Site icon NTV Telugu

చంద్రబాబుకు వచ్చింది కోపమేనా..?

చంద్రబాబుకు వచ్చింది కోపమేనా..? టీడీపీని చక్కదిద్దుకునేందుకు చికిత్స మొదలుపెట్టిన ఆయనకు.. వాస్తవాలు తెలుస్తున్నకొద్దీ కోపం నషాళానికి ఎక్కుతోందా? కొందరు కోవర్టులుగా మారారనే అనుమానం రోజు రోజుకూ బలపడుతోందా? చేతలు కాలక ఆకులు పట్టుకున్న బాబు.. ఆగ్రహాన్ని కంటిన్యూ చేస్తారా..? మధ్యలోనే మెత్తబడతారా..?

పార్టీ చీఫ్‌కు వచ్చిన కోపంపై తమ్ముళ్లలో చర్చ..!

టీడీపీలో కోవర్టులున్నారని స్వయంగా చంద్రబాబే ప్రకటించారు. మండలం.. నియోజకవర్గం.. జిల్లా స్థాయిల్లో కాదని.. ఏకంగా రాష్ట్రస్థాయిలోనే కోవర్టులు ఉన్నారని.. వారిని ఏరిపారేస్తానని కుప్పం సమీక్షలో చెప్పారు చంద్రబాబు. టీడీపీ ప్రక్షాళన సైతం కుప్పం నుంచే మొదలుపెడతానని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత జరిగిన నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సమీక్షలో ఉగ్రరూపమే ప్రదర్శించారు టీడీపీ అధినేత. ఒక్క డివిజన్‌ను కూడా గెలవలేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార వైసీపీకి సహకరించారనే ఆరోపణలపై ఇద్దరు స్థానిక నేతలను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు చంద్రబాబు. పార్టీ చీఫ్‌కు వచ్చిన ఈ కోపమే ఇప్పుడు తమ్ముళ్లలో చర్చగా మారింది.

అధికారపార్టీతో సన్నిహితంగా ఉన్నవారిపై బాబు ఫోకస్‌..!

కుప్పంలో ప్రక్షాళన ప్రారంభిస్తానని చంద్రబాబు చెప్పినా.. ఆయన నెల్లూరు నుంచే ఆ పని మొదలుపెట్టారని చెప్పాలి. ప్రస్తుతం బాబు యాక్షన్‌ పార్ట్‌ చూస్తుంటే నియోజకవర్గ, డివిజన్‌ స్థాయిల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని.. వెన్నుపోటు పొడిచిన వాళ్లనూ గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్టే కనిపిస్తోంది. అయితే నియోజకవర్గంతోపాటు రాష్ట్రస్థాయిలో కోవర్టులుగా మారిన నేతలను గుర్తించారా.. లేదా? అనే చర్చ జరుగుతోంది. కొందరు పార్టీ నేతల తీరుపై అధినేత దగ్గర పక్కాగా సమాచారం ఉందట. బాబు ఫోకస్‌లో ఉన్న నాయకులు.. అధికారపార్టీ పెద్దలతో సన్నిహితంగా ఉండటమో.. ఇక్కడి సమాచారాన్ని అక్కడికి చేరవేస్తుండటమో చేస్తున్నారట. ఈ లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్న నాయకులపై ఒక అవగాహనకు వచ్చారట చంద్రబాబు.

చంద్రబాబు ఇదే స్పీడ్‌ కొనసాగిస్తారా? ఇక్కడితో ఆపేస్తారా?

చంద్రబాబు దగ్గరున్న కోవర్టుల జాబితాలో కొందరు ముఖ్యనేతలు మొదలుకొని.. పార్టీ బ్యాక్‌ ఆఫీస్‌లో పనిచేసేవాళ్లు… రోజువారీ ప్రెస్‌మీట్స్‌ పెట్టేవాళ్లుకూడా ఉన్నట్టు సమాచారం. ప్రక్షాళనకు చంద్రబాబు చూపిస్తున్న ఈ స్పీడ్‌ కొనసాగుతుందా? లేక ఇక్కడితో ఆగిపోతుందా? అనే చర్చ పార్టీలో ఉంది. ఏదైనా వ్యవహారంలో చాలా స్పీడ్‌గా వెళ్లడం.. తర్వాత చప్పున చల్లారిపోవడం పార్టీ అధినేతకు.. పెద్దలకు రొటీన్‌ అనే చర్చ ఉంది. కోవర్టులపై సీరియస్‌గా ఫోకస్‌ పెడితేతప్ప.. పార్టీ గాడిలో పడదన్నది తమ్ముళ్ల వాదన. ప్రస్తుతానికి చంద్రబాబు అడుగులు కరెక్ట్‌గానే పడుతున్నాయని.. ఇదే ఒరవడి కొనసాగితే బాగుంటుందన్నది మరికొందరు నేతల ఆశ. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version