Site icon NTV Telugu

తీవ్రస్థాయికి చేరిన వైసీపీలో కుమ్ములాటలు..!

ఆ రెబల్ ఎమ్మెల్యే ఊహించింది ఒకటైతే.. జరుగుతున్నది మరొకటా? పార్టీలో అసమ్మతి కుంపట్లు చెమటలు పట్టిస్తున్నాయా? చాపకింద నీరులా విస్తరిస్తున్న వ్యతిరేకత టెన్షన్ పుట్టిస్తోందా? అధిష్ఠానానికి తలనొప్పిగా మారిన ఆ నియోజకవర్గం ఎక్కడిది? అక్కడ కుమ్ములాటల కథేంటి?

బలమైన శక్తిగా ఎదగాలన్నది వాసుపల్లి ఆలోచన?

విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీలో మూడు ముక్కలాట ముదురుతోంది. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు వ్యతిరేకంగా కొత్త కుంపట్లు రాజుకుంటున్నాయి. ఇటీవల అధికారపార్టీ నిర్వహించిన జనాగ్రహదీక్ష సాక్షిగా మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌ వైసీపీ పంచన చేరాక.. అధికారపార్టీ అండతో బలమైన శక్తిగా ఎదగాలనే ఆలోచనలో ఉన్నారు.

జీవీఎంసీ ఎన్నికల తర్వాత మారిన పరిస్థితులు..!

వాసుపల్లి రాకముందు ఇక్కడ వైసీపీకి కోలా గురువులు, ద్రోణంరాజు శ్రీనివాస్‌ల నాయకత్వం ఉండేది. ద్రోణంరాజు మరణం తర్వాత పరిస్థితులు మారాయి. మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడంతో కోలా గురువులు పోటాపోటీ రాజకీయాలకు కాస్త దూరం జరిగారు. అంతా వాసుపల్లి చేతుల్లోకి వెళ్లినట్టే కనిపించినా అది ఎక్కువకాలం కొనసాగలేదు. జీవీఎంసీ ఎన్నికల తర్వాత పరిణామాలు వేగంగా మారాయి.

వాసుపల్లి వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని కేడర్‌ ఫైర్‌..!

నియోజకవర్గం పరిధిలో 13డివిజన్లు ఉండగా.. నాలుచోట్లే గెలిచింది. టీడీపీకి 38వేల ఓట్లు వస్తే.. వైసీపీకి దక్కిన ఓట్లు 34 వేలు. వాసుపల్లి వచ్చినా.. ప్రతికూల ఫలితాలు రావడం వాసుపల్లి వ్యతిరేకులకు అస్త్రంగా మారింది. మిగిలినచోట్ల కంటే ఈ నియోజకవర్గ పరిధిలో నామినేటెడ్ పదవులు అధికంగా లభించాయి. స్ధానిక నాయకత్వంలోనూ హుషారు పెరిగింది. వేదిక ఏదైనా ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తోంది స్థానిక కేడర్‌. ఈ పరిస్ధితికి వాసుపల్లి వైఖరే కారణమని ఫైర్‌ అవుతున్నారు. వైసీపీలో పట్టుసాధించి బలం పెంచుకోవడానికి ఎమ్మెల్యే వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనేది బహిరంగ విమర్శ.

నియోజకవర్గంలో మూడు జనాగ్రహదీక్షా శిబిరాలు..!

ఇటీవల అధికార, విపక్షాల మధ్య మత్తు పదార్ధాలపై రచ్చ రచ్చ జరిగింది. టీడీపీ రాజకీయాలను ఎండగట్టేందుకు జనాగ్రహ దీక్షలు నిర్వహించింది వైసీపీ. ప్రతీ నియోజకవర్గంలో రెండురోజులపాటు ఎమ్మెల్యే లేదా కోఆర్డినేటర్ సమక్షంలో దీక్షలు జరిగాయి. దక్షిణ నియోజకవర్గంలో మాత్రం మూడు టెంట్లు ఏర్పాటయ్యాయి. జీవీఎంసీ ధర్నాచౌక్ దగ్గర పార్టీ ఆదేశాలతో కార్పోరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు నిరసన శిబిరం తెరిచారు. ఎమ్మెల్యే వాసుపల్లి ఒకరోజు దీక్షకు పరిమితంకాగా.. ఆయన శిబిరం వేరేగా నిర్వహించారు. కోలా గురువులు ఫిషింగ్ హార్బర్లో దీక్ష చేపట్టారు. పార్టీ ముఖ్యనేతలు ఈ మూడు శిబిరాల దగ్గరకు వెళ్లక తప్పలేదు.

ఎమ్మెల్యేలకు.. కార్పొరేటర్లు, ముఖ్య నేతల మధ్య కోల్డ్‌వార్‌..!

ఎమ్మెల్యేకు కార్పొరేటర్లు, ముఖ్య నాయకులకు మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందనేది బలంగా వినిపిస్తోన్న టాక్. ఇటీవల ఆసరా కార్యక్రమ వేదికపై కార్పొరేటర్ సాధిక్ వర్సెస్‌ ఎమ్మెల్యే మధ్య పరోక్ష విమర్శలు వినిపించాయి. కోవిడ్ సమయంలో ఫీజు రాయితీలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే.. వాసుపల్లి కాలేజీల్లో ఆ విధానం అమలు కాలేదని సొంతపార్టీ నాయకులే విమర్శలు చేస్తున్నారు. ఆలయ కమిటీలలోనూ పంచాయితీలు జరుగుతున్నట్టు భోగట్టా. స్ధానికంగా ఉండే గుడులకు పాలకమండళ్లను నియమించబోతున్నారు. ఎమ్మెల్యే కొన్ని పేర్లను సిఫారసు చేయగా.. పోటీగా కార్పొరేటర్లు, పార్టీ సీనియర్‌ నేతలు మరికొన్ని పేర్లను వైసీపీ పెద్దలకు ఇచ్చారట. దీంతో ఎవరి మాట నెగ్గుతుందోననే ఉత్కంఠ నెలొంది. మరి.. ఈ ప్రతికూల పరిస్థితిని వాసుపల్లి ఎంతకాలం నెగ్గుకొస్తారో చూడాలి.


Exit mobile version