ఏపీ రాజకీయాల్లో కుప్పంపై మరోసారి రచ్చేనా? కుప్పం మున్సిపల్ ఎన్నికలను సెమీఫైనల్‌గా భావిస్తోంది ఎవరు? ఇప్పుడు మిస్ అయితే అంతే సంగతులు అని ఎవరు భయపడుతున్నారు? కుప్పం కోటలో వైసీపీ, టీడీపీ యాక్షన్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్..!
కుప్పం మున్సిపాలిటీలో పెరిగిన రాజకీయ కదలికలు..!
టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పం రాజకీయంగా మళ్లీ వేడెక్కింది. రాష్ట్రంలో పెండింగ్‌లో పడిన మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టడంతో కుప్పంలో పొలిటికల్ కదలికలు పెరిగాయి. వైసీపీ నేతలు ఎంపీ మిధున్‌రెడ్డితో సమావేశం కాగా.. టీడీపీ నాయకులు ఓ వ్యవసాయ క్షేత్రంలో చంద్రబాబు పీఏ మనోహర్, మునిరత్నంలతో భేటీ అయ్యారట. చంద్రబాబు త్వరలో కుప్పం రానుండటంతో మున్సిపల్ ఎన్నికలను తమ్ముళ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట.
అడ్డంకులు తొలగడంతో కుప్పం మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్..!
మేజర్ పంచాయతీగా ఉన్న కుప్పంను ఇటీవల 25 వార్డులతో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. అయితే పన్నుల భారం భరించలేమని మున్సిపాలిటీలో కలిసిన గుట్టపల్లి, లక్ష్మీపురం, దళవాయి కొత్తపల్లి గ్రామాల రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో అన్ని మున్సిపాలిటీలతో కలిపి ఎన్నికలు జరగలేదు. ఇక్కడ వైసీపీ నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసేవారు.. ఛైర్‌పర్సన్ అభ్యర్థి ముందుగానే ఖరారు కావడంతో వారంతా రెండు నెలలుగా ప్రచారంలో ఉన్నారు. హైకోర్టులో కేసు.. ఇతర అడ్డంకులు తొలగిపోవడంతో ఎన్నికలకు ఈ నెలాఖరునో లేదా వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుందని చెబుతున్నారు.
చంద్రబాబు కుప్పం పర్యటనలో కేడర్‌కు దిశానిర్దేశం?
కుప్పంలో చంద్రబాబు పీఠాన్ని కదపాలన్న లక్ష్యంతో వైసీపీ చాలా ఫోకస్ పెట్టింది. పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో పైచెయ్యి సాధించింది కూడా. ఇప్పుడు కీలకమైన కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు కావడంతో రణతంత్రం అందుకు తగ్గట్టుగానే రచిస్తోందట. ఇక కుప్పం పురపాలక సంఘంలో గెలవడం వ్యక్తిగతంగానే కాకుండా పార్టీ పరంగాను చంద్రబాబుకు అత్యవసరం. అయితే టీడీపీ వ్యూహం ఏంటన్నది కేడర్‌కు కూడా తెలియని పరిస్థితి. టీడీపీ అధినేత కూడా వస్తుండటంతో ఆయన కీలక సూచనలు చేస్తారని అనుకుంటున్నారట.
కుప్పం మున్సిపాలిటీ బరిలో టీడీపీ ఉంటుందా?
పరిషత్ ఎన్నికల మాదిరే కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలను బహిష్కరించకుండా పోటీ చేద్దామని తమ్ముళ్లు కోరుతున్నారట. ఒకవేళ బాబును ఒప్పిస్తే.. అధికారపార్టీ బలం, ఎత్తుగడల ముందు కుప్పం తెలుగు తమ్ముళ్లు నిలబడగలరా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే రెండు పార్టీల శ్రేణులు వార్డుల్లో మోహరించి ఎత్తుకు పైఎత్తులు వేసే పనిలో ఉన్నాయి. మరి.. రానున్న రోజుల్లో కుప్పం రాజకీయం ఎలా మారుతుందో చూడాలి.
