30 లక్షలు టార్గెట్. ఆ అంకె వినగానే గుండె గుభేల్ మన్నా.. సవాల్‌గా తీసుకుని టార్గెట్ చేరుకోవాలని అనుకున్నారు నాయకులు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి రివర్స్. చీమ కుట్టినట్టు అయినా లేదట. పార్టీ చేపట్టిన కార్యక్రమానికి ఊ అంటారో.. ఊహూ అంటారో కూడా తెలియని పరిస్థితి ఉందట.
సభ్యత్వం నమోదు కోసమే 30 మందికి శిక్షణ..!
కొత్త నాయకత్వం రాగానే సభలు.. సమావేశాలు అని ఊదరగొట్టిన తెలంగాణ పీసీసీకి 30 లక్షల సభ్యత్వం నమోదును లక్ష్యంగా పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఈ నెల 9న ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు కూడా మొదలైంది. టార్గెట్ రీచై దేశంలోనే ఆదర్శంగా నిలవాలన్నది పీసీసీ కల. లక్ష్యాన్ని చేరుకునేందుకు నియోజకవర్గాల వారీగా టార్గెట్లు పెట్టారు. ఓటర్ల జాబితాలో కనీసం 10 నుంచి 15 శాతం సభ్యత్వం నమోదు చేయాలన్నది పీసీసీ ఆదేశం. ఆన్‌లైన్ సభ్యత్వం కావడంతో పోలింగ్ బూత్ నుంచి ఒక్కరు చొప్పున దాదాపు 30 వేల మందికిపైగా పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. వారికే నమోదు ప్రక్రియలో సిస్టమ్ యాక్సిస్ కల్పించారు. కానీ… అనుకున్నంత వేగంగా సభ్యత్వ నమోదు కావడం లేదన్ని పార్టీ వర్గాల వాదన.
‘గ్రేటర్ హైదరాబాద్’లో నత్తనడకన సభ్యత్వం నమోదు..!
గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కి సరైన బలం లేదు. మెజారిటీ డివిజన్‌లలో పార్టీకి బలమైన నాయకుడు కూడా లేరు. గ్రేటర్‌లో చాలా నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లు కరువు. లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిలో నాయకులు ఉన్నప్పటికీ పెద్దగా లాభం లేదని కాంగ్రెస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. 150 డివిజన్‌లలో సగానిపైగా డివిజన్లలో ఇంతవరకు కాంగ్రెస్ సభ్యత్వం ప్రారంభం కాలేదు. క్షేత్రస్థాయిలో సమీక్ష జరిపే వ్యవస్థ లేకపోవడం పార్టీకి తలనొప్పిగా మారిందట. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ పరిస్థితిపై రేవంత్‌రెడ్డి ఫోకస్ పెట్టిన దాఖలాలే లేవు. దీంతో నగరంలో పార్టీ పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియడం లేదట.
డీసీసీల నుంచి స్పందన నిల్..!
జిల్లాల్లో కూడా అనుకున్నంత వేగంగా కాంగ్రెస్ సభ్యత్వం నమోదు జరగడం లేదట. డీసీసీ అధ్యక్షులు పట్టించుకోవడం లేదని సమాచారం. పీసీసీ స్థాయిలో ఒకరిద్దరు నాయకులు సమీక్ష చేస్తున్నప్పటికీ.. జిల్లా నాయకత్వాలు నుంచి స్పందన నిల్. జనవరి 26 నాటికి సభ్యత్వం నమోదు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. డీసీసీ అధ్యక్షులు.. నియోజకవర్గంల మధ్య సమన్వయం లేదా? లేక పీసీసీ పర్యవేక్షణ కొరవడిందో కానీ సభ్యత్వం నమోదు అంతంత మాత్రంగానే ఉంది. గాంధీభవన్‌లో వరసగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లు.. సీనియర్ ఉపాధ్యక్షులుతో ఏఐసీసీ కార్యదర్శులు సమీక్ష చేస్తున్నారు కానీ.. జిల్లాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారట.
పీసీసీ హెచ్చరికలు పనిచేయడం లేదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో డీసీసీ అధ్యక్షుల కొనసాగింపు.. లేదంటే కొత్తవారిని నియమించడాన్ని పార్టీ సభ్యత్వంతో ముడిపెడుతున్నట్టు పీసీసీ సంకేతాలిచ్చింది. ఈ హెచ్చరికలు కూడా పనిచేయడం లేదట. డీసీసీలు లైట్‌గా తీసుకుంటున్నారో.. ఆన్‌లైన్ సభ్వత్వంతో సమస్యలు ఎదుర్కొంటున్నారో కానీ.. పార్టీలో ఈ అంశంపై చాలా మందికి క్లారిటీ లేకుండా పోయిందని టాక్.
