తెలంగాణ కాంగ్రెస్ కొత్త టీమ్‌లో సభ్యుల సంఖ్య పెరిగింది కానీ.. ఎవరేం చేయాలో అంతుచిక్కడం లేదట. గతంలోనూ అలాగే జరిగింది. ఇప్పుడు అదే రిపీట్ అవుతుందా? పని విభజన జరుగుతుందా? కొత్త సారథి చొరవ తీసుకుంటారా? దానికి పార్టీ నేతలు అంగీకరిస్తారా? లెట్స్ వాచ్!
నాడు పేరుకు మాత్రమే వర్కింగ్ ప్రెసిడెంట్లు
ఉత్తమ్ కుమార్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండేవారు. ఇప్పుడా సంఖ్య ఐదుకు పెరిగింది. ఆ సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డి, అజారుద్దీన్‌లకు పని విభజన జరగలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఎవరేం చేయాలో పని విభజన చేయాలని పీసీసీపై అప్పట్లో పొన్నం ఒత్తిడి చేసినా వర్కవుట్ కాలేదు. చివరకు గాంధీభవన్‌లో తనకు ప్రత్యేక ఛాంబర్ కావాలని డిమాండ్ చేసి ఊరుకున్నారు. నాడు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్‌కు సైతం పని విభజన జరగలేదు. ఇక అజారుద్దీన్ అయితే గాంధీభవన్ మెట్లే ఎక్కలేదు. చివరకు.. పేరుకు మాత్రమే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మిగిలిపోయారు నాయకులు.
కొత్త పీసీసీలో ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు
నాడు ముందుస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మెప్పు కోసం సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని పదవులను పంచింది అధిష్ఠానం. ఎవరేం చేయాలో చెప్పలేదు. దీంతో పదవులు అలంకార ప్రాయంగా మారాయి. నాయకత్వం బలంగా ఉండాలన్న దానికే పరిమితం అయ్యారు. ఇప్పుడు కొత్త పీసీసీలో ఏకంగా ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. గతంలో కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్నవారికే నో వర్క్. మరి.. కొత్తగా వచ్చిన ఐదుగురి పరిస్థితి ఏంటి? పీసీసీ సారథి రేవంత్‌రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్లకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారన్నది హాట్ టాపిక్‌గా మారింది.
అజారుద్దీన్ పార్టీ కార్యక్రమాలకు వస్తారా లేదా?
కొత్త టీమ్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, అజారుద్దీన్, పార్టీ నేత మహేష్‌గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్లు. వీరిలో అజారుద్దీన్ పాతవారే. పార్టీ సమావేశాల్లో కనిపించరనేది గాంధీభవన్ వర్గాల్లో వినిపించే మాట. ఎన్నికల సమయంలో కూడా అందుబాటులో లేరని పార్టీ నేతలు ఓపెన్‌గా చెబుతుంటారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆయన నుంచి ఆశించలేమని చెవులు కొరుక్కుంటున్నారు.
వర్కింగ్ ప్రెసిడెంట్లకు పని విభజన చేస్తారా?
వర్కింగ్ ప్రెసిడెంట్లలో మహేష్‌గౌడ్‌కు సీనియర్లతో పరిచయాలు బాగానే ఉన్నాయి. NSUIలో ఉన్నప్పటి నుంచి పార్టీకోసం పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొంత మౌనంగా ఉన్నా.. తనకు అప్పగించే పనులు చేయాలని చూస్తున్నారట. కాంగ్రెస్‌లో అనుబంధ సంఘాలు.. పార్టీ బలోపేతం వంటి అంశాలు కొంతకాలంగా పట్టించుకోవడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి వీటిని పటిష్ఠపర్చడం అత్యవసరం. సీనియర్ నేతలుగా ఉన్న గీతారెడ్డి, అంజన్‌కుమార్‌లకు పని విభజన ఎలా అన్నది ప్రశ్నే. పైగా మొన్నటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్‌రెడ్డికి.. కొంత అవగాహన ఉన్నందున పని సెట్ చేస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. పీసీసీ స్థాయిలోనే పని విభజన జరిగితే అలకలు ఉంటాయి. ప్రాధాన్యం ఇవ్వలేదన్న కామెంట్స్ వినిపిస్తాయి. దీంతో పదవులు ఇచ్చిన హైకమాండే ఆ పనేదో కూడా చెప్పేస్తే కిక్కురుమనకుండా చేస్తారని గాంధీభవన్ వర్గాల టాక్. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.
