TJR సుధాకర్‌బాబు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుంచి YCP MLAగా గెలిచారు. వైసీపీ అధికారంలోకి రావడంతో.. మొదట్లో ఎమ్మెల్యేకు లోకల్ పార్టీ కేడర్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు కనిపించినా.. తర్వాత గ్యాప్ వచ్చేసింది. నియోజకవర్గంలోని నాగులుప్పలపాడు, చీమకుర్తి మండలాల్లో ఈ గ్యాప్ మరీ ఎక్కువగా ఉందట. ఈ అంశాన్ని గుర్తించినా దిద్దుబాటు చర్యలు చేపట్టలేదట సుధాకర్‌బాబు. దాంతో విభేదాలు కోల్డ్‌వార్‌గా మారిపోయినట్టు టాక్. వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆ గొడవలు బయటపడి రచ్చ రచ్చగా మారుతోంది.
నియోజకవర్గంలోని ఇతర మండలాలకు చెందిన నేతలను నాగులుప్పలపాడు మండలంలోని తిమ్మసముద్రంలో ఏర్పాటు చేసిన చేసిన కార్యక్రమానికి పిలిచిన ఎమ్మెల్యే.. స్థాని వైసీపీ నాయకులను ఆహ్వానించలేదట. దీంతో లోకల్ లీడర్స్ అలిగి ఆ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేశారు. ఇది ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. బాయ్‌కాట్ చేసిన వారిలో ఎంపీపీ, జడ్పీటీసీ, వైసీపీ మండలపార్టీ అధ్యక్షుడు, పలువురు ఎంపీటీసులు ఉండటంతో హాట్ టాపిక్‌గా మారింది. స్థానిక నేతలు లేకపోయినా ఎమ్మెల్యే మాత్రం గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహించడం.. సమస్యను తెగేవరకు తీసుకెళ్లేలా ఉందని చెవులు కొరుక్కుంటున్నాయి పార్టీ శ్రేణులు.
మండల పరిషత్ ఆఫీసు ప్రహారీగోడ నిర్మాణానికి జడ్పీ ఛైర్మన్ వెంకాయమ్మతో కలిసి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు. అయితే ఆ గోడ నిర్మాణానికి గ్రామ సర్పంచ్ ఆమోదంతో ఒక తీర్మానం కావాల్సి ఉండగా.. అది ఇవ్వలేదట. ఈ విషయంలో రెండు గ్రూపులు పరస్పరం విమర్శలు.. ఆరోపణలు చేసుకుంటున్నాయి. చివరకు ఆ పనులకు మరోసారి టెండర్లు పిలవక తప్పలేదు. ఇదే కాదు.. ఆ మధ్య ఎంపీడీవో నియామకంపై కూడా స్థానిక నేతలతో భేదాభిప్రాయాలు తలెత్తాయట. దాంతో లోకల్ లీడర్స్ సమస్యను పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. చీమకుర్తికి చెందిన మరో వర్గం కూడా ఎమ్మెల్యేపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిందట.
ద్వితీయశ్రేణి నాయకులతో సంబంధం లేకుండా స్థానికంగా బదిలీలు.. నియామకాలు అన్నీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఏకపక్షంగా చేపడుతున్నట్టు వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పైగా గ్రామ, మండల స్థాయిలో తనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ నేతలపై ఉసిగొల్పేలా మరోవర్గాన్ని ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారట. ప్రస్తుతం ఈ రెండు గ్రూపులు ఘర్షణపడే పరిస్థితి ఉంది. ఈ అంశాలను మరోసారి బాలినేని దృష్టికి తీసుకెళ్లేందుకు చూస్తోందట ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న బాలినేని తిరిగి రాగానే పంచాయితీ పెట్టడానికి చూస్తున్నారట. కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్తానని.. ఏ నియోజకవర్గంలోనైనా వేలు పెడతానని ఇటీవల బాలినేని ప్రకటించారు. మరి.. సంతనూతలపాడు వైసీపీ విషయంలో మాజీ మంత్రి ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి. ఆలోగా ఎమ్మెల్యేకు మరింతగా చుక్కలు చూపించేందుకు రెడీ అవుతున్నారట పార్టీ శ్రేణులు.
