NTV Telugu Site icon

సిక్కోలు నేత కోండ్రు మురళి మదిలో ఏముంది?

నిన్న మొన్నటిదాకా అంటీ ముట్టనట్టున్నాడు. ఇప్పుడు జస్ట్‌.. చిన్న పిలుపురాగానే అటెండెన్స్‌ వేయించుకున్నాడట. ఓ దశలో కండువా మార్చేస్తారనే టాక్‌ కూడా నడిచింది. అంతలోనే ఊహించనంత మార్పు.. దీంతో ఆ మాజీ మంత్రిపై నియోజకవర్గంలో రకరకాల ఊహాగాహానాలు చక్కర్లు కొడుతున్నాయట.

రాజకీయాలు అనూహ్యంగా మారిపోతుంటాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఏ కండువా కప్పుకుంటాడో.. ఊహించలేని పరిస్థితి. కొందరిపై ఏళ్ల తరబడి ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ, పార్టీ మారరు. వేరే జెండా ఎత్తరు. ఉన్న పార్టీలోనే ఎత్తు పల్లాలు చూస్తూ ఉండిపోతుంటారు కొందరు నేతలు. సిక్కోలు నేత కోండ్రు మురళి గురించి కూడా ఇలాంటి ఊహాగానాలే వినిపిస్తుంటాయి.

సిక్కోలు జిల్లాలో గ్రూప్ పాలిట్రిక్స్ కు కేరాఫ్ అడ్రస్ రాజాం ఇక్కడ టీడీపీలో ఇప్పుడు ఓ సరికొత్త చర్చ నడుస్తోందట. రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ చార్జ్‌ కోండ్రు మురళీమోహన్ స్ట్రాటజీ ఏంటో అర్ధం కాక కార్యకర్తలు జుట్టుపీక్కుంటున్నారట.

2009 నియోజకవర్గాల పునర్విభజనలో రాజాం నియోజకవర్గానికి కాంగ్రెస్ తరపున తొలి ఎమ్మెల్యేగా గెలిచిన కోండ్రు, వెంటనే మంత్రైపోయారు. ఐతే 2014లో మాత్రం విభజన ఎఫెక్ట్ దెబ్బకు కోండ్రు రాజాంలో గెలవలేకపోయారు. ఈక్రమంలో 2019 ఎన్నికల్లో కోండ్రుకు వైసీపీ నుంచి ఆఫర్ వచ్చిందట. విశాఖ జిల్లా పాయకరావు పేట నుంచి పోటీ చేయాలని కోరడంతో … రాజాంలోనే బరిలోకి దిగుతానంటూ ఫ్యాన్ పార్టీ ఛాన్స్ ను మిస్ చేసుకున్నారట.

ఈ క్రమంలోనే టీడీపీ గాలానికి కోండ్రు చిక్కారట. దీంతో కోండ్రు కాంగ్రెస్ ను వీడి పసుపు కండువా కప్పేసుకున్నారు. ఇక గెలుపు గ్యారంటీ అనుకున్నప్పటికీ రాజాం టీడీపీలో ఉన్న గ్రూపు రాజకీయాలు కోండ్రు విజయాన్ని దెబ్బకొట్టాయట. ఓటమి తర్వాత అనవసరంగా సైకిల్ ఎక్కానని భావించిన మురళి, చలా కాలం నియోజకవర్గానికి దూరంగా విశాఖలోనే ఉంటున్నారట. రాజధాని విషయంతో పాటు పాస్టర్లకు జీతాలు ఇవ్వడం వంటి అంశాల్లో అధినేత చంద్రబాబుతో కూడా విభేదించారు. దీంతో కోండ్రు కండువా మార్చేస్తారనుకున్నా, అప్పట్నుంచి సైలెంట్ గానే ఉంటున్నారట.

అయితే అనూహ్యంగా మళ్లీ ఈ మాజీ మంత్రి రాజాం తెరపై తరచూ కనిపిస్తున్నారు.
పరామర్శలు, పలకరింపులతో పాటు పార్టీ ఏ పిలుపునిచ్చానా…ఠక్కున విశాఖ నుంచి వచ్చి రాజాంలో వాలిపోతున్నారట. ఈ పరిణామం క్యాడర్ లో కొంత జోష్ ను నింపినా… కోండ్రు వైఖరి వారికి అంతు చిక్కడం లేదట. అధినేత నిర్ణయాలను విభేదిస్తుండటంతో కోండ్రు పార్టీ నుంచి జారుకుంటారని అంతా అనుకుంటే..ఇప్పుడేమో ఇలా జరుగుతోంది.

కోండ్రు క్యాడర్ అంతటినీ మళ్లీ తన వైపుకు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నాడని రాజాం లోకల్ టాక్. తనతో కలిసి వచ్చే వారిని కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య ఫ్యాన్ గూటికి కోండ్రు చేరిపోతాడని పుకార్లు షికార్లు చేసినప్పటికీ పార్టీ మారడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ఆయన భావించారట.
ఒ సమయంలో వైసీపీపై ఇంట్రస్ట్ చూపిన ఈ మాజీమంత్రి ఇప్పుడు తనకేమీ తెలియదన్నట్లు కామ్ అయిపోయారట. ఇటీవల బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చినా నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేశారట. ఇదే ఇప్పుడు రాజాంలో చర్చనీయాంశంగా మారింది.

అధినేత నిర్ణయాలను కాదంటారు… పార్టీ కార్యక్రమాలకు మాత్రం అటెండ్ అవుతున్నారు… పోనీ పార్టీ మారిపోతారా అంటే అదీ లేదంటున్నారు… ఇదంతా చూస్తున్న క్యాడర్ మాత్రం కోండ్రు మనసులో ఏముందో తెలియక తెగ తికమక పడిపోతున్నారట. మురళి క్లారిటీలో ఉన్నారా.. కన్ఫ్యూజన్ లో ఉన్నారా అని తెలియక జుట్టు పీక్కుంటున్నారట.