Site icon NTV Telugu

హుజురాబాద్‌ ఉపఎన్నిక షెడ్యూల్‌ బీజేపీ నేతలకు మిస్టరీగా మారిందా?

హుజురాబాద్‌ ఉపఎన్నిక షెడ్యూల్‌ బీజేపీ నేతలకు ఒక మిస్టరీగా మారిందా? అదిగో వచ్చేస్తుంది.. ఇదిగో వచ్చేస్తుంది అని ఎదురు చూడటమే సరిపోతోందా? ఆశ.. నిరాశల మధ్య కమలనాథులు కాలం వెళ్లదీస్తున్నారా? బీజేపీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి?

ఉపఎన్నిక ఎప్పుడో క్లారిటీ లేదు..!

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో ఖాళీ అయిన హజురాబాద్‌లో.. ఉపఎన్నిక షెడ్యూల్‌ పార్టీలను ఊరిస్తోంది తప్ప.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన మాత్రం రావడం లేదు. టీఆర్ఎస్‌, బీజేపీలు అక్కడే మోహరించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. కొత్త పథకాలు పుట్టుకొస్తున్నాయి.. డబ్బులు నీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తున్నారు. ఉపఎన్నిక ఎప్పుడో మాత్రం క్లారిటీ లేదు.

బీజేపీ నేతలు ఆశించిదొక్కటి.. అయ్యిందొక్కటి..!

ఈటల బీజేపీలో చేరుతున్న సమయంలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. ఉపఎన్నికను వీలైనంత త్వరగా నిర్వహించేలా చూస్తామని ఢిల్లీ పార్టీ పెద్దలు హామీ ఇచ్చారట. అప్పటి నుంచి అదిగో షెడ్యూల్‌.. ఇదిగో షెడ్యూల్‌ వచ్చేస్తోందని ప్రచారం జరిగింది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ అసెంబ్లీకి ఎన్నిక కాకుండా ఉండేందుకు ఇక్కడ ఉపఎన్నిక ఆలస్యం చేస్తారని అనుకున్నారు. కానీ.. ఆ అంచనాలు తప్పయ్యాయి. పశ్చిమబెంగాల్‌లో ఉపఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం.. హుజురాబాద్‌ను పక్కన పెట్టేసింది. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు ఆశించిందొక్కటి.. అయ్యిందొక్కటి.

ఢిల్లీ పెద్దలతో మాట్లాడాక మళ్లీ ఆశ..!

ప్రస్తుతం బీజేపీ నేతలను ఎవరిని కదిపినా.. అదేంటి అలా జరిగిందని ప్రశ్నించినా.. నోటి మాట రావడం లేదు. వారి దగ్గర ఎలాంటి సమాధానం కూడా లేదట. ప్రైవేట్‌ సంభాషణల్లో మాత్రం ఇలా ఎందుకయ్యిందబ్బా అని చర్చించుకుంటున్నారట. కొందరైతే తమకున్న పరిచయాల ద్వారా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈ మధ్య రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ పెద్దలతో మాట్లాడారట. ఆ తర్వాత ఉపఎన్నిక షెడ్యూల్‌పై మళ్లీ ఆశలు చిగురించినట్టు టాక్‌.

సెప్టెంబర్‌ 17కు ముందే షెడ్యూల్‌ వచ్చేస్తుందని ఆశించారట!

జోగిపేటలో ఇటీవల బీజేపీ పదాధికారులు, ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఆ భేటీలో హుజురాబాద్‌ ఉపఎన్నికపై చర్చించారు. ఉపఎన్నిక షెడ్యూల్‌ వచ్చేస్తుందని చెప్పారట ఆ సమావేశంలో మాట్లాడిన బీజేపీ నేతలు. వారి మాటల ప్రకారం సెప్టెంబర్‌ 17కు ముందే ఆ షెడ్యూల్‌ ఏదో వచ్చేయాలి. అదే జరిగితే నిర్మల్‌లో నిర్వహించిన అమిత్‌ షా బహిరంగ సభను హుజురాబాద్‌లో పెట్టాలని అనుకున్నారట. అంతేకాదు సంజయ్‌ సంగ్రామ యాత్రకు బ్రేక్‌ వేసి.. యాత్రలో ఉన్న నాయకులంతా హుజురాబాద్‌కు మకాం మార్చుకోవాలని డిసైడ్‌ అయ్యారట.

శనివారాలు.. మంగళవారాలు వెళ్లిపోతున్నాయి..!

సెప్టెంబర్‌ 17 వెళ్లిపోయింది. నిర్మల్‌లో అమిత్‌ షా సభ కూడా జరిగిపోయింది. సంజయ్‌ సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. హుజురాబాద్‌ ఉపఎన్నిక షెడ్యూల్‌ మాత్రం రాలేదు. చివరగా కిందటి శనివారం షెడ్యూల్‌ వచ్చేస్తుందని అనుకున్నారట. అది మిస్‌ అయితే మంగళవారం కన్ఫామ్‌ అని భావించారట. ఇప్పుడు శనివారం పోయింది.. మంగళవారం వెళ్లిపోయింది. హుజురాబాద్‌ ఉపఎన్నిక షెడ్యూల్‌ ఎక్కడంటే అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు దసరా ముందు ఎన్నిక జరిగే అవకాశాల్లేవ్. రోజులు లెక్కపెట్టుకోవడమే తప్ప ఊరట లేదు. దీంతో ఆశ.. నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారట కమలనాథుల. మరి.. వారిని సంతోష పరిచే మాట ఎప్పుడొస్తుందో ఏమో?

Exit mobile version