ఆ నాయకుడిపై సిక్కోలు టీడీపీ తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారట. ఏదో జరుగుతుందని ఆశిస్తే.. ఇంకేదో అవుతుందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇంతకీ తమ్ముళ్లకు ఎవరిపై కోపం వచ్చింది? వారి బాధేంటి? ఎవరి వైఖరిని చర్చకు పెడుతున్నారు?
అచ్చెన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడైనా సిక్కోలు టీడీపీలో నైరాశ్యం
ఒకనాడు టీడీపీకి కంచుకోటైన సిక్కోలులో ప్రస్తుతం సైకిల్ పార్టీ క్యాడర్‌కు దారీతెన్నూ లేకుండా పోయిందనే చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల ముందు ఓ వెలుగు వెలిగిన వారు.. కష్టకాలంలో కనిపించడం లేదట. సార్వత్రిక ఎన్నికల్లో రెండుచోట్లే గెలవడంతో భవిష్యత్‌పై డైలమాలో పడ్డాయి పార్టీ శ్రేణులు. ఆ సమయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పగ్గాలను కళా వెంకట్రావ్ నుంచి అచ్చెన్నాయుడికి అప్పగించారు. ఈ నిర్ణయం నిరాశలో ఉన్న తెలుగు తమ్ముళ్లకు జోష్ తీసుకొచ్చింది. అసెంబ్లీ టైగర్‌గా పార్టీ శ్రేణులు పిలుచుకునే అచ్చెన్న కొత్త పోస్ట్‌లో రావడంతో ఇక తమకు తిరుగే ఉండదని సంబరపడ్డాయి. ఎంపీ రామ్మోహన్ నాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికితోడు అచ్చెన్న జత కలిస్తే కొత్తశక్తి పుట్టుకొస్తుందని ఆశించారు. కానీ.. ఆ ఆశలన్నీ ఆవిరయ్యాయట. తెలుగు తమ్ముళ్లలో దానిపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
పరిషత్ ఎన్నికల సమయంలో దుకాణం సర్దేశారు!
ఏపీ టీడీపీ అధ్యక్షుడైన తర్వాత అచ్చెన్న బాగా బిజీ అయిపోయారట. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సమయంలో సైతం ముఖ్యమైన ఒకటి రెండు సందర్భాల్లో తప్ప ఆయన జిల్లా ముఖం చూసింది లేదట. ఇక పరిషత్ ఎన్నికల సమయంలో దుకాణం మొత్తం తిరుపతికి సర్దేసినట్టు చెబుతారు.
కనీసం ఫోన్ చేసి కూడా పలకరించడం లేదట
అచ్చెన్న వైఖరిలో వచ్చిన ఈ మార్పుతో శ్రీకాకుళం జిల్లాలోని టీడీపీ కేడర్ అయోమయంలో ఉన్నట్టు టాక్. కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో శ్రేణులకు ధైర్యం చెప్పేవారు లేరని.. కనీసం ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేయడం లేదని గుసగసలాడుకుంటున్నారు. కరోనా సమయంలోనూ వైసీపీ జిల్లాలో దూకుడుగా వెళ్తోందని.. కేడర్‌కు, ప్రజలకు దగ్గరగా ఉంటోందని చెప్పుకొని టీడీపీ లోకల్ లీడర్స్ కలత చెందుతున్నారట.
కేడర్‌కు అందుబాటులో లేకపోతే ఎలా అని ప్రశ్న
జిల్లా టీడీపీ నేతలు పట్టించుకోక.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సైతం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం కేడర్‌కు మింగుడు పడటం లేదని సమాచారం. పదవి వస్తే సంబరాలు చేసుకుని.. కష్టమొస్తే అండగా నిలబడి నిరసనలు తెలిపిన క్యాడర్‌కు అందుబాటులో లేకపోతే ఎలా అని మరికొందరు గట్టిగానే ప్రశ్నిస్తున్నారట. గతంలో నెలకోసారైనా జిల్లా పార్టీ కార్యాలయంలో సమీక్షలు, సమావేశాలు జరిగేవి. ముఖ్యనాయకులతో కేడర్ మాట్లాడే అవకాశం దక్కేది. ఇప్పుడు పార్టీ కార్యాలయంవైపు ఏ నాయకుడూ చూడటం లేదట.
టెక్కలి తెలుగు తమ్ముళ్లు సైతం గుర్రు
స్థానిక ఎన్నికల తర్వాత పూర్తిగా జిల్లాకు దూరంగా ఉంటున్న అచ్చెన్నాయుడు ప్రస్తుతం అమరావతి లేకపోతే విశాఖలో కనిపిస్తున్నారు తప్ప శ్రీకాకుళం జిల్లాకు రావడం లేదని పార్టీలో ఓపెన్‌గా చర్చించుకుంటున్నారు. టెక్కలిలోని తెలుగు తమ్ముళ్లు సైతం తమ నేతపై గుర్రుగా ఉన్నట్టు చెబుతున్నారు. పొరుగు జిల్లా వరకు వచ్చి అటు నుంచి అటే యూటర్న్ తీసుకుంటే ఎలా అని.. కొందరు పార్టీ ఆంతరంగిక సంభాషణల్లో నిలదీస్తున్నారట. కేడర్‌ను పట్టించుకునేవారు లేకపోతే.. వారు సమస్యలు ఎవరికి చెప్పుకొంటారని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.
కేడర్‌కు రుచించని తాజా పరిణామాలు
ఎర్రన్న సోదరుడు అధ్యక్షుడయ్యాడంటే ఇక తమకు బలమైన అండ దొరుకుతుందని భావించిన క్యాడర్‌కు తాజా పరిణామాలు రుచించడం లేదని తెలుస్తోంది. తమ ప్రియతమ నేత ముఖం చూసి మూడు నెలలైందని సెటైర్లు వేస్తున్నారట. తనకు కేడర్‌కు మధ్య గ్యాప్ వస్తున్నట్టు అచ్చెన్న సైతం గ్రహించినా.. ఆయన ఎందుకు అలా ఉంటున్నారో అర్థం కావడం లేదట తమ్ముళ్లకు.
