Site icon NTV Telugu

చంద్రబాబు కుప్పం టూర్ సక్సెస్ అయినట్టేనా..?

కంచుకోటలాంటి నియోజకవర్గం.. గత ఎన్నికల్లో మెజార్టీ తగ్గింది. స్థానిక సంస్థల్లోనూ ఎదురు దెబ్బ తగిలింది. క్యాడర్‌లో ధైర్యం సన్నగిల్లుతోంది. వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామంటున్నారు ప్రత్యర్థులు. ఇలాంటి పరిస్థితుల్లో అధినేత రెండు రోజుల టూర్ చేశారు. ఇప్పుడు పరిస్థితి మారుతుందా?. చంద్రబాబు కుప్పం టూర్‌పై తెలుగు తమ్ముళ్లు హ్యాపీయేనా?.

సొంత నియోజకవర్గం నుంచే మొదలు
ఇటీవలి వరస సంఘటనల తర్వాత పార్టీలో కదలిక వచ్చింది. దాన్ని అలాగే ఉంచాలంటే ఎక్కడ నుంచైనా మొదలు పెట్టాలి. ఎక్కడ నుంచో ఎందుకు?. సొంత నియోజకవర్గం నుంచే మొదలు పెడితే పోతుందిగా.. ఇదీ టీడీపీ అధినేత ఆలోచన. 2019 ఎన్నికలు, ఆ తర్వాత వరసగా ఎదురవుతున్న ఓటములతో కేడర్‌ డీలా పడింది. కంచు కోటలాంటి సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి దారుణంగా ఉంది. తమ్ముళ్లలో ఉత్సాహం నింపేందుకు కుప్పంలో రెండు రోజుల టూర్ పెట్టుకున్నారు చంద్రబాబు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురు దెబ్బలు
పట్టు తగ్గలేదని నిరూపించుకోవడానికేనా

చంద్రబాబు సొంతూరు నారావారి పల్లె చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. అయితే చంద్రగిరి కంటే కుప్పం ఓటర్లే చంద్రబాబుకు దశాబ్ధాల తరబడి అండగా ఉంటూ వస్తున్నారు. కుప్పంలో పంచాయితీ, ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. అయినప్పటికి నియోజకవర్గం మీద తన పట్టు తగ్గలేదని నిరూపించుకోవడానికి, పట్టు సడలకుండా చూసుకోవడమే లక్ష్యంగా కుప్పంలో రెండు రోజులు పర్యటించారు చంద్రబాబు. అధినేత స్వయంగా రావడంతో పార్టీ నేతలు, కార్యకర్తలంతా యాక్టివ్ అయ్యారు. ప్రభుత్వం మీద బహిరంగంగానే విమర్శలతో విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులపైనా నేతలతో చర్చించారట.

ఫ్యూచర్ మనదే అంటూ కేడర్‌కు భరోసా
కుప్పంలో టీడీపీ పనైపోయిందని.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని కూడా ఓడిస్తామని జిల్లా వైసీపీ నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. ప్రత్యర్థుల విమర్శలెలా ఉన్నా.. ఫ్యూచర్ మనదే అంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చారట చంద్రబాబు. త్వరలో ఇక్కడ కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికను దృష్టిలో పెట్టుకునే బాబు కుప్పం వచ్చారు. ఒకరకంగా ఈ రెండు రోజుల పర్యటనలో చంద్రబాబు తన బలం తగ్గలేదనేలా ఆయన పర్యటన, సభలు చేశారనే మాటలు వినడుతున్నాయి.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబు సవాల్
పుంగనూరులో ఎలా గెలుస్తావో చూస్తానని వార్నింగ్‌

వాయిస్…. కుప్పంలో చంద్రబాబుని ఓడించాలని శపథం పట్టిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై మండిపడడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఆయన పుంగనూరులో ఎలా గెలుస్తారో చూస్తానని బహిరంగ సవాల్ విసిరారు చంద్రబాబు. గతంలో ఏ స్థానిక ఎన్నికల ప్రచారానికి రాని చంద్రబాబు ఈసారి ముందుగానే ఇక్కడకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంత చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి మధ్య ఎస్వీయూనివర్శిటీ కేంద్రంగా మొదలైన ఆధిపత్యపోరు ఇప్పుడు పరాకాష్టకు చేరుకుందని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది..

మున్సిపల్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే పర్యటన
లోకల్ బాడీ ఎన్నికలు ప్రారంభం కాక ముందే.. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులు పార్టీని వదిలేసి వైసీపీ గూటికి చేరారు. దీంతో సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో వరస ఓటములు ఎదురయ్యాయి. ఈ ఓటములతో టీడీపీ పనైపోయిందని భావిస్తున్న వైసీపీకి గట్టి జవాబు చెప్పాలని మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చూపించాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఆ లక్ష్యంతోనే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోని చంద్రబాబు తొలిసారిగా రానున్న మునిసిపల్ ఎన్నికలకు ముందు కుప్పం పర్యటన చేపట్టారు. ఆయన ఆలోచనలకు తగిన విధంగా కుప్పం సభకు జిల్లా పార్టీ నాయకత్వం భారీ ఎత్తున జనసమీకరణ చేపట్టారు.

నాయకులతో పార్టీ పరిస్థితిపై సమావేశాలు
ప్రభుత్వ వైఫల్యాల మీద విమర్శలు

రెండు రోజుల పర్యటన కోసం గత శుక్రవారం కుప్పం చేరుకున్న చంద్రబాబు శనివారం రాత్రి వరకు సభలు, సమావేశాలు, రోడ్డుషోలతో బిజీబిజీగా గడిపారు. ఆదివారం ఉదయం మరోసారి కీలకనాయకులతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత బెంగళూరు మీదుగా తిరుగు ప్రయాణమయ్యారు. దాదాపు రెండురోజుల పాటు కుప్పంలో గడిపిన చంద్రబాబు వేలాదిమందితో నిర్వహించిన సభలో, శనివారం నిర్వహించి రోడ్లలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, పథకాల అమలు తీరును తూర్పారపడుతూనే కుప్పంపై పట్టుకోసం యత్నిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆయన చెప్పాలనుకున్నదే చెప్పారా.. కేడర్ చెప్పింది వినలేదా?
ఈ ఒక్కసారికి గట్టిగా పని చేయండి.. గెలిచేది మనమే
మిగతా వాటి మాటెలా ఉన్నా… రెండున్నరేళ్లుగా వరసగా ఎదురవుతున్న పరాజయాలతో డీలా పడిన కుప్పం నియోజకవర్గ కార్యకర్తలకు తాజా పర్యటన ద్వారా చంద్రబాబు ఊపు నిచ్చారనే మాటలు మాత్రం గట్టిగానే వినపడుతూన్నాయి. అయితే ఎప్పటిలానే తన మాట వినాలన్నదే జరిగింది తప్ప.. అధినేత కార్యకర్తల మాటలు పెద్దగా పట్టించుకోలేదట. వచ్చే ఎన్నికలలో మనదే అధికారం ఈ ఒక్కసారి గట్టగా పనిచేసి పార్టీని గెలిపించండి…మీరు అనుకున్నది నేను చేస్తానని బాబు హామీ ఇచ్చారాట. ఇక కేడర్ సైతం ఎప్పుడూ లేని విధంగా కొత్తగా చంద్రబాబు నోటి వెంటనుండి నేను ఉన్నాను అనే భరోసా రావడంతో పార్టీలో జోష్ వచ్చిందంటున్నారు.

టూర్‌లో బాబు పక్కన పార్టీ నేతలకు ప్రాధాన్యం
చంద్రబాబు ఎప్పుడు కుప్పం వచ్చినా అధినేత వెంట ఉండే పీఏ మనోహర్, గౌరివాణి శ్రీవాసులు ఈసారి పర్యటనలో బాబు పక్కన పెద్దగా కనపడలేదు. మాజీ మంత్రి అమరనాధరెడ్డి, పుంగనూరు ఇన్ చార్జ్ చల్లా బాబులు ఈసారి బాబు వెంట కనిపించడం కూడా కేడర్‌లో కొంత సంతోషాన్ని నింపిందని టాక్‌. మొత్తానికి రెండురోజుల పర్యటన తమ్ముళ్ళు జోష్ నింపడానికి చంద్రబాబు కొన్ని జాగ్రత్తలు పాటించారని అంటున్నారు జిల్లా నేతలు. అయితే బాబు వ్యూహాం ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తేలవచ్చు.

Exit mobile version