Site icon NTV Telugu

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ల ఆందోళన…!

తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం సీనియర్ల అంశమే సీరియస్‌గా ఉందా? పదవులు దక్కిన వారు ఒంటెద్దు పోకడలకు పోతారని ఆందోళన చెందుతున్నారా? అలకబూనిన పెద్దలను పిలిచి హైకమాండ్‌ క్లారిటీ ఇస్తోందా? ఇకపై సమిష్టి నిర్ణయాలే ఉంటాయని ఢిల్లీ పెద్దలు చెప్పారా? కంట్రోల్‌ బటన్‌ ఎవరి చేతిలో ఉండనుంది? లెట్స్‌ వాచ్‌!

హైపవర్‌ కమిటీ వేయాలని చర్చకు వచ్చిందా?

తెలంగాణ PCC నియామకం తర్వాత అలకలో ఉన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు. మాజీ ఎమ్మెల్యే KLR పార్టీకి రాజీనామ చేశారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు లాంటివారు అలకవీడలేదు. తమను పక్కన పెట్టేసి.. కాంగ్రెస్‌ నాయకత్వాన్ని కాదని.. రేవంత్‌ ఒంటరిగా నిర్ణయాలు తీసుకుని.. అందరిపై రుద్దుతారనే ఆందోళనలో సీనియర్లు ఉన్నారట. అందరినీ కలుపుకొని వెళ్తానని కొత్త పీసీసీ సారథి చెబుతున్నా.. ఆచరణలోకి వచ్చేసరికి అది వర్కవుట్‌ కాదనే ఫీలింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో.. AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌, హైకమాండ్‌లో ముఖ్య నాయకుడు KC వేణుగోపాల్‌ ఈ అంశంపై మాట్లాడినట్టు సమాచారం. ఆ సందర్భంగా పీసీసీ స్థాయిలో సమిష్టి నిర్ణయాల కోసం హైపవర్‌ కమిటీ వేయాలనే చర్చ వచ్చిందట.

పీసీసీకి.. సీనియర్లకు.. ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్‌!

PCCలో ఇప్పటికే కోర్‌ కమిటీ .. సీనియర్‌ నాయకులతో మరో కమిటీ ఉంది. హైపవర్‌ కమిటీ ప్రస్తావన చాలాకాలం తర్వాత తెరమీదకు వచ్చింది. గతంలో డిశ్రీనివాస్‌ హయాంలో ఇలాంటి కమిటీలు వచ్చాయి. ప్రస్తుతం అదే అంశాన్ని చర్చలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్‌లో కోర్‌ కమిటీ అనేది కీలకం. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా.. హైపవర్‌ కమిటీ ప్రస్తావనకు వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. పీసీసీకి, సీనియర్లకు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్‌ ఉండటంతో కలిసి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ తరహా కమిటీ ఉండాలన్నది కాంగ్రెస్‌ సీనియర్ల ఆలోచన.

హైపవర్‌ కమిటీని వేస్తారా? కోర్‌ కమిటీని బలోపేతం చేస్తారా?

హైకమాండ్‌ కూడా రాష్ట్రంలో పార్టీ నాయకత్వాన్ని ఒకేతాటిపైకి తీసుకొచ్చే పనిలో ఉన్నట్టు టాక్‌. అందరినీ కలిపే బాధ్యత తీసుకోవాలని పార్టీ చీఫ్‌ సోనియాగాంధీ కూడా చెప్పడంతో అధిష్ఠానంలోని ముఖ్యనాయకులు తెలంగాణలోని వ్యవహారాలను చక్కబెట్టే పనిలో పడ్డారట. అయితే హైపవర్‌ కమిటీని వేస్తారా? లేదంటే కోర్‌ కమిటీని బలోపేతం చేసి.. పార్టీలో ఒంటెద్దు పోకడలను కట్టడి చేస్తారా అన్నది ప్రశ్నగా ఉంది. పార్టీ ఇంఛార్జ్‌ ఠాగూర్‌తోపాటు, పీసీసీ చీఫ్‌.. సీఎల్పీ నేత, మాజీ పీసీసీ చీఫ్‌లు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్‌ నాయకులకు కోర్‌ కమిటీలో చోటు కల్పిస్తారు. ఈ కమిటీలో ప్రస్తుతం పార్టీలో ఉన్న అన్ని గ్రూపులకు అవకాశం ఇస్తారని టాక్‌. ఆ కమిటీలో నిర్ణయాలు తీసుకుని.. వాటిని పీసీసీ అమలు చేసేలా కట్టడి చేస్తారని ప్రచారం జరుగుతోంది.

వచ్చే ఎన్నికల నాటికి ఈ కమిటీనే కీలకమా?

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు లేవనెత్తిన అనుమానాలను అధిష్ఠానం పరిశీలిస్తోందట. సమగ్ర సమీక్షల తర్వాత కోర్‌ కమిటీ లేదా హైపవర్‌ కమిటీని పవర్ ఫుల్‌ చేయబోతున్నట్టు గాంధీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ కార్యాచరణ అమలు మొదలుకొని.. వచ్చే ఎన్నికల నాటికి అన్ని వ్యవహారాల్లో ఈ కమిటీనే కీలకమయ్యే సూచనలు ఉన్నాయట. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రణాళిక ఉంటే మంచిదని.. లేదంటే కాంగ్రెస్‌లో కుమ్ములాటలు పెరుగుతాయని అనుకుంటున్నారట. టీమ్‌ లీడర్‌ ఎంత బలంగా ఉన్నా.. టీమ్‌ సభ్యులను కలుపుకొని వెళ్లకపోతే మొత్తానికే బలహీన పడే ప్రమాదం ఉందని చర్చ జరుగుతోంది. అందుకే కాంగ్రెస్‌ హైకమాండ్‌ తీసుకోబోయే నిర్ణయంపై పార్టీలో ఉత్కంఠ నెలకొంది.

Exit mobile version