ఓరుగల్లు టీఆర్ఎస్లో తూర్పు మంటలు రాజుకున్నాయా? ఆ ఎమ్మెల్యే తీరుపై సీనియర్లు గుర్రుగా ఉన్నారా? పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారా? ఏంటీ తాజా రగడ? ఎవరా ఎమ్మెల్యే?
ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌పై పార్టీ నేతల ఫైర్..!
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తీరు అధికారపార్టీ టీఆర్ఎస్‌లో సెగలు రేపుతోంది. వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోపై ఆయన చేసిన హడావిడి పార్టీలో చర్చగా మారడంతోపాటు.. అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసే వరకు వెళ్లింది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. సీనియర్ నాయకులు ఓ రేంజ్‌లో నరేందర్‌పై ఫైర్ అవుతున్నట్టు సమాచారం.
కలెక్టరేట్ స్థలం క్రెడిట్ కొట్టేయాలని చూశారా?
ఇటీవల వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల పేర్లను మార్చారు. వరంగల్ రూరల్ వరంగల్ జిల్లా అయితే.. వరంగల్ అర్బన్ హన్మకొండ జిల్లాగా మారింది. ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ హన్మకొండ జిల్లాకు కేటాయించారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ నిర్మాణం కోసం అజంజాహి మిల్స్ స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం. దానికి సంబంధించిన జీవో విడుదల కావడంతో అనుచరులతో కలిసి ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ సంబరాలతో సందడి చేశారు. ఇది పార్టీలో చర్చగా మారింది. కలెక్టరేట్‌కు స్థలం కేటాయిస్తే ఒక్క నన్నపనేనే చిందులు వేయడం ఏంటి? జిల్లా పరిధిలోని పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట ఎమ్మెల్యేలకు సంబంధం లేదా అని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. జిల్లా పరిధిలోని పార్టీ సీనియర్లకు కూడా సమాచారం ఇవ్వలేదట. దీంతో క్రెడిట్ కొట్టేయడానికి తూర్పు ఎమ్మెల్యే వేసిన ఎత్తుగడగా గులాబీ నేతలు రుసరుసలాడుతున్నారట.
నరేందర్‌పై పాత అంశాలను తవ్విపోస్తున్నారా?
పైకి చెప్పకపోయినా.. ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డిలు కుతకుతలాడుతున్నట్టు సమాచారం. తూర్పు నియోజకవర్గ పరిధిలోనే ఉంటున్న ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్, మేయర్ గుండు సుధారాణి, పార్టీ నేతలు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీనివాస్‌లను కూడా సంబరాలకు ఆహ్వానించలేదట. దీంతో ధాన్యం సేకరణపై టీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నరేందర్ ఒంటెద్దు పోకడలకు పోయారని.. పాత అంశాలను తవ్విపోస్తున్నారు.
నరేందర్‌పై పార్టీ పెద్దలకు ఇతర ఎమ్మెల్యేల ఫిర్యాదు?
కలెక్టరేట్‌కు కేటాయించిన భూమి.. తూర్పు నియోజవకర్గం పరిధిలోకే వస్తుంది. ఇది జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలకు రుచించలేదని సమాచారం. దాంతో నరేందర్‌పై టీఆర్‌ఎస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యేలు సిద్ధ పడుతున్నారట. కేవలం ఈ ముగ్గురే కాకుండా తూర్పు పరిధిలోని పార్టీ సీనియర్లు సైతం అదే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ కారణంగా.. కలెక్టరేట్‌కు స్థలం కేటాయించారన్న వార్త పక్కకుపోయింది. అధికారపార్టీలోనే కొత్త కుంపటి రాజేసింది. మరి.. ఈ సమస్యను పార్టీ పెద్దలు ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి.
