NTV Telugu Site icon

టీడీపీలో ‘నా గుణింతం’… పట్టాభికి ఆ అవసరం ఎందుకొచ్చింది?

ఏపీ టీడీపీ నేతలు ఉన్నట్టుండి నా గుణింతాన్ని వల్లె వేస్తున్నారా? బోస్‌డీకే అంటూ.. రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన పట్టాభి రీఎంట్రీ తర్వాత ఇది మరీ ఎక్కువైందా? కొత్త పల్లవిపై టీడీపీ వర్గాల స్పందనేంటి?

నా గుణింతం వల్లె వేసిన పట్టాభి..!

పార్టీ గొప్పదా.. వ్యక్తులు గొప్పా? ప్రస్తుతం టీడీపీలో ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. బోస్‌డీకే అని విమర్శించి.. రాజకీయ వేడి రగిలించి.. జైలుకెళ్లొచ్చాక.. ఫ్యామిలీతోపాటు విదేశాల్లో రిలాక్స్‌ అయిన టీడీపీ నేత పట్టాభి.. మీడియా ముందుకొచ్చిన తర్వాత ఈ ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. తాను వెనక్కి తగ్గలేదని.. రోజూ విరుచుకుపడతానని చెప్పిన పట్టాభి.. నేను.. నేను.. నేను.. అంటూ కొన్ని నిమిషాలపాటు తన గురించి గొప్పగా చెప్పేసుకున్నారు. మధ్యలో పసుపు సైనికులు అనే పదాలు వాడినప్పటికీ .. నా గుణింతం మధ్యలో అవి తేలిపోయాయి.

ప్రెస్‌మీట్స్‌ వల్ల కాదు.. కేడర్‌ వల్లే పార్టీ నిలబడిందని టీడీపీలో సెటైర్లు..!

మీడియా ముందు సడెన్‌ రీఎంట్రీ ఇచ్చిన పట్టాభి.. ఈవిధంగా నా గుణింతం వల్లె వేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. పట్టాభి కామెంట్స్‌ విన్నాక.. టీడీపీలో ఆయన మినహా ఇంకెవరూ ప్రభుత్వాన్ని పెద్దగా విమర్శించడం లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయని చెవులు కొరుక్కుంటున్నారట. ఏసీ రూముల్లో కూర్చొని ప్రెస్‌మీట్స్‌ పెట్టేవారి కంటే.. ఫీల్డ్‌లో పార్టీ జెండా మోస్తూ బరిలో తొడకొట్టే వారివల్లే టీడీపీ మనుగడలో ఉందని స్వరం పెంచుతున్నారు తమ్ముళ్లు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పుంగనూరు పరిధిలోని ఓ గ్రామంలో తొడకొట్టిన ఓ వృద్ధ కార్యకర్త గురించి ప్రస్తావిస్తున్నారట. కష్టాల్లోనూ పార్టీ నిలబడిందంటే అలాంటి కేడర్‌ వల్లేనని గుర్తు చేస్తున్నారు నేతలు.

పట్టాభి మాట్లాడితే దాడులు చేసే వరకు వెళ్లిందని వ్యంగ్యాస్త్రాలు..!

పట్టాభి తరహాలో కాకున్నా.. పయ్యావుల కేశవ్‌ అడపాదడపా ప్రెస్‌మీట్స్‌ పెట్టి ప్రభుత్వాన్ని ఆసాంతం కదిలిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. సీనియర్‌ నాయకులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి లాంటి వారు సైతం అధికారపార్టీని తమదైన శైలిలో కార్నర్‌ చేస్తున్న అంశాన్ని మర్చిపోవద్దని చెబుతున్నాయి శ్రేణులు. ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించేలా పట్టాభి మీడియా సమావేశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఈ రెండున్నరేళ్లలో అలాంటివి ఏమీ లేవని గట్టిగానే వాదిస్తున్నాయట పార్టీ వర్గాలు. పైగా ఆయన వాడిన భాష కారణంగా వైసీపీ వాళ్లు టీడీపీ ఆఫీసులపై దాడులు చేసే వరకు వెళ్లాయని సెటైర్లు వేస్తున్నారు.

అన్నింటిలో పార్టీ కంటే ఎక్కువ అని అనుకుంటున్నారా?

40 ఏళ్లపాటు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు సైతం అన్నిసార్లు నేను.. నేను.. నేను అని పట్టాభిలా చెప్పుకొని ఉండరని మరికొందరు గుర్తు చేస్తున్నారు. అన్నింటిలోనూ పార్టీ కంటే తాను ఎక్కువ అనే అనే రీతిలో పట్టాభి మాట్లాడం వారికి నచ్చడం లేదట. పైగా టీడీపీలో అధికార ప్రతినిధి పదవి దక్కించుకున్న జీవీరెడ్డి ఏ అంశంపై మాట్లాడారో.. అదే విషయాన్ని మర్నాడే పట్టాభి మీడియాలో చెప్పడం వెనక మర్మం కేడర్‌కు అర్థం కాలేదట. తెలుగుదేశం శిబిరంలో ప్రస్తుతం దీనిపైనే చర్చ. మరి.. నా గుణింతాన్ని పట్టాభి ఎంత దూరం తీసుకెళ్తారో చూడాలి.