కాంగ్రెస్‌లో అంతే…! ఆ పార్టీలో ఇది రొటీన్ డైలాగ్. కొత్త పీసీసీ చీఫ్ వచ్చాక దానికి బ్రేక్ పడుతుందని అనుకున్నారట. కానీ.. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అని నిరూపిస్తున్నారు నాయకులు. ఆ అంశంపైనే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
రేవంత్‌పై మొదలైన ఫిర్యాదుల పర్వం!
తెలంగాణ కాంగ్రెస్‌లో కయ్యాలు కామన్. ఏ చిన అంశం తెర మీదకు వచ్చినా.. అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్తాయి. కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా ఇప్పుడు ఫిర్యాదులు మొదలైనట్టు చెబుతున్నారు. ఇదే సమయంలో కీలక నాయకులు అలకబూనడాలు షురూ అయ్యింది. ఈ వివాదాలపై పార్టీ నేతలు ఆరా తీస్తున్నారట. అసలు విషయం తెలుసుకుని అవునా అని ఆశ్చర్యపోతున్నారట నాయకులు.
ధర్మపురి సంజయ్ చేరికపై పార్టీ నేతలు కుతకుత
నిజామాబాద్ జిల్లా నేతలకు చెప్పలేదట
ఇటీవల పీసీసీ చీఫ్ నివాసంలో నిజామాబాద్ జిల్లాకి చెందిన ధర్మపురి సంజయ్ భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో వివాదానికి ఈ సమావేశమే కారణం. నిజామాబాద్ జిల్లా నాయకులు.. సంజయ్ చేరికపట్ల కుతకుతలాడుతున్నారు. పీసీసీ చీఫ్ తన ఇంటికి సంజయ్‌ను పిలవడంపై.. నిజామాబాద్ జిల్లాకే చెందిన పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ తప్పు పడుతున్నారు. ధర్మపురి శ్రీనివాస్‌కు కాంగ్రెస్ ఎన్నో పదవులు ఇచ్చి గౌరవిస్తే.. పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు గుడ్‌బై చెప్పారని అనుకుంటున్నారు. దీంతో జిల్లాలో కాంగ్రెస్ దెబ్బతిందన్నది వారి ఆరోపణ. DS కుమారుడు సంజయ్‌పై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. అలాంటి నాయకులను పార్టీలోకి పిలవడం ఏంటన్నది పార్టీ నేతల ప్రశ్న. పైగా నిజామాబాద్ జిల్లా నాయకులకు కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్నారట. ముఖ్యంగా మధుయాష్కీకి సమాచారం లేదట. ఇది పార్టీ వర్గాల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తుందనే ఆవేదన నిజామాబాద్ టీమ్‌లో ఉందట. పార్టీలో చేరికలు తప్పుకాకపోయినా.. కనీసం సమాచారం ఇవ్వాలని కొందరు నాయకులు గుర్రుగా ఉన్నారట. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
సోనియా, రాహుల్, ఠాగూర్‌లకు ఫిర్యాదు
క్రిమినల్ ట్రాక్ రికార్డ్ ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని.. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, AICC రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్‌లకు పంపిన లేఖల్లో ప్రస్తావించడం కీలకంగా మారింది. ధర్మపురి సంజయ్, ఎర్ర శేఖర్‌లపై క్రిమినల్ కేసులు ఉన్నప్పుడు పార్టీలోకి ఎలా తీసుకొస్తారని ప్రశ్నిస్తున్నారట. భూపాలపల్లికి చెందిన గండ్ర సత్యనారాయణ చేరిక కూడా ఆ జిల్లా కాంగ్రెస్ నాయకులకు సమాచారం లేదట. ఇప్పటికే కొత్త పీసీసీ నియామకంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నాయకులంతా తాజా పరిణామాల తర్వాత యాక్టివ్ అయినట్టు చెబుతున్నారు.
మధుయాష్కీ నుంచే అసంతృప్తి పర్వం మొదలైందా?
అధిష్ఠానానికి పీసీసీ చీఫ్‌పై చేసిన ఫిర్యాదు గురించి తెలిసిన వెంటనే పార్టీలో కొత్త చర్చ మొదలైంది. రేవంత్‌కు కాంగ్రెస్ మార్క్ రాజకీయాలను రుచి చూపించేందుకు నేతలు నడుం కట్టారని చెవులు కొరుక్కుంటున్నారట. పైగా ఈ అసంతృప్తి పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ నుంచే మొదలు కావడం ఆసక్తిగా మారింది. పదవి చేపట్టే సమయంలో అందరినీ కలుపుకొని వెళ్తా.. సమిష్టి నిర్ణయాలు ఉంటాయని చెప్పిన వ్యక్తి.. ఇప్పుడు ఏకపక్షంగా వెళ్తున్నారని పార్టీ నేతలు మండిపడుతున్నారట. జిల్లా నేతలకు చెప్పకపోవడం.. అప్పట్లో కాంగ్రెస్‌కు ద్రోహం చేసినవారిని ఎలా ప్రోత్సహిస్తారని పీసీసీ సారథిపై ఒంటికాలిపై లేస్తున్నారట. సో.. కొత్త టీమ్‌పై మొదలైన ఈ అసంతృప్తి సెగ రానున్న రోజుల్లో ఏ విధంగా మలుపు తీసుకుంటుందో చూడాలి.