NTV Telugu Site icon

కుటుంబంలో ఒకరికే టికెట్ అనే ప్రకటనతో కాంగ్రెస్ నేతల్లో టెన్షన్

Ek Niranjan

Ek Niranjan

కాంగ్రెస్‌కు మరోసారి శక్తిని నింపేలా రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో పార్టీ చింతన్‌ శిబిర్‌ మేధోమథనం చాలా అంశాలను టచ్‌ చేసింది. అందులో చర్చకు వచ్చిన వాటిల్లో హాట్‌ టాపిక్‌గా మారింది మాత్రం.. పార్టీ నాయకుల కుటుంబంలో ఒకరికే టికెట్‌. దీనిపై పార్టీ చీఫ్‌ సోనియాగాంధీనే నిర్ణయం ప్రకటించారు. మేడమ్‌ ఆ మాట చెప్పినప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లకు గుబులు పట్టుకుందట. వచ్చే ఎన్నికల్లో తాము పోటీచేయడంతోపాటు మరోచోటు నుంచి వారసులను లేదా కుటుంబ సభ్యులను బరిలో దించేందుకు ప్రణాళికలు వేస్తున్నవారికి బ్రేకులు పడినట్టేనని చర్చ మొదలైంది. ఇదే సమయంలో ఎవరికి ఆశలకు గండి పడబోతున్నాయో అని మరికొందరు ఆరా తీస్తున్నారు.

కుటుంబంలో ఒకటే టికెట్ అనగానే మొదటగా తెలంగాణ కాంగ్రెస్‌లో అందరిచూపు పీసీసీ మాజీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిపైనే ఉంటుంది. గతంలో హుజూర్‌నగర్‌ నుంచి ఉత్తమ్‌.. కోదాడ నుంచి ఉత్తమ్‌ భార్య పద్మావతి పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో దీనిని రిపీట్‌ చేయాలని అనుకుంటున్నారు కూడా. ఇక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి ఇంట్లోనూ ఆయన ఇద్దరు కుమారులూ ఎన్నికల గోదాలోకి దిగేందుకు వర్క్‌ చేసుకుంటున్నారు. జానారెడ్డితోపాటు ఆయన ఇంట్లో ఇంకొకరికి టికెట్‌ ఇవ్వాలనే ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారట. ఒకవేళ జానారెడ్డి పోటీ చేయకపోతే.. ఆయన ఇద్దరు కుమారుల్లో ఒకరకి టికెట్‌ ఇవ్వాల్సి వస్తుంది. కానీ.. జానా కుమారుల్లో జయవీర్‌, రఘువీర్‌రెడ్డిల్లో ఒకరు నాగార్జనసాగర్‌.. ఇంకొకరు మిర్యాలగూడపై కన్నేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మాజీ మంత్రి కొండా సురేఖతోపాటు.. ఆమె భర్త కొండా మురళీ సైతం పోటీ చేయాలని చూస్తున్నారు. తాజాగా తన కుమార్తెకు కూడా టికెట్‌ ఇవ్వాలని పార్టీ ముందు ప్రతిపాదన పెట్టారు సురేఖ.

గ్రేటర్ హైదరాబాద్‌లో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తాను పోటీ చేయడంతోపాటు ఆయన ఇద్దరు కుమారులు అనిల్‌, అరవింద్‌లను కూడా బరిలో దించాలని చూస్తున్నారు. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి సంగారెడ్డిలో తిరిగి పోటీ చేయడంతోపాటు.. తన కుమార్తె జయరెడ్డిని మెదక్‌ ఎంపీగా పోటీ చేయించాలని లెక్కలేస్తున్నారు. ఎమ్మెల్యే సీతక్క కూడా వారసుడి కోసం పినపాకలో కర్చీఫ్‌ వేసే పనిలో ఉన్నారు. మంచిర్యాల జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు భార్య సురేఖను ఎన్నికల్లో పోటీ చేయిస్తారని అనుకుంటున్నారు. ఇక పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య సైతం పెద్ద లెక్కలే వేస్తున్నారట. ఇప్పటికే పొన్నాలతోపాటు ఆయన కోడలు వైశాలి యాక్టివ్‌ పాలిటిక్స్‌లో ఉన్నారు. ఇద్దరూ టికెట్‌ ఆశిస్తున్నట్టు సమాచారం. ఇలా తెలంగాణ కాంగ్రెస్‌లో ఒకే కుటుంబంలో ఇద్దరు..ముగ్గురు పోటీ పడుతున్నారు.

ఉదయపూర్‌లో సోనియా ప్రకటన.. పార్టీలో ఫ్యామిలీ ప్యాక్‌తో ఉన్న నేతలకు మింగుడుపడటం లేదు. పైగా ఐదేళ్లుగా రాజకీయాల్లో ఉంటే టికెట్‌ ఇవ్వొచ్చనే ప్రతిపాదన వచ్చింది. ఆ లెక్కన చూస్తే ఉత్తమ్‌ భార్య పద్మావతి గతంలో ఎమ్మెల్యే. యాక్టివ్‌ పాలిటిక్స్‌లోనే ఉన్నారు. జానారెడ్డి కుమారులు చురుకుగానే రాజకీయాల్లో పనిచేస్తున్నారు. ఆయన 2018లోనే ఒక కుమారుడు రఘువీర్‌రెడ్డిని బరిలో దించాలని విఫలయత్నం చేశారు. ప్రస్తుతం జానారెడ్డికి, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మారిన పరిణామాలతో ఇలాంటి సాన్నిహిత్యాలు ఎంత వరకు మేలు చేస్తాయో తెలియదు.

కాంగ్రెస్‌లో ఇలాంటివి కామన్‌. ఒక ఇంట్లో ఒకే సీటు అంటే కుదరని ఉదంతాలు ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భార్య ఎమ్మెల్సీగా పోటీ చేశారు. మెదక్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మల బరిలో ఉన్నారు. పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. సరైన అభ్యర్థులు దొరకనప్పుడు కొన్ని వెసులుబాటులు తెరపైకి వస్తుంటాయి. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని చూస్తున్న కాంగ్రెస్‌ … వన్‌ ఫ్యామిలీ వన్‌ టికెట్‌ను సీరియస్‌గా తీసుకుంటుందా అన్నది ప్రశ్నే. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.