ఇంతే… నేనింతే…. ఎవరేం చెప్పినా నేనింతే…. మారే ప్రశ్నే లేదని ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెప్పేస్తున్నారా? ఒకసారి పక్కన పెట్టి మళ్ళీ పదవి ఇచ్చాక కూడా మార్పు లేకుండా పాత సినిమానే చూపిస్తున్నారా? ఆయన వైఖరితో విసిగిపోయిన కూటమి భాగస్వామ్య పక్షాలు కూడా స్థానిక ఎన్నికల్లో మాదారి మేం చూసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నాయా? ఎక్కడుందా పరిస్థితి? నేను మోనార్క్‌ని అంటున్న ఆ నాయకుడెవరు?
ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కానీ… 2014 నుంచి కాస్త తేడాగా మొదలైన పరిస్థితులు 2019 నాటికి పూర్తిగా మారిపోయాయి. వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి చేతిలో టీడీపీ అభ్యర్థి శంకర్ యాదవ్ భారీ తేడాతో ఓడిపోయారు.ఆ ఘోర పరాజయం తర్వాత ఇక్కడ టీడీపీ పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. బీసీ, రెడ్డి, ముస్లిం సామాజిక వర్గాలు అధికంగా ఉండే తంబళ్ళపల్లెలో బీసీ నేతగా ఎదిగిన శంకర్ యాదవ్.. తన తర్వాత మరో బలమైన బీసీ నాయకుడు రాకుండా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఓటమి తర్వాత ‘బెంగళూరు ముద్దు.. నియోజకవర్గం వద్దు’ అన్నట్టు స్థానికంగా అందుబాటులో లేరని లోకల్ కేడర్ రగిలిపోయింది.
గతంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు నిర్వహించిన సమీక్షల్లోనూ ‘శంకర్ యాదవ్ మాకొద్దు’ అంటూ స్థానిక నేతలు బాహాటంగానే తేల్చిచెప్పారు. కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం అధిష్ఠానం చివరి నిమిషంలో వ్యూహం మార్చింది. శంకర్ యాదవ్‌ను పక్కనపెట్టి జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చింది. కానీ, ఆ ఎన్నికల్లోనూ ఓటమి తప్పలేదు.ఆ తర్వాత జరిగిన పరిణామాలతో జయచంద్రారెడ్డి నకిలీ మద్యం తయారీ కేసులో చిక్కుకోవడం, ఆయన్ని పార్టీ సస్పెండ్ చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో నియోజకవర్గంలో మళ్లీ నాయకత్వ శూన్యత ఏర్పడింది. సరిగ్గా ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకునేందుకు శంకర్ యాదవ్ తెర వెనుక పావులు కదిపారు. “నేను మారిపోయాను.. గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగవు.. అందర్నీ కలుపుకుని పోతానంటూ పార్టీ పెద్దల దగ్గర గట్టిగానే లాబీయింగ్ చేసుకున్నారట.
దాంతో… మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, శంకర్ యాదవ్ ఒక వర్గానికే పరిమితమవుతారని మొత్తుకుంటున్నా వినకుండా అధిష్ఠానం ఆయనకే తిరిగి నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించింది. కొత్తలో అంతా సర్దుకుంటుందని భావించినప్పటికీ..శంకర్ యాదవ్ మళ్లీ పాత పంథానే కొనసాగిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. తాను “ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎలా ఉన్నారో, ఓడిపోయాక ఎలా ప్రవర్తించారో.. ఇప్పుడు మళ్లీ ఇన్చార్జ్ అయ్యాక కూడా అదే సినిమా చూపిస్తున్నారంటూ సొంత నేతలే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
తన పాత కోటరీని మాత్రమే వెంటేసుకుని తిరుగుతూ, పార్టీ కోసం పనిచేసిన సీనియర్లను, ఇతర వర్గాలను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారని తమ్ముళ్లు వాపోతున్నారు. ఆయన వ్యవహారంపై కొందరు పార్టీ పెద్దలకు ఫిర్యాదులు కూడా చేసినట్టు తెలిసింది. శంకర్ తీరు మారకపోతే తంబళ్ళపల్లెలో పార్టీకి పూర్వవైభవం రావడం అసాధ్యమని కుండబద్దలు కొట్టేస్తున్నారు చాలా మంది. సొంత పార్టీలో బాధ అలా ఉంటే.. కూటమి మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ నేతల ఆవేదన మరో స్థాయిలో ఉందంటున్నారు.
ఇన్చార్జ్ తమను కనీసం ఖాతరు చేయడం లేదని వాళ్ళు బాగా కోపంగా ఉన్నారట. శంకర్ ఒక్కసారి కూడా మర్యాదపూర్వకంగానైనా తమతో సమన్వయ సమావేశం నిర్వహించలేదని మిత్రపక్ష నేతలు మండిపడుతున్నారు. అధికారిక కార్యక్రమాల్లో జనసేన, బీజేపీ నాయకులకు కనీస సమాచారం ఇవ్వకుండా, కనీస ప్రోటోకాల్ పాటించకుండా శంకర్ యాదవ్ వర్గం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అంటున్నారు.
ఈ క్రమంలోనే.. జనసైనికులు వేపూరికోట గ్రామ సచివాలయ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కూటమి కుమ్ములాటలను బట్టబయలు చేసింది. తమకు గౌరవం ఇవ్వనప్పుడు, అధికారిక కార్యక్రమాల్లో సైతం అవమానాలు ఎదురవుతున్నప్పుడు తాము శంకర్ తో కలిసి సాగే ప్రసక్తే లేదని జనసేన, బీజేపీ శ్రేణులు తెగేసి చెబుతున్నాయట. తీరు మారకుంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మా దారి మేం చూసుకుంటామన్నది వాళ్ళ వార్నింగ్. దీంతో తంబళ్ళపల్లె కూటమి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

