మంత్రి అంటే అభిమానులు.. అనుచరులు కామన్. కొందరు మంత్రి చెప్పిన పనిచేస్తే.. ఇంకొందరు తమ అభిమాన నేతపై ఈగ వాలితే సహించలేరు. ప్రస్తుతం ఆ మినిస్టర్ విషయంలో అదే జరుగుతోందట. అభిమానం తలనొప్పులు తెచ్చిపెడుతోందని టాక్. తాజా ఎపిసోడ్‌లో విపక్షాలకు టార్గెట్‌గా మారి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఆ అమాత్యులవారు.
సుబ్బారావు గుప్తాపై దాడి ఘటనతో రచ్చ రచ్చ..!
బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. ఏపీ మంత్రి. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆయన చుట్టూనే విమర్శలు.. ప్రతివిమర్శలు నడుస్తున్నాయి. గతంలోనూ ఆయన మంత్రిగా ఉన్నా.. ఈ దఫా మాత్రం వరస వివాదాలలో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా అభిమానులు.. అనుచరులు చేస్తున్న పనులకు అదేపనిగా వివరణలు ఇచ్చుకోక తప్పడం లేదని పార్టీ వర్గాల టాక్. తాజాగా ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఎపిసోడ్ రచ్చ రచ్చ అవుతోంది.
గుంటూరు లాడ్జీలో ఉన్న సుబ్బారావుగుప్తాపై వైసీపీ నేత సుభాని దాడి..!
బాలినేని పుట్టినరోజు సందర్భంగా సుబ్బారావు గుప్తా చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఏపీలో కొందరు మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీకి నష్టం కలిగించేలా ఉన్నాయని.. నియోజకవర్గ పరిస్థితిని బాలినేని సీరియస్‌గా తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవన్న సుబ్బారావు వ్యాఖ్యలు దుమారం రేపాయి. సుబ్బారావు తమ పార్టీ కార్యకర్తే అయినా ఆయన ఇంటిపై దాడి చేసి కుటుంబసభ్యులను భయపెట్టారు. వైసీపీ మైనారిటీ నేత సుభాని మరో అడుగు ముందుకేసి.. దాడులకు భయపడి గుంటూరు లాడ్జీలో తలదాచుకున్న సుబ్బారావు గుప్తాపై దాడి చేశారు. మంత్రి బాలినేనికి క్షమాపణ చెప్పాలని సుబ్బారావును మోకాళ్లపై కూర్చోబెట్టిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.
సుబ్బారావును విజయవాడకు పిలిపించుకుని మాట్లాడిన మంత్రి?
అభిమానులు సుబ్బారావు గుప్తాపై దాడి చేస్తారని తెలిసి హెచ్చరించినప్పటికీ.. వాళ్లను మంత్రి బాలినేని ఆపలేకపోయారనే విమర్శలు వినిపించాయి. ఇప్పటికే సుబ్బారావుపై జరిగిన దాడిపై ఆర్యవైశ్య సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ప్రతిపక్షపార్టీలు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఇప్పుడీ సమస్య రాష్ట్రంలోనే హాట్ టాపిక్. సమస్య తీవ్రతను గమనించిన మంత్రి బాలినేని.. దాడి చేసినవాళ్లపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారట. ఆ తర్వాతే పోలీసులు సుబ్బారావు ఇంటికెళ్లి స్టేషన్‌కు తీసుకొచ్చి ఆయనతో కేసు పెట్టించారట. అక్కడితో ఆగకుండా సుబ్బారావును తన అనుచరులతో విజయవాడలోని తన నివాసానికి పిలిపించుకుని కుటుంసభ్యులతో మాట్లాడారట. ఇంత చేసినా.. మంత్రి బాలినేనికి ఇప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయిందని పార్టీ వర్గాలు వాపోతున్నాయట.
గతంలో వ్యక్తిగత సహాయకుడి ఫోర్జరీ రగడతో దుమారం..!
రూ. 6 కోట్ల నగదు బాలినేని హవాలా సొమ్ముగా విపక్షాల ఆరోపణ..!
ఒంగోలు శివారుల్లో భూ ఆక్రమణల వెనక మంత్రి ఉన్నారని ఆరోపణ..!
అయితే .. అభిమానం ఎక్కువై.. తరచూ ఏదో ఒక వివాదంలో దూరి తన పేరును చెడగొట్టే వారిని వదిలిపెట్టబోనని మంత్రి బాలినేని సీరియస్‌గా ఉన్నారట. ఇదే కాదు.. వైసీపీ సర్కార్‌లో బాలినేని మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజులకే వ్యక్తిగత సహాయకుడు ఆయన సంతకాలను ఫోర్జరీ చేసి బదిలీలకు సిఫారసు లెటర్లు ఇచ్చిన వ్యవహారం పెద్ద కలకలం రేపింది. గత ఏడాది చెన్నై బోర్డర్‌లో ఒంగోలు వైసీపీ నేత నల్లమల్లి బాలు ఆరుకోట్లు తరలిస్తూ పోలీసులకు చిక్కారు.
ఆ నగదు బాలినేని హవాలా సొమ్ముగా ప్రతిపక్షపార్టీలు ఇప్పటికీ ఆరోపిస్తుంటాయి. ఆ సొమ్ముతో తనకు సంబంధం లేదని బాలినేని వివరణ ఇచ్చినా విపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. ఈ ఘటనపై రచ్చ జరుగుతున్న సమయంలోనే ఒంగోలు శివారుల్లో వైసీపీ నేతల భూ ఆక్రమణలు.. వీటి వెనక మంత్రి ఉన్నారని దళిత సంఘాల ఆరోపణలు దుమారం రేపాయి. ఇప్పుడు సుబ్బారావు గుప్తా వ్యవహారంతో మళ్లీ చర్చల్లోకి వచ్చారు మంత్రి బాలినేని. సమస్య నివురు గప్పిన నిప్పులా ఉంది. రెండు వైపులా వివరణలు.. ప్రకటనలు వెల్లువలా వస్తున్నాయి. మరి.. ఈ రగడ నుంచి బాలినేని ఎలా బయట పడతారో చూడాలి.
