ఆ సినిమా స్టార్.. తర్వాతి కాలంలో పొలిటికల్ స్టార్ అయ్యారు. ఆ మధ్య కండువా మార్చి.. పాత గూటిలో సరికొత్తగా ప్రయాణం మొదలుపెట్టారు కూడా. ఇప్పుడు సోషల్ స్టార్‌గా న్యూ రోల్ పోషిస్తున్నారు. పార్టీలోనూ.. రాజకీయ వర్గాల్లోనూ చర్చగా మారి.. ఫోకస్‌లోకి వస్తున్నారట. ఇంతకీ ఎవరా లీడర్? ఏమా కథ?
బీజేపీలో గేర్ మార్చిన రాములమ్మ
తెలంగాణ రాజకీయాల్లో రాములమ్మ పాత్ర ప్రత్యేకం. సొంత పార్టీ పెట్టి.. తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి ఎంపీ అయ్యారు. ఆపై కాంగ్రెస్‌లో కొంతకాలం ప్రయాణించి.. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. బీజేపీ ఆమెకు కొత్త కాదు. పూర్వాశ్రమంలో ఆమె పొలిటికల్ ఎంట్రీ కాషాయ శిబిరంలోనే. వాతావరణం పాతదే అయినప్పటికీ.. ఇప్పుడున్న బీజేపీ నాయకులే విజయశాంతికి కొత్త. కాషాగూటిలోకి రీఎంట్రీ ఇచ్చినా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్న సందర్భాలు తక్కువే అన్నది శ్రేణుల్లో వినిపించే మాట. మీడియా సమావేశాలు సైతం పెద్దగా పెట్టడం లేదు. ఏదైనా మీటింగ్ ఉంటే పార్టీ ఆఫీస్‌కు వచ్చి వెళ్లిపోతున్నారనే విమర్శలున్నాయి. ఈ విషయాన్ని ఆమె గ్రహించారో ఏమో.. గేర్ మార్చి ఒక్కసారిగా బీజేపీ వర్గాల్లో చర్చగా మారారు విజయశాంతి.
ట్విట్టర్ వేదికగా పోస్టింగ్‌లు.. కామెంట్ల హోరు
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రాములమ్మ యాక్టివ్ అయ్యారు. సోషల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుకొని.. ప్రధాని మోడీతోపాటు బీజేపీ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి తనదైన శైలిలో పోస్టింగ్‌లు పెట్టి ప్రజలు, మీడియా అటెన్షన్ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ట్విటర్ వేదికగా గ్రాఫిక్ ప్లేట్స్.. చిన్న చిన్న వీడియోలు పోస్ట్ చేస్తున్నారామె. రాష్ట్ర ప్రభుత్వంపై సెటైర్లు వేస్తూ… కేంద్ర సర్కార్ పథకాలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ట్వీట్స్ విషయంలో మిగతావారి కంటే ముందు
మోడీ ఫర్ ఇండియా.. మార్పుకోసం కమలం అని క్యాప్షన్ పెట్టి ట్వీట్స్ చేస్తున్నారు విజయశాంతి. మిగతా బీజేపీ నేతలతో పోల్చుకుంటే ఈ విషయంలో ఆమె చాలా ముందు ఉన్నారట. పోస్టింగ్‌లలో ఉపయోగిస్తున్న పదాలు కూడా ఘాటుగా ఉంటున్నాయి. అయితే రాములమ్మ ఎందుకు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారని ప్రశ్నించేవారు లేకపోలేదు.
సోషల్ స్టార్‌గా కొత్త పాత్ర
బీజేపీలో చేరిన తర్వాత విజయశాంతి పెద్దగా కనిపించడం లేదు. కరోనా పరిస్థితుల కారణంగా జనాల్లోకి వెళ్లలేని దుస్థితి. అందుకే సోషల్ మీడియాను నమ్ముకున్నారనే వారు లేకపోలేదు. రాజకీయాల్లో ఉన్నాననే ఉనికి కోసమో ఏమో తాను చెప్పదలుచుకున్నది సోషల్ మీడియా ద్వారా తొందరగా వెళ్తుందని ఆమె భావించడం చర్చగా మారింది. అయితే పార్టీ వేదికలపై అవకాశం రాకే ఈ విధంగా ట్విటర్‌ను ఆశ్రయించారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా… సోషల్ స్టార్‌గా రాములమ్మ కొత్త పాత్ర చర్చకైతే వచ్చింది.
సూటిగా సుత్తిలేకుండా ట్వీట్లు
భిన్నమైన లైన్ ఎంచుకున్న రాములమ్మ
తన దృష్టికి వచ్చిన ఏ అంశాన్నీ విజయశాంతి వదలడం లేదు. చెప్పాల్సింది సూటిగా సుత్తిలేకుండా ట్వీట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా కొన్ని వీడియోలు సిద్ధం చేసి రిలీజ్ చేయడం కమలనాథులను సైతం ఆశ్చర్య పరుస్తోందట. వాస్తవానికి బీజేపీ కేంద్ర నాయకత్వం సోషల్ మీడియా ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ప్రధాని మోడీ.. హోంమంత్రి అమిత్‌షా మొదలుకుని అంతా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు కొందరు వారిని అనుసరిస్తున్నా.. అంత సక్సెస్ కాలేదనే టాక్ పార్టీ వర్గాల్లో ఉంది. రాములమ్మ మాత్రం వారికి భిన్నంగా వెళ్తున్నట్టు టాక్. కారణం ఏదైనా విజయశాంతి ఎంచుకున్న లైన్‌పై మాత్రం కమలనాథుల్లో చర్చ జరగుతోంది.