NTV Telugu Site icon

మూడు అంశాలపై నివేదిక కోరిన గవర్నర్‌

Governor Khammam

Governor Khammam

తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయ్‌. గవర్నర్‌ తమిళిసై.. రాష్ట్ర ప్రభుత్వం మధ్య వచ్చిన గ్యాప్‌తో రెండు వ్యవస్థల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజ్‌భవన్‌పై పదునైన విమర్శలు చేస్తున్నారు మంత్రులు. అయితే రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనలపై గవర్నర్‌ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరడంతో పరిస్థితి వేడెక్కిందని పరిశీలకు భావిస్తున్నారు. రామాయంపేట, ఖమ్మం ఆత్మహత్యలపైనే కాకుండా.. మెడికల్ సీట్ల రగడపైనా నివేదిక కోరారు గవర్నర్‌.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు రావడం లేదన్న వాదన వినిపిస్తున్నాయి రాజ్‌భవన్‌ వర్గాలు. ఇదే అంశంపై గవర్నర్‌ తమిళిసై కూడా స్వయంగా స్పందించారు కూడా. కొద్దికాలంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాజ్‌భవన్‌ సహాయ నిరాకరణ ఎదుర్కొంటుందనే వాదన ఉంది. గతంలో గవర్నర్‌గా పనిచేసిన నరసింహన్‌తో రాష్ట్ర సర్కార్‌కు మంచి సంబంధాలు ఉండేవి. రాష్ట ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు రాజ్‌భవన్‌కు వివిధ అంశాలపై నివేదికలు వెళ్లేవి. రాష్ట్రంలోని పరిస్థితులను బట్టి అప్పటి గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంశాఖకు నివేదికలు పంపేవారన్న చర్చ అప్పట్లో వినిపించేది.

తాజాగా గవర్నర్ తమిళిసై వివిధ సంఘటనలపై నివేదిక కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందన్నది ప్రస్తుతం హట్‌టాపిక్‌గా మారింది. రామయంపేటతోపాటు ఖమ్మం ఘటనలు రెండు కూడా లా అండ్ ఆర్డర్‌కు సంబంధించినవి. ఈ రెండింటిపై రాష్ట్ర సర్కార్ విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. వీటిపై రాజ్‌భవన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపే అవకాశాలపైనా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర సర్కార్ గవర్నర్‌కు నివేదిక పంపే అవకాశాలు లేవన్నది కొందరి వాదన.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రాకపోతే గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా ఉంది. రాష్ట్ర సర్కార్‌ను అడిగినా నివేదిక ఇవ్వలేదు కాబట్టి గవర్నే స్వయంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు తదుపరి చర్యలకు రిపోర్ట్‌ పంపే అవకాశాలు ఉంటాయని చర్చ జరుగుతోంది. మొత్తానికి మరోసారి రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.