Site icon NTV Telugu

కొత్త జోనల్‌ విధానంలో భారీగా బదిలీలు..!

కీలక సమయంలో ఉపాధ్యాయ సంఘాలను ప్రభుత్వం లైట్‌ తీసుకుందా? ప్రభుత్వంలోని పెద్దలను కలిసి మాట్లాడుతున్నా.. మార్పు లేదు? ఒకప్పుడు బదిలీలు.. పదోన్నతులు అంటే క్షణం తీరిక లేకుండా గడిపిన టీచర్ల సంఘాల నేతలు.. మౌనంగా ఎందుకున్నారు?

ప్రత్యేక రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలు నిర్వీర్యం..!

తెలంగాణలో 50కి పైగా ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. విద్యాశాఖలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ ప్రభావం స్పష్టంగా కనిపించేది. ఏదైనా జరుగుతుంది అంటే అందులో తమ ప్రమేయం ఉన్నట్టుగా హడావిడి చేసి ప్రకటనలు గుప్పించేవారు యూనియన్ల నేతలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ సంఘాలు నిర్వీర్యం అయ్యాయి అన్నది టీచర్లలో జరుగుతున్న చర్చ. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయ కేటాయింపు ప్రక్రియ నడుస్తోంది. ఇందులో ఎక్కువగా ప్రభావితం అయ్యేది టీచర్లే అయినా.. ఆ సంఘాల ఉనికే లేకుండా పోయింది.

కొత్త జోనల్‌ విధానంలో జీవో మార్చాలని డిమాండ్..!

ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేస్తే దానికి అనుగుణంగా విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేసేది. రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు అమలు, కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగ..ఉపాధ్యాయ కేటాయింపుల కోసం 317 జీవో జారీ అయ్యింది. ఈ జీవో ఆధారంగా విద్యాశాఖ ప్రత్యేక ప్రొసీడింగ్స్ జారీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. ఆ జీవోను సవరించాలని కోరారు నేతలు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేర్వేరని గొంతుచించుకున్నారు. స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కానీ.. వారి వేదిన అరణ్య రోదనే అయింది. సీనియారిటీలో అక్రమాలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేసినా .. ప్రభుత్వం పట్టించుకోలేదు.

నాయకులు చెప్పేది విన్నారు తప్పితే ఊరట లేదు..!

ఉపాధ్యాయ సంఘాలు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను మంత్రి ముందు పెట్టాయి. వాటిని పరిగణనలోకి తీసుకోలేదట. ఆ తర్వాత సీఎస్‌ను కలిశారు యూనియన్ల నేతలు. విద్యాశాఖ కార్యదర్శితోనూ భేటీ అయ్యారు. పాఠశాల విద్యాశాఖ అధికారులను కలిసి విన్నవించారు. ఇలా సంఘాల నాయకులు చెప్పేది విన్నారు తప్ప.. ఊ అన్నది లేదు.. ఊఊ అన్నదీ లేదు.

ప్రభుత్వం చేయాలని అనుకున్నదే జరుగుతోందా?

క్షేత్రస్థాయిలో టీచర్ల వేదన ఎలా ఉన్నా.. ఇక్కడ ఉపాధ్యాయ సంఘాల నాయకులే న్యాయం చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదట. ప్రత్యేక మార్గదర్శకాలు లేవు.. సమగ్రమైన బదిలీల నిబంధనలు లేవు. ప్రభుత్వం ఏం చేయాలనుకుందో ఆ ప్రకారం ముందుకెళ్తోంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వెళితే తమ చేతిలో ఏమి లేదని.. జిల్లా కలెక్టర్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలవాలని చెబుతున్నారు. అక్కడికి వెళ్తే.. ఇంకా పైవాళ్ల దగ్గరకు వెళ్లాలని సమాధానం వస్తోందట.

ఉపాధ్యాయ సంఘాలది ప్రేక్షకపాత్రే..!

ఒకప్పుడు టీచర్ల బదిలీలు.. పదోన్నతలు అంటే.. యూనియన్‌ నాయకులకు తీరిక ఉండేది కాదు. విద్యాశాఖ కార్యాలయాలు టీచర్ల సంఘాల ప్రతినిధులతో కిటకిటలాడేవి. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలవైపు చూసే యూనియన్ల నేతలే లేరు. అన్ని సంఘాల నేతలదీ ప్రేక్షకపాత్రే. ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాలకు మధ్య చాలా గ్యాప్‌ వచ్చేసింది. ఆ ప్రభావమే ఇప్పుడు వాటి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయని చెబుతున్నారు. మరి.. ఈ పరిస్థితిలో మార్పు వస్తుందో.. లేక ఆర్టీసీలో కార్మిక సంఘాల మాదిరే ఉపాధ్యాయ సంఘాలు సైతం ప్రాధాన్యం కోల్పోతాయో చూడాలి.

Exit mobile version