Site icon NTV Telugu

సీఎం జగన్‌తో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ వెనక ఏం జరిగింది…?

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర ఏపీ బీజేపీ నేతలకు ఊపు తెచ్చిందా? లేక ఆ ఒక్క విజిట్‌తో అంతా తారుమారైందా? ఇంతకీ ఆ భేటీ ముందుగానే ప్లాన్‌ చేశారా? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్‌ వాచ్‌!

కేంద్ర పథకాలకు రాష్ట్రాలు స్టిక్కర్లు వేస్తున్నాయని కిషన్‌రెడ్డి విమర్శ!

కేంద్ర కేబినెట్‌లో పదోన్నతులు పొందిన మంత్రులు.. ఆయా రాష్ట్రాల్లో జన ఆశీర్వాద యాత్రలు మొదలుపెట్టారు. ఆ విధంగా ఏపీకి వచ్చారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. తిరుపతి, విజయవాడలలో పర్యటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ బీజేపీ నేతలు, కార్యకర్తలు కిషన్‌రెడ్డి టూర్‌కు ఏర్పాట్లు చేశారు. రెండుచోట్లా పోటీపోటీగా స్వాగత కార్యక్రమాలు జరిగాయి కూడా. కమలనాథుల హడావిడి కారణంగా కేంద్రమంత్రి తలకు చిన్నగాయమైంది. అయినప్పటికీ కేంద్ర పథకాల గురించి చెబుతూనే.. ఆ కార్యక్రమాలకు రాష్ట్రాలు స్టిక్కర్లు వేసుకుంటున్నాయని కేంద్రమంత్రి విమర్శించారు.

కేడర్‌ ఉత్సాహంపై నీళ్లు పోశారని విమర్శలు!

విజయవాడ పర్యటన బీజేపీలో ఉత్సాహంగా సాగుతున్న క్రమంలో కేంద్రమంత్రి ట్విస్ట్‌ ఇచ్చారు. సడెన్‌గా సీఎం జగన్‌ ఇంటికి వెళ్లారు. అది చర్చకు దారితీసింది. అప్పటి వరకు జరిగిన జన ఆశీర్వాద యాత్రకు ప్రాధాన్యం తగ్గి.. సీఎం జగన్‌తో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీపైనే ఎక్కువ ఫోకస్‌ పడింది. కేడర్‌ ఉత్సాహంపై కేంద్రమంత్రి నీళ్లు పోశారనే విమర్శలు వినిపించాయట. ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగి ఉంటుందని మరికొందరు అనుమానించారట. బీజేపీ కార్యక్రమానికి వచ్చిన కిషన్‌రెడ్డి ఇలా ప్రభుత్వ పెద్దల ఇంటికెళ్లడం ఏంటనే చర్చే పార్టీ వర్గాలను ఓ పట్టాన వదిలిపెట్టలేదు.

తలకు గాయం కావడంతో సీఎం ఫోన్‌ చేసి పరామర్శించారా?

సీఎం జగన్‌తో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీపై బీజేపీలో మరోమాట కూడా వినిపిస్తోంది. తలకు గాయమైన కిషన్‌రెడ్డిని పలకరించడానికి ముఖ్యమంత్రి జగన్‌ ఫోన్‌ చేశారట. ఆ సమయంలో కేంద్రమంత్రి దుర్గగుడిలో ఉన్నారు. గాయం ఎలా అయ్యింది? ఇప్పుడెలా ఉంది అని సీఎం జగన్‌ ఆరా తీశారట. కేంద్ర కేబినెట్‌మంత్రి హోదాలో తొలిసారి రాష్ట్రానికి రావడంతో కర్టసీగా ముఖ్యమంత్రి ఫోన్‌లో పలకరించారని మరికొందరు చెబుతున్నారు. అయితే ఈ ఫోన్‌ సంభాషణల్లోనే ఇంటికి భోజనానికి రావాలని జగన్‌ పిలిచారని తెలుస్తోంది. బీజేపీ కార్యక్రమానికి వచ్చిన తాను ఇప్పుడు రాలేనని కిషన్‌రెడ్డి బదులిచ్చారట. కాకపోతే సీఎం ఆహ్వానం మేరకు టీ తాగేందుకు ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లారు కేంద్రమంత్రి.

సీఎం ఫోన్‌ చేయడం వల్లే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెళ్లారా?

సీఎం స్వయంగా ఫోన్‌ చేసి పరామర్శించినందునే కేంద్రమంత్రి వెళ్లాల్సి వచ్చిందన్నది కమలనాథుల వాదన. అంతా అప్పటికప్పుడు జరిగిందని.. దుర్గగుడి దగ్గర మీడియాకు కిషన్‌రెడ్డి అదే చెప్పారని గుర్తు చేస్తున్నారు. ఈ భేటీని రాజకీయ కోణంలో చూడాల్సిన పని లేదని.. కేంద్రమంత్రి సీఎంతో సమావేశమైనంత మాత్రాన రాజకీయంగా తప్పు పట్టక్కర్లేదని బీజేపీ వర్గాల వాదన. మర్యాద పూర్వక భేటీగా చెబుతూ లైట్‌ తీసుకుంటున్నారు కమలనాథులు. మొత్తానికి కిషన్‌రెడ్డి కర్టసీ ముందుముందు కాషాయ కేడర్‌కు ఎలాంటి సంకేతాలు పంపుతుందో చూడాలి.

Exit mobile version