కాంగ్రెస్ పార్టీలో ఎవరేం చేసినా ఓ లెక్క ఉంటుంది. ఎవరికి తోచిన వ్యూహం వాళ్లు అమలు చేస్తారు. తాజాగా పని విభజనపై రగడ మొదలైంది. ముల్లును ముల్లుతోనే తీయబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఎందుకిలా? కొత్త ఎత్తుగడలు ఏం చెబుతున్నాయి?
వర్కింగ్ ప్రెసిడెంట్స్‌కు పని విభజనపై రగడ!
తెలంగాణ కాంగ్రెస్‌కు మొత్తం ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్. సామాజిక సమీకరణాలతోపాటు అన్ని గ్రూపులను బుజ్జగించేందుకు.. ఐదుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా నియమించారు. సంఖ్య ఎక్కువగా ఉండటంతో అందరికీ పని అప్పగించాలని PCCకి దిశానిర్దేశం చేశారు AICC వ్యవహారాల రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్. ఆ మేరకు అందరికీ పని విభజన జరిగింది. ఆ ప్రకటన వెలువడిన తర్వాత ప్రకంపనలు మొదలయ్యాయి. అనుబంధ సంఘాలు.. జిల్లాల కేటాయింపులపై అసంతృప్తులు బయటపడుతున్నారు.
జగ్గారెడ్డికి ఇచ్చిన భువనగిరిలో సమస్య!
నాయకులంతా కలిసి వర్క్ చేసేలా పని విభజన ఉండాలన్నది పీసీసీ నిర్ణయం. అయితే కొత్త పీసీసీపై అసంతృప్తితో ఉన్న నాయకులు ఇంఛార్జ్‌లకు సహకరిస్తారా లేదా అనేది అనుమానాలు ఉన్నాయి. భువనగిరి, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాలను వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అప్పగించారు. ఖమ్మం కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు ఎక్కువ. రేణుకా చౌదరి.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలకు జగ్గారెడ్డి సన్నిహితంగా ఉంటారు. అక్కడ ఇప్పటివరకైతే ఎలాంటి వివాదం లేదు. సమస్య భువనగిరి పార్లమెంట్ నుంచే వస్తోందట.
ఎంపీ వెంకటరెడ్డి.. జగ్గారెడ్డి భువనగిరిలో కలిసి పనిచేస్తారా?
రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా ప్రకటించిన వెంటనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నెగిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. ఆయనే భువనగిరి ఎంపీగా ఉన్నారు. ఇప్పటికీ రేవంత్, కోమటిరెడ్డిలు కలిసి మాట్లాడుకోలేదు. కాకపోతే వెంకటరెడ్డికి జగ్గారెడ్డికి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. కొత్త పీసీసీ ఏర్పాటుకు కసరత్తు జరిగిన రోజుల్లో ఇద్దరూ ఓకే అభిప్రాయంతో ఉన్నారు. కానీ.. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా జగ్గారెడ్డి వ్యవహారం నడుపుతున్నారు. దాంతో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈ ఇద్దరు నాయకులు కలిసి పనిచేస్తారా అన్న డౌట్స్ ఉన్నాయి. పైగా మన ఇద్దరి మధ్య పంచాయితీ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నువ్వు తొందరపడకు. పార్టీలో మనకు మంచిరోజులు వస్తాయి. అప్పుడు పని మొదలుపెడతాం అని జగ్గారెడ్డికి సూచించారట కోమటిరెడ్డి.
అంజన్ ఇంఛార్జ్‌గా రావడంతో మైనారిటీ వర్గాల అభ్యంతరం!
మరో వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్‌కి మైనార్టీ విభాగం బాధ్యతలు అప్పగించారు. ఇక్కడా లొల్లి మొదలైంది. ఆ బాధ్యతలేవో.. అజారుద్దీన్‌కు అప్పగిస్తే బాగుండేదని.. మైనారిటీ విభాగానికి చెందిన నాయకులు వెళ్లి.. కాంగ్రెస్ ముఖ్యనేతకు చెప్పారట. అలాగే ఫిషర్‌మెన్ విభాగాన్ని కూడా అంజన్‌కు ఇవ్వడాన్ని ఆ వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోందట. కానీ.. ఈ మాజీ ఎంపీకి అప్పగించిన బాధ్యతలపట్ల పార్టీ లెక్కలు పార్టీకి ఉన్నాయట.
గీతారెడ్డికి నల్లగొండ అందుకే అప్పగించారా?
నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ విషయంలో ఇద్దరు సీనియర్లు జోక్యం చేసుకున్నారట. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డిల ఎంట్రీతో.. వారితో సఖ్యతగా ఉండే వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డిని ఇంఛార్జ్‌గా వేశారట. తొలుత నల్లగొండకు ఒక బీసీ నాయకుడిని ఇంఛార్జ్‌గా వేద్దామని అనుకున్నారట. ఈ విషయం తెలిసిన వెంటనే రేవంత్‌తో సన్నిహితంగా ఉండే ఓ సీనియర్ నాయకుడి జోక్యంతో గీతారెడ్డి పేరు తెరమీదకు వచ్చిందట.
వర్కింగ్ ప్రెసిడెంట్స్ పని మొదలుపెట్టకుండానే రగడ మొదలు!
ఇక్కడో విచిత్రం ఉంది. తమకు అప్పగించిన పనుల్లో వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇంకా దృష్టి పెట్టకముందే పంచాయితీలు వచ్చి పడుతున్నాయి. ఇక కార్యాచరణ మొదలుపెడితే ఏమౌతుందో ఏమో.. గాంధీభవన్ వర్గాలు మాత్రం.. కొత్త ఎపిసోడ్స్‌పై ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. మరి.. వర్కింగ్ ప్రెసిడెంట్స్ తమకెదురయ్యే సవాళ్లను ఎలా అధిగమిస్తారో చూడాలి.
