుంచి వచ్చే ఆదేశాలను ఎప్పటికప్పుడు ఆ ఇంచార్జ్‌లు నియెజకవర్గంలో క్షేత్రస్థాయిలో అమలు చేశారు. ఇప్పుడు హుజురాబాద్‌ బై ఎలక్షన్‌పై టీఆర్‌ఎస్‌ ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇద్దరు సీనియర్ నేతలకు హుజుర్‌నగర్ బైఎలక్షన్ బాధ్యతలు అప్పగించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

వినోద్‌కుమార్‌, హరీష్‌రావులకు ఉపఎన్నిక బాధ్యతలు?
జిల్లా మంత్రులతో ఇప్పటికే సమాలోచనలు

ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ నియెజకవర్గ ఉపఎన్నికకు టీఆర్ఎస్ రెడీ అవుతోంది. మండలాల వారీగా ఇంచార్జీలను నియమించారు. మొత్తంగా నియెజకవర్గ ఉపఎన్నికను పర్యవేక్షించేందుకు ఇద్దరు సీనియర్‌ నాయకులకు బాధ్యతలు అప్పగించారట. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మంత్రి హరీష్ రావులకు హుజురాబాద్ వ్యవహారాలను పర్యవేక్షించాలని పార్టీ పెద్దలు సూచించారట. దీంతో ఆ నియెజకవర్గానికి సంబంధించి.. అక్కడి నేతలు, మండలాల ఇంఛార్జులతో వీరిద్దరూ టచ్‌లో ఉంటున్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి ఏమైన ప్రతినిధి బృందాలు ఉంటే తీసుకువచ్చి.. వీరితో భేటీలు ఏర్పాటు చేయిస్తున్నారట. అలాగే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మంత్రులతోనూ ఎన్నికల వ్యూహంపై సమాలోచనలు చేసినట్టు టాక్.

ఎన్నడూ లేని విధంగా ఇద్దరికి బాధ్యతలు

మొత్తంగా హుజురాబాద్ ఉపఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్టు స్పష్టం అవుతోంది. గతంలో ఏన్నడూ లేని విధంగా ఇద్దరు సీనియర్ నేతలకు ఎలక్షన్‌ వ్యవహారాలను అప్పగించడం అంటే … ఉపపోరు ఓ రేంజ్‌లో ఉంటుందని భావిస్తున్నారు.

Exit mobile version