Site icon NTV Telugu

ఒక ఇంచార్జ్ పేరు ఇంతలా వాడతారా ..?

ఆయన ఎన్నికల్లో గెలవలేదు. పార్టీ అధికారంలోకి రావడంతో ఇంఛార్జ్‌ హోదాలో నియోజకవర్గంలో పెత్తనం ఆయనదే. చేతిలో పవర్‌ ఉన్నా కాలం కలిసిరావడం లేదట. మెతకగా ఉంటున్నారని అలుసుగా తీసుకున్నారో ఏమో.. అంతా ఆయన పేరును వాడేసుకుంటున్నారట. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు గగ్గోలు పెడుతున్నారు ఆ ఇంఛార్జ్‌.

సొంత పార్టీ నేతల నుంచి తలనొప్పులు!

అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి వచ్చిన రెండు సీట్లలో ఇచ్ఛాపురం ఒకటి. బెందాళం అశోక్‌ గెలిచినా.. ఆయనపై ఓడిన వైసీపీ నేత పిరియా సాయిరాజ్‌దే ఇక్కడ పెత్తనం. ఆయన వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌. DCMS ఛైర్మన్‌గానూ ఉన్నారు. నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నప్పటికీ సొంత పార్టీ నేతల నుంచి ఆయనకు తలనొప్పులు తప్పడం లేదట. ఎవరుపడితే వారు సాయిరాజ్‌ పేరును వాడేసుకుని పనులు చేయించుకుంటున్నారట. అది తెలిసినప్పటి నుంచి ఇంఛార్జ్‌కు తలనొప్పులు మొదలైనట్టు చెబుతున్నారు.

సాయిరాజ్‌ పేరు చెప్పి ఇసుక అక్రమ రవాణా?

ఆ మధ్య ప్రభుత్వం పేరు చెప్పి ఇచ్ఛాపురంలో పెద్దఎత్తున అక్రమంగా ఇసుక రవాణా చేశారు. బహుదా, మహేంద్రతనయ నదుల నుంచి ఇసుకను దోచుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఇంఛార్జ్‌ సాయిరాజ్ పీకకే చుట్టుకుందట. తన కనుసన్నల్లోనే అంతా జరుగుతోందని విమర్శలు రావడంతో కంగుతిన్నారట సాయిరాజ్‌. తనకేం సంబంధం లేదని.. తహశీల్దార్‌కు, పోలీసులకు ఆయన ఫిర్యాదు చేసుకోవాల్సి వచ్చింది. సీన్‌ కట్ చేస్తే అదే తరహాలో మరికొన్ని చోట్ల వైసీపీ చోటామోటా నేతలు, పరిచయస్తులు సాయిరాజ్ పేరును వాడేస్తున్నారట. సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని కావాలన్నా.. సాయిరాజ్ నామస్మరణే చేస్తున్నారట.

సాయిరాజ్‌ పేరు చెప్పి ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు?

ఇటీవల సోంపేట మండలం పరిధిలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి.. పలువురు రియల్ ఎస్టేట్ దందాకు తెరతీశారు. ఓ డాక్యుమెంట్‌ రైటరైతే అపార్ట్‌మెంట్.. షాపింగ్ కాంప్లెక్స్ కట్టేశారట. అవన్నీ నిబంధనలకు విరుద్ధంగా కట్టారని లోకల్ వైసీపీ నేతలు రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారట. అపార్ట్‌మెంట్‌ దగ్గరకు వచ్చిన రెవిన్యూ అధికారులకు షాక్‌ ఇచ్చారట బిల్డింగ్‌ యజమాని. నా వెనక ఎవరున్నారో తెలుసా.. అని వైసీపీ ఇంఛార్జ్‌ సాయిరాజ్ పేరు చెప్పారట. దాంతో అధికారులు మారు మాట్లాడకుండా వెనక్కి వెళ్లిపోయారట. ఈ విషయం వైసీపీలోని సాయిరాజ్‌ వ్యతిరేక వర్గానికి తెలియడంతో.. వారు సోషల్‌ మీడియాలో ఆడేసుకుంటున్నారు. ఆయనకు ఇవ్వాల్సింది ఇచ్చేశారు అని ప్రచారం ఊదరగొడుతున్నారట. ఇది తెలిసి లబోదిబోమంటున్నారట సాయిరాజ్‌.

అధికారులను పిలిచి వివరణ ఇచ్చారట సాయిరాజ్‌!

నేను ఎవరి దగ్గరా రూపాయి తీసుకోలేదు..ఒట్టు..! నమ్మండి ప్లీజ్‌ అని బతిమాలుతున్నారట సాయిరాజ్‌. ఇలా తన పేరు వాడేసుకుంటున్నవారికి చెక్‌ పెట్టకపోతే లాభం లేదని భావించిన ఆయన.. రెవెన్యూ అధికారులతోపాటు.. వైసీపీ నేతలతో ఓ సమావేశం పెట్టి వివరణ ఇచ్చుకున్నారట. ఇకపై ఎవరైనా అలా చేస్తే సీరియస్‌గా తీసుకుంటానని స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారట.

స్థానిక సమస్యలపై సాయిరాజ్‌ సరిగా స్పందించడం లేదా?

ఈ గొడవపై ఇచ్ఛాపురం వైసీపీలో మరో చర్చ జరుగుతోంది. సమస్యలపై సాయిరాజ్‌ సరిగా స్పందించడం లేదని.. పట్టించుకోరని విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే అంతా ఆయన పేరు వాడేసుకుని లబ్ధి పొందుతున్నట్టు అనుమానిస్తున్నారు. అసలే రోజులు బాగోలేదని… రాజకీయ నేతలతో పెట్టుకోవడం ఎందుకు అనుకుంటున్నారో ఏమో.. సాయిరాజ్‌ పేరు చెప్పగానే అధికారులు పనులు చేసిపెట్టేస్తున్నారట. మరి.. ఈ తలపోటుల నుంచి వైసీపీ ఇంఛార్జ్‌ ఏ విధంగా బయటపడతారో చూడాలి.

Exit mobile version