NTV Telugu Site icon

కేంద్రమంత్రులు వస్తుంటే టీ బీజేపీ నేతల ఉలికిపాటు…!

కేంద్రమంత్రులు వస్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు ఉలిక్కి పడుతున్నారా? వారేం మాట్లాడతారో.. టీఆర్‌ఎస్‌ నేతల నుంచి ఎలాంటి స్టేట్‌మెంట్‌ వస్తుందో అని టెన్షన్‌లో ఉన్నారా? గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ నేతలు వ్యూహం మార్చారా? దానిపైనే ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందా? ఇంతకీ ఏంటా వ్యూహం?

కేంద్రమంత్రుల ప్రకటనలతో బీజేపీకి ఇరకాటం!

తెలంగాణ బీజేపీ, టీఆర్ఎస్‌ ఒక్కటేనని.. వారిది గల్లీలో ఫైటింగ్‌.. ఢిల్లీలో దోస్తానా అన్నది వైరిపక్షాల విమర్శ. కాంగ్రెస్‌ దీనినే గట్టిగా చెబుతూ వస్తోంది. వాటికి కౌంటర్‌ ఇచ్చే సమయంలో టీఆర్ఎస్‌ నాయకులు, మంత్రులు చేస్తున్న ప్రకటనలు కమలనాథులకు ఇబ్బందిగా మారుతున్నాయి. కేంద్ర సర్కార్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకుందన్న గులాబీ నేతల కామెంట్స్‌ బీజేపీ నాయకులను ఇరకాటంలో పడేస్తున్నాయి. గతంలో హైదరాబాద్‌ వచ్చి.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కలిసిన తర్వాత కేంద్రమంత్రులు చేసిన ప్రకటనలు.. టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై చేసిన ప్రశంసలు చాలానే ఉన్నాయి. వాటికి సమాధానం చెప్పుకోలేక సతమతం అయ్యేవారు బీజేపీ నాయకులు. ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన సమయంలోనూ ఇరకాటంలో పడింది కాషాయ దళం.

జ్యోతిరాదిత్య ప్రగతి భవన్‌కు వెళ్లడంతో కంగుతిన్న బీజేపీ నేతలు?

కేంద్రమంత్రులు రాష్ట్రానికి వచ్చి టీఆర్ఎస్‌ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడకుండా బీజేపీ నేతలు అప్రమత్తం అయ్యారట. ఇటీవల కాలంలో తీసుకున్న జాగ్రత్తలపై చర్చ జరుగుతోంది. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా హైదరాబాద్‌ వస్తే.. పార్టీ నేతలు ఆయన్ని రిసీవ్‌ చేసుకున్నారు. ఆయన షెడ్యూల్‌లో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో లంచ్‌ ఉండటంతో బీజేపీ నేతలు ఉలిక్కి పడ్డారు. జ్యోతిరాదిత్య ప్రగతి భవన్‌కు వెళ్లకుండా ఆపేందుకు విఫలయత్నం చేశారట. అయితే ముందే నిర్ణయమైన కార్యక్రమం కావడంతో వెళ్లక తప్పదని చెప్పి.. ప్రగతిభవన్‌కు వెళ్లారు జ్యోతిరాదిత్య. కాకపోతే బీజేపీ ఆఫీస్‌కు వచ్చి మీడియాతో మాట్లాడతానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారట. ఆ విధంగా బీజేపీ ఆఫీస్‌కు వచ్చిన జ్యోతిరాదిత్య.. ప్రగతిభవన్‌లో సీఎంతో జరిగిన మాటామంతి వివరించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. దీంతో హమ్మయ్య అనుకున్నారు బీజేపీ నాయకులు.

టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై మరో కేంద్రమంత్రి శోభ కరంద్లాజె ఫైర్‌!

ఇటీవల రాష్ట్రానికి వచ్చిన మరో కేంద్ర మంత్రి శోభ కరంద్లాజె విషయంలోనూ బీజేపీ నేతలు అలెర్ట్‌ అయ్యారట. అధికారిక కార్యక్రమానికి వచ్చినా.. బండి సంజయ్‌ పాదయాత్రలోనూ పాల్గొన్నారామె. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి ప్రశంసించారని మీడియాలో హోరెత్తడంతో శోభ.. తీవ్రస్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు. వ్యవసాయ విధానంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. వారం క్రితం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ సహాయమంత్రి కూడా టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు అనుకూలంగా మాట్లాడకుండా బీజేపీ నేతలు అప్రమత్తంగా వ్యవహించారట. ఇక ముందు కూడా ఇదే విధంగా ఉండాలని అనుకుంటున్నారట.

కేంద్రమంత్రులను కనిపెడుతూ బీజేపీ నేతలు వెంటే ఉంటారా?

కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా వచ్చినప్పుడు ఆయన వెంట.. బీజేపీ నేతలు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావులు ఉన్నారు. కానీ.. కేంద్రమంత్రితోపాటు ప్రగతిభవన్‌కు వెళ్లలేదు. కాకపోతే కేంద్రమంత్రులు ఏదో ఒకటి మాట్లాడి.. పార్టీని ఇబ్బంది పెట్టకుండా కాపుకాచుకుని ఉంటున్నట్టు సమాచారం. గతంగతః ఇకపై మాత్రం ఇదే రీతిన రాష్ట్రానికి వచ్చే కేంద్రమంత్రుల వెంట బీజేపీ నేతలు ఉండాలని.. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడకుండా వారిని కట్టడి చేయాలని అనుకుంటున్నారట. ఈ వైఖరిపైనే ఇప్పుడు కాషాయ శిబిరంలో చర్చ. మరి.. ఈ విషయంలో తెలంగాణ కమలనాథులు ఎంత వరకు సక్సెస్‌ అవుతారో చూడాలి.