తెలంగాణముఖ్యమంత్రి టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రకటన కన్నా బాగా ముందే సర్వతోముఖ వ్యూహాలకు పదును పెడుతున్న తీరు ప్రత్యర్థులను తికమకపెట్టే స్థాయిలో నడుస్తోంది.ఒకటి రెండు ఎదురుడెబ్బలు, కరోనా కారణంగా ఒకింత విరామం తీసుకున్న ఆయన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నాటినుంచే జోరు పెంచారు. ఈటెల రాజేందర్ ఉద్వాసన ఆ వెంటనే ఎదురు దాడితో దాన్ని ఉధృతంచేశారు. బిజెపి రాష్ట్ర అద్యక్షుడు బండిసంజయ్, ఆయనతో చేరిన ఈటెల రాజేందర్‌లకు తోడు పిసిసి అద్యక్షుడుగా వచ్చిన రేవంత్‌రెడ్డి కూడా దూకుడు రాజకీయాలకు మారుపేరని కెసిఆర్ కెటిఆర్‌లకు తక్కిన నేతలకూ తెలుసు. అందుకే వారు కదలిక ప్రారంభించేలోగా ప్రభుత్వ పథకలతో ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకున్నారు.ప్రభుత్వాధికారం, రాష్ట్రంపై పట్టు వున్న ప్రధాన పార్టీ అయినా సరే దేన్నీ వదలిపెట్టకూడదని కెసిఆర్ నిర్ణయించుకున్నారు. హుజూరాబాద్ టిఆర్‌ఎస్‌పై ఈటెల ప్రభావాన్ని లేకుండా చేయడంతో పాటు ఇతర పార్టీల నుంచి కూడా గట్టి నాయకులను రాబట్టుకోవడంపై కేంద్రీకరించారు.
అయితే ఇది ఒక ఉప ఎన్నిక కోసమేనన్నట్టు గాక రాష్ట్ర వ్యాపిత విధాన ప్రక్రియగా వుండాలి. హుజూరాబాద్ విజయం ఎలాగూ కీలకమే గనక దాన్ని తర్వాత రాష్ట్ర ఎన్నికల వరకూ వూపు కాపాడుకోవాలి. ఇందుకు గాను వివిధ సామాజిక తరగతులను మరింత బలంగా ఆకట్టుకోవలి. ఇది ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన. ప్రగతిభవన్‌లో అఖిలపక్షం జరిపి మరీ దళితలకోసం పథకం ప్రకటించడం ఇందులో మొదటి అడుగు. దళిత కుటుంబాల సాధికారిత, సంపద పెంచడం అన్న ఆయన పథకాన్ని ఎవరైనా ఎలా వ్యతిరేకిస్తారు? కుటుంబానికి పదిలక్షల చొప్పున ఇవ్వాలని ఇందుకు అవసరమైతే లక్ష కోట్టయినా వెచ్చిస్తామని ఆయన చెప్పారు. ఇది సక్రమంగా అమలయ్యేందుకు వామపక్షాలు బాధ్యత తీసుకోవాలని కూడా అన్నారు. దళితబందుగా నామకరణం చేసిన ఈ పథకాన్ని హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని నిర్ణయించినా రాజకీయ విమర్శలు తప్ప రాజ్యాంగ పరంగా అడ్డుకోగల అవకాశం లేకుండా పోయింది. ఆ నియోజకవర్గంలోనే గాక రాష్ట్రమంతటా అమలు చేయాలని రేవంత్ రెడ్డి వంటివారు కోరవలసి వచ్చింది. దళిత బందుకు తోడు రైతులకు యాభైవేల రుణమాఫీ, అనాథ పిల్లలకు ఆశ్రమాలపై కమిటీ, పెన్షన్ వయస్సు తగ్గింపు వంటి నిర్ణయాలు కూడా ప్రకటించారు.
హుజూర్‌బాద్ ఎంఎల్‌ఎగా రాజేందర్ రాజీనామా వల్ల ఉప ఎన్నిక రావడంతో ఇన్నివరాలు కురుస్తున్నాయి గనక నేను కూడా రాజీనామా చేస్తానని బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ చెప్పడం రాజకీయ ప్రహసనంగా మారింది. ఒకరిద్దరు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను కూడా స్థానిక ప్రజలు రాజీనామా చేయమని వెంటపడ్డారని వార్తాకథనాలు వచ్చాయి. వినడానికి విడ్డూరంగా వున్నా కెసిఆర్ వ్యూహం ప్రభావం ఏమిటో దీంతో అర్థమవుతుంది.అయితే ఆ ఆభిప్రాయం పోగొట్టడానికే ఆయన గతంలో తాము విజయం సాధించిన నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో సమీక్ష సభ పెట్టి స్థానిక సమస్యలకు పరిష్కారాలు ప్రకటించి వచ్చారు. ఆ తర్వాత కూడా పూర్వపు నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఉభయతారకంగా ఈ పర్యటనలు ప్రజలకు దగ్గర కావడానికి ప్రతిపక్షాల విమర్శలకు అవకాశం లేకుండా చేయడానికి అక్కరకు వచ్చాయి.ఈ పర్యటనల సమయంలో జిల్లాలోని ప్రతిపక్ష నాయకులనుంచి సమస్యలపై వినతిపత్రాలు తీసుకుని స్పందించి న వాతావరణం కల్పించారు.ఇదే వూపులో ఎపిపైన కూడా వ్యూహాత్మకంగానే తీవ్రభాష వాడారు.
బండిసంజయ్ దూకుడువల్ల బిజెపిలోకి ప్రముఖ నేతలు చేరి టిఆర్‌ఎస్‌కు సవాలుగా మారతారనే వూహాగానాలు మొదట నడవగా వాటిని పూర్తిగా పూర్వపక్షం చేస్తూ అటునుంచి వలసలు పెరిగాయి. మోత్కుపల్లి నరసింహులు, ఇనగాల పెదిరెడ్డి తమ తమ అనుచరులతో సహా టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. వచ్చేముందు బిజెపిపై విమర్శలు కూడా కురిపించారు. ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో ఘర్‌వాపసీ చేయిస్తారనుకుంటే కౌశిక్‌రెడ్డి ని చేర్చుకుని ఎంఎల్‌సిగా సిఫార్సు చేశారు. టిడిపి రాష్ట్ర అద్యక్షుడు ఎల్‌రమణనూ చేర్చుకున్నారు. వీరిలో చాలామంది గతంలో మంత్రులుగా పనిచేసిన సీనియర్లున్నారు.ఈటెల రాజేందర్ తొలగింపుతో టిఆర్‌ఎస్‌లో ఏదో తిరుగుబాటు వస్తుందన్నట్టు జరిగిన ప్రచారానికి దీనికి పొలిక లేకుండా పోయింది. బిజెపి జాతీయ వ్యూహాల వల్ల ఉప ఎన్నికలు ఆలస్యం కావచ్చనే అంచనాల మధ్య హుజూరాబాద్ ఉప ఎన్నిక మరీ ఆలస్యమైతే అప్పటి వరకూ పట్టునిలుపుకోవడం కూడా బిజెపికి పెద్ద సవాలుగా మారుతున్న స్థితి. దీనికి తోడు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికీ బండి సంజయ్‌కీ యాత్రల పోటీ కూడా వచ్చిపడి తికమక సృష్టించింది. రాజేందర్‌కు అస్వస్తతతో ఆయన యాత్ర కూడా వాయిదా పడిరది. ఇప్పుడు ఆయన భార్యజమున పూర్తిచేస్తారంటున్నారు గాని అది మరో పరిస్థితికి దారితీస్తుంది. కాంగ్రెస్ అయితే ఇది మాకు పెద్ద ముఖ్యం కాదనిముందే ప్రకటించింది.బిజెపితో టిఆర్‌ఎస్ లోపాయికారి అవగాహన కలిగివున్నదని రేవంత్ రెడ్డి అంటున్నా రాష్ట్రం వరకూ ప్రజలు అలా అనుకోవడం కష్టం. ఏతావాతా తన ఎత్తులు పై ఎత్తులతో కెసిఆర్ హుజూరాబాద్ పోటీని రాష్ట్రంలో అనుకూల వాతావరణం వైపు మలుచుకున్నట్టు కనిపిస్తుంది. ఆయనను లేదా ఆ పార్టీని ఎంతైనాదూషించేవారు వుండొచ్చు గాని వాటిని బట్టి రాజకీయాలు నడవవు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ తప్పిదాలు ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు నిజమే అయినా రెండు ప్రధానపార్టీలు వాటికవి వ్యక్తిగత దూషణలు మత రాజకీయాలపై కేంద్రీకరించడం ఆయనకు కలసివస్తున్నది.
