అనంతపురం టీడీపీలో టీజింగ్ రాజకీయం కొనసాగుతోంది. పార్టీ సీనియర్లపై వాళ్లముందే సెటైర్లు వేసిన JC ప్రభాకర్‌రెడ్డి… ఇప్పుడు ఏకంగా నియోజకవర్గ పర్యటనలు మొదలుపెట్టారు. ఈ నియోజకవర్గాలన్నీ JCని వ్యతిరేకించే నేతలవి కావడంతో… పార్టీలో ఇది ఇంకేం సమస్యకు కారణం అవుతుందోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పార్టీకి మీరే నష్టమని అనంత టీడీపీ నేతలపై జేసీ ఫైర్..!
కార్యకర్తలను నాయకులను పట్టించుకోవడం లేదు. వైసీపీ నేతలతో కొంతమంది మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు అంటూ అనంతపురం టీడీపీ నేతల సమావేశంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ జిల్లా పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. ప్రభాకర్‌రెడ్డి మీద జిల్లా నేతలంతా విరుచుకుపడ్డారు. మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరిలు జేసీ ప్రభాకర్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కార్యకర్తలను తాము పట్టించుకోకపోవడం కాదు.. పార్టీకి మీరే నష్టం అంటూ ఎదురుదాడి చేశారు. కాల్వ శ్రీనివాసులు అయితే పార్లమెంటరీ పార్టీ పదవికి రాజీనామాకు సిద్ధపడ్డారు కూడా. జేసీ తీరుపై హైకమాండ్‌కు కంప్లయింట్ చేశారు.
పుట్టపర్తిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి పర్యటన..!
హైకమాండ్ మాత్రం ఏం స్పందించలేదు. ఇలా పార్టీ రెండుగా చీలిపోయింది అనంతలో. అది సద్దుమణిగింది అనుకుంటుండగానే.. ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అదీ.. తనను వ్యతిరేకించే నేతల నియోజకవర్గాల్లో పరామర్శ యాత్ర చేపట్టడం ప్రస్తుతం హాట్ టాపిక్. పార్టీని కాపాడుకుందాం… బాబును సీఎం చేద్దాం అనే నినాదంతో మొదలుపెట్టిన ఈ యాత్ర రాజకీయవర్గాలలో చర్చగా మారింది. ఇప్పటికే జిల్లా కేంద్రం అనంతపురంలో కార్యకర్తలను కలుస్తున్న ఆయన తాజాగా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నియోజకవర్గమైన పుట్టపర్తి వెళ్లారు.
జేసీని రావొద్దని వాట్సాప్‌లో లేఖ చక్కర్లు..!
జేసీ పుట్టపర్తి వస్తున్నారని తెలిసిందో ఏమో.. ఆయన కాలు పెట్టకముందే టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ల పేరుతో ఓ లేఖ వాట్సాప్‌లో చక్కర్లు కొట్టింది. 25 ఏళ్లుగా ఒకే పార్టీలో ఉంటూ.. పుట్టపర్తి అభివృద్ధికి పల్లె రఘునాథరెడ్డి కృషి చేశారని.. తమ గౌరవాన్ని కాపాడుతున్నారని ఆ లేఖలో ప్రస్తావించారు. తమ నియోజకవర్గానికి రావొద్దని కోరారు. అయినప్పటికీ ప్రభాకర్‌రెడ్డి పట్టించుకోలేదు. నేరుగా పుట్టపర్తి వెళ్లిపోయారు.
రావొద్దంటే పుట్టపర్తిలో మరో టీడీపీ ఆఫీస్ ఏర్పాటు చేస్తానని జేసీ వార్నింగ్..!
పుట్టపర్తి వెళ్లి జేసీ.. పలువురు టీడీపీ స్థానిక నాయకులతో కలిసి కొంతమంది కార్యకర్తల ఇంటికి వెళ్లి వారితో సమావేశం అయ్యారు. పార్టీలో నాకు ఎవరు శత్రువులు లేరని కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకే పుట్టపర్తి వచ్చానని చెప్పుకొన్నారు జేసీ. తాను రాకూడదు.. రావొద్దని ఎవరైనా అంటే.. పుట్టపర్తిలో మరో టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు. అదే క్రమంలో తన నియోజవర్గంలో ఎవరు పర్యటించినా స్వాగిస్తానని స్పష్టం చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి పర్యటనలపై నేతలు ఎవరూ ఇప్పటి వరకు బహిరంగంగా స్పందించలేదు. హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్టు కూడా సమాచారం లేదు. కాకపోతే జేసీ పర్యటనలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోననే చర్చ రాజకీయవర్గాల్లో ఉంది.
