Site icon NTV Telugu

ఆ మంత్రిగారు హంపి టూర్‌పై ఎందుకు మనసు పడ్డారు?

ఆ తెలంగాణ మంత్రి హంపి టూర్‌పై అధికారపార్టీలో.. రాజకీయవర్గాల్లో అప్పట్లో జోరుగా చర్చ జరిగింది. ఆసక్తి ఉన్నవారు ఓ అడుగు ముందుకేసి అక్కడేం జరిగిందో అని ఆరా తీశారు కూడా. అయితే హంపీలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ప్రచారంలో ఉన్నదంతా సినిమా స్క్రిప్ట్‌ అని ఇటీవలే కొట్టిపారేశారు ఆ మంత్రి. అక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో.. మరోసారి హంపీకి వెళ్తామని ట్విస్ట్‌ ఇచ్చారు. ఇంతకీ అమాత్యుల వారు హంపిపై ఎందుకు మనసు పడ్డారు?

హంపి టూర్‌పై ఇంకాస్త మసాలా దట్టించారా?

తెలంగాణ రాజకీయ వర్గాల్లో హంపి టూర్‌పై మళ్లీ చర్చ మొదలైంది. మర్చిపోయారని అనుకుంటున్న ఎపిసోడ్‌ ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై వేటు సందర్భంగా తవ్వకాల నుంచి బయటపడింది ఈ అంశం. ఇప్పుడేం జరుగుతుంది? ఎలాంటి మలుపు తీసుకుంటుంది అని అంతా అనుకుంటున్న సమయంలో స్వయంగా మంత్రి జగదీష్‌ రెడ్డి ఇచ్చిన ట్విస్ట్‌.. ఇంకాస్త మసాలా దట్టించినట్టు అయ్యింది.

మంత్రి ఓపెన్‌ కావడంతో రాజకీయంగా మళ్లీ చర్చ

ఆ మధ్య కాలంలో టీఆర్‌ఎస్‌లో హంపి టూర్‌పై హాట్‌ హాట్‌గా చర్చ జరిగింది. హంపిలో ఏం జరిగిందో తెలియదు కానీ.. అక్కడ జరిగినట్టుగా అనేక అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. మంత్రి జగదీష్‌రెడ్డి కొందరు పార్టీ నేతలతో కలిసి నాడు హంపికి వెళ్లారు. మంత్రి తన కుమారుడి పుట్టినరోజు వేడుకలను అక్కడ గ్రాండ్‌గా నిర్వహించినట్టు టాక్‌. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ నేతలతోపాటు ఒకరిద్దరు పార్టీ ఎమ్మెల్యేలు సైతం బర్త్‌డే వేడుకలకు హాజరయ్యారట. ఆ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్స్‌.. కామెంట్స్‌పై రకరకాలుగా ప్రచారం జరిగింది. ఎవరికీ స్పష్టంగా తెలియకపోయినా.. టీఆర్‌ఎస్‌తోపాటు రాజకీయవర్గాల్లో ఆసక్తికర సబ్జెట్‌గా మారింది. ఇన్నాళ్లుగా హంపి టూర్‌పై మంత్రి జగదీష్‌రెడ్డి స్పందించిన సందర్భాలూ లేవు. కానీ.. ఇప్పుడు ఆయనే ఓపెన్‌ కావడంతో పొలిటికల్‌ సర్కిల్స్‌లో వేడి రాజుకుంది.

హంపికి వెళ్లడం అదే ఫస్ట్‌ టైమ్‌ కాదట

హంపిలో ఏం జరిగిందో బయట వారికి తెలియదన్నది మంత్రి జగదీష్‌రెడ్డి చెప్పే మాట. ఇప్పటి వరకు జరిగిన ప్రచారం.. జరుగుతున్న చర్చ అంతా తన శత్రువులు చేస్తున్న సినిమా స్క్రిప్ట్‌గా ఆయన కొట్టి పారేశారు. పైగా హంపికి వెళ్లడం అదే ఫస్ట్‌ టైమ్ కాదట. రెండోసారి అని అమాత్యుల వారే తెలిపారు. కుటుంబసభ్యులతో హంపికి వెళ్లడంవల్ల ఇతర అంశాలు మాట్లాడటానికి ఛాన్స్‌ లేదన్నారాయన.

ఆ పాటను రసమయి ఇంకెక్కడో పాడారట

హంపి ఎపిసోడ్‌లో చర్చలో ఉన్న మరో హాట్‌ టాపిక్‌.. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పాడినట్టుగా చెబుతున్న పాట. రావమ్మా కమలమ్మ అని రసమయి పాట పాడినట్టుగా ప్రచారంలో ఉంది. రసమయి ఈ పాట పాడటం వెనక అర్థం ఏంటన్న చర్చ బలంగానే సాగింది. దీనిపైనా మంత్రి జగదీష్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. హంపి టూర్‌లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఆ పాట పాడలేదని.. అది వేరే చోట పాడినట్టుగా వివరణ ఇచ్చారు అమాత్యుల వారు.

మరోసారి హంపికి వెళ్తామన్న మంత్రి జగదీష్‌రెడ్డి

ఎవరి వాదన ఎలా ఉన్నా.. మాజీ మంత్రి ఈటల ఉదంతంలో భాగంగా హంపి టూర్‌పై చర్చ మళ్లీ మెయిన్‌లైన్‌లోకి రావడంతో మంత్రి జగదీష్‌రెడ్డి స్పందించక తప్పలేదన్నది కొందరి అభిప్రాయం. కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశారని భావిస్తున్నారు. అయితే కేవలం వివరణతో సరిపెడితే బాగోదని అనుకున్నారో ఏమో.. కొంత ట్విస్ట్‌ ఇచ్చారు జగదీష్‌రెడ్డి. మరోసారి సహచరులతో కలిసి హంపికి వెళ్తామని చెప్పారాయన. ప్రత్యర్థిపార్టీల ప్రతినిధులు.. ఏదో జరుగుతోందని అనుకుంటున్నారని.. అది కలలో కూడా సాధ్యం కాదని ఆయన తెలిపారు. మరి.. హంపి టూర్‌కు మంత్రి జగదీష్‌రెడ్డి ఎప్పుడు వెళ్తారో.. వెళ్తే ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version