OTR : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో తెలంగాణ బీజేపీ సీరియస్‌గా లేదా? అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను తాత్కాలికంగా అటకెక్కించేశారా? ఆ విషయంలో మిగతా పక్షాలు దూకుడుగా ఉంటే… కమలం పార్టీ మాత్రం ఎందుకు కాలయాపన చేస్తోంది? అసలెక్కడ తేడా కొడుతోంది? ముందున్న హడావిడి సడన్‌గా మాయమైపోవడానికి కారణాలేంటి? తెలంగాణలో వచ్చే మార్చిలో జరగబోతున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మొదట్లో బీజేపీ నాయకులు బాగా హడావిడి చేశారు. అందరికంటే ముందున్నామని, త్వరలోనే అభ్యర్థుల్ని అనౌన్స్ చేస్తామని కూడా ఆ పార్టీ పెద్దలు ప్రకటించారు. అందుకు ముహూర్తాలు కూడా చెప్పేశారు. దసరా పోయింది, దీపావళి వచ్చి వెళ్ళిందిగానీ… అభ్యర్థుల ఎంపిక మాత్రం జరగలేదు. దీంతో… అనౌన్స్‌మెంట్‌ని అటకెక్కించారేమోనన్న సందేహాలు పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతున్నాయట. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై నాయకత్వం తాత్సారం చేస్తోందన్న అభిప్రాయం కాషాయ కేడర్‌లో బలపడుతోంది. అదే సమయంలో మా వాళ్లు లేటుగానైనా… లేటెస్ట్గా ప్రకటిస్తారన్న మాటలు సైతం ఒక వర్గం నుంచి వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో మొదట్లో బాగా హడావిడి చేయడంవల్లే….ఇప్పుడు లేటవుతోందన్న ఫీలింగ్ పెరుగుతోందన్నది కొందరు నేతల విశ్లేషణ. మరోవైపు అభిప్రాయ సేకరణ కోసం కమిటీలు వేసింది రాష్ట్ర పార్టీ.ఆ కమిటీలు అభిప్రాయ సేకరణ జరిపాయి కూడా. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి రిపోర్ట్లు ఇచ్చేశాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పేరుతో ముఖ్యనేతల సమావేశం జరిగింది. క్యాండిడేట్స్ విషయంలో నేతలు తమ తమ అభిప్రాయాలు చెప్పారు కూడా.
అదే ఊపుతో మన అభ్యర్థుల ప్రకటన అందరికంటే ముందే ఉంటుందని కూడా చెప్పారు అగ్ర నాయకులు. ప్రాబబుల్స్ లిస్ట్‌ని ఢిల్లీ పంపారని ఒకానొక దశలో ప్రచారం జరిగింది. కానీ… మేటర్ అక్కడే ఆగిపోయింది. అడుగు ముందుకు పడలేదు. దసరా పోయింది, దీపావళి పోయింది… ఓటర్ల నమోదుకు సంబంధించిన ఒక ఘట్టం ముగిసింది. కానీ…బీజేపీ అభ్యర్థుల ప్రకటన విషయంలో మాత్రం అతీగతీ లేదు. దీంతో… మా పార్టీ అభ్యర్థుల ప్రకటనను అటకెక్కించిందేమోనంటూ బీజేపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అసలు వీళ్ళకేమైంది..? ఎందుకిలా జరుగుతోంది? మొదట హడివిడి చేసి సడన్‌గా ఎందుకు వెనక్కి తగ్గారంటే… వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల స్థానం అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదన్నది ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. అక్కడ పార్టీ టికెట్ అడుగుతున్న లోకల్ లీడర్స్ బలవంతులు అవకపోవడం, అలాగని బయట నుండి ఇంపోర్ట్ చేయాలంటే స్థానికంగా అభ్యంతరాలు పెరగడం లాంటి కారణాలతో ఎంపిక ప్రక్రియ స్లో అయిందంటున్నారు.
పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజీగా ఉండడం కూడా ఒక కారణమన్న మాట వినిపిస్తోంది. డ్రాఫ్ట్ లిస్ట్ ప్రకటించే లోపు అయినా… అభ్యర్థుల ఎంపిక పూర్తి అయితే…. ఓటర్ జాబితా వచ్చాక వారిని కలిసే అవకాశం ఉంటుందని, ముందే వెళ్ళి కలిస్తే… ఓటర్ మీద ఆ ప్రభావం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది కాషాయ వర్గాల్లో. రెండు ఎమ్మెల్సీ సీట్లు గెలవాలని పార్టీ నాయకత్వం గట్టిగా అనుకుంటే మాత్రం…. అభ్యర్థులను ముందే ప్రకటించి హడావుడి చేయాలని, లేదు మేం స్లోగా ఉంటామంటే మాత్రం రిజల్ట్ కూడా అలాగే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. బంటీ నీ సోపు స్లోనా ఏంచి అన్న టీవీ యాడ్‌ను గుర్తు చేసుకుంటూ సొంత పార్టీ మీదే సెటైర్స్ వేస్తున్నాయి బీజేపీ శ్రేణులు.

